Achinta Sheuli | న్యూఢిల్లీ: భారత యువ వెయిట్‌లిఫ్టర్ అచింతా చెహులీ చిక్కుల్లో పడ్డాడు. పారిస్ ఒలింపిక్స్ సన్నాహక శిబిరం కోసం ప్రస్తుతం జాతీయ క్రీడా అకాడమీ(ఎన్ఐఎస్) పటియాలలో శిక్షణ పొందుతున్న అచింత.. అమ్మాయిల హాస్టల్లోకి ప్రవేశించాడు. క్రీడా అకాడమీ నిబంధనలు ఉల్లంఘించిన అచింతను క్యాంప్ నుంచి తప్పిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
అమ్మాయిల హాస్టల్లోకి అచింత వెళ్తున్న వీడియో సాక్ష్యాధారాలు ఉన్నట్లు ఎన్ఐఎస్ పటియాల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వినీత్‌కుమార్ శనివారం పేర్కొన్నాడు. ‘ఇలాంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. అతన్ని వెంటనే క్యాంప్ విడిచిపెట్టి వెళ్లాలని ఆదేశించాం. వీడియోను ఢిల్లీలోని సాయ్ ప్రధాన కేంద్ర కార్యాలయంతో పాటు జాతీయ వెయిట్‌లిఫ్టింగ్ అసోసియేషన్‌కు కూడా పంపాం.
ఇప్పటికైతే సాయ్ ఎలాంటి విచారణ ప్యానెల్ ఏర్పాటు చేయలేదు’ అని కుమార్ అన్నారు. అచింతపై వేటుతో ఈ నెలలో థాయ్‌లాండ్‌లో జరిగే ఐడబ్ల్యూఎఫ్ ప్రపంచకప్ టోర్నీకి దూరమయ్యాడు. ఈ కారణంగా పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించే అవకాశాన్ని ఈ వెయిట్‌లిఫ్టర్ చేజార్చుకున్నాడు.