న్యూఢిల్లీ: ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ షూటింగ్ ప్రపంచకప్‌లో భారత షూటర్లు రుద్రాంక్ష్ బాలాసాహెబ్ పాటిల్ స్వర్ణం, అభినవ్ షా, రమిత రజత పతకాలతో సత్తా చాటారు. జర్మనీ వేదికగా బుధవారం జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్లో రుద్రాంక్ష్ 17-13తో అభినవ్‌ను ఓడించాడు. రుద్రాంక్ష్ పసిడి, అభినవ్ వెండి మెడల్స్ పంచుకోగా.. నిల్స్ పల్బర్గ్ (జర్మనీ) కాంస్యంతో సరిపెట్టుకున్నాడు. మహిళల తుది పోరులో రమిత 8-16తో ఒసియాన్నె ముల్లర్ (ఫ్రాన్స్) చేతిలో ఓడి రజతం కైవసం చేసుకుంది. క్వాలిఫికేషన్లో రుద్రాంక్ష్ (627.5 పాయింట్లు), రమిత (630.5 పాయింట్లు) అగ్రస్థానాన్ని పొందారు. మూడు పతకాలతో పట్టికలో భారత్ మొదటి స్థానంలో నిలిచింది.