Shooting Championship | న్యూఢిల్లీ: పొలిష్ గ్రాండ్‌ప్రి షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్లు అదరగొడుతున్నారు. సోమవారం జరిగిన వేర్వేరు విభాగాల్లో మన షూటర్లు ఆరు పతకాలు ఖాతాలో వేసుకున్నారు. పురుషుల 50మీటర్ల రైఫిల్-3 పొజిషన్లో అఖిల్ షెరాన్ పసిడి పతకంతో మెరిశాడు.
ఆఖరి వరకు హోరాహోరీగా సాగిన పోరులో అఖిల్ 468.4 పాయింట్లతో టాప్‌లో నిలువగా, ప్యాట్రిక్ జనీ, లొంగో స్లాస్కా వరుసగా రజత, కాంస్య పతకాలు దక్కించుకున్నారు. పురుషుల 25మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్‌లో అనీశ్ భన్వాల పసిడి కైవసం చేసుకున్నాడు. పురుషుల రైఫిల్ 3 పొజిషన్లో నీరజ్‌కుమార్ రెండు కాంస్య పతకాలు సొంతం చేసుకోగా, మహిళల 3 పొజిషన్లో శ్రీయాంకకు కాంస్యం, అశి చౌక్సీకి రజతం లభించాయి.