పతక శతకం.. పారా ఆసియాడ్‌లో భారత్ కొత్త చరిత్ర
ఆసియా పారా గేమ్స్‌లో భారత పారా అథ్లెట్లు సత్తా చాటారు. గత ఎడిషన్‌తో పోలిస్తే దాదాపు సగం మందితో (168)నే బరిలోకి దిగినా.. మూడేండ్ల కిందటి కంటే ఆరు పతకాలు ఎక్కువ సాధించారు. తమ పోటీలకు చివరి రోజైన శుక్రవారం ఏకంగా 9 స్వర్ణ పతకాలు సహా 26 పతకాలు కొల్లగొట్టిన భారత్ పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది.
- 30 గోల్డ్ సహా 114 మెడల్స్‌తో రికార్డు
- ఆఖరి రోజు 9 స్వర్ణాలు కైవసం
ఆసియా గేమ్స్‌లో భారత రెగ్యులర్ అథ్లెట్లు అంచనాలను అందుకోలేక నిరాశపరిచినా.. అదే వేదికపై మన పారా క్రీడాకారులు అద్భుతం చేశారు. పారా ఆసియా గేమ్స్‌లో అసాధారణ పోరాట పటిమతో మరోసారి పతక శతకం సాధించడమే కాకుండా ఈ గేమ్స్ చరిత్రలో అత్యధికంగా 114 పతకాలు సొంతం చేసుకొని సరికొత్త రికార్డు సృష్టించారు. అంచనాలను మించి రాణించిన మన పారా వీరుల బృందం 30 స్వర్ణాలు, 35 రజతాలు, 49 కాంస్యాలతో తమ పోరు ముగించింది.
నగోయా (జపాన్) : ఆసియా పారా గేమ్స్‌లో భారత పారా అథ్లెట్లు సత్తా చాటారు. గత ఎడిషన్‌తో పోలిస్తే దాదాపు సగం మందితో (168)నే బరిలోకి దిగినా.. మూడేండ్ల కిందటి కంటే ఆరు పతకాలు ఎక్కువ సాధించారు. తమ పోటీలకు చివరి రోజైన శుక్రవారం ఏకంగా 9 స్వర్ణ పతకాలు సహా 26 పతకాలు కొల్లగొట్టిన భారత్ పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. చైనా (427), జపాన్ (185), ఉజ్బెకిస్థాన్ (145) టాప్-3 స్థానాలను కైవసం చేసుకోగా.. దక్షిణ కొరియా 28 స్వర్ణాలు సహా 97 పతకాలతో ఐదోస్థానంలో ఉంది. శనివారంతో మెగా గేమ్స్‌కు ఆధికారిక ముగింపు పడనుండగా… చివరి రోజు కొరియాకు ఐదు స్వర్ణాల అవకాశాలు ఉన్నాయి. కనీసం మూడు గోల్డ్ మెడల్స్ నెగ్గినా భారత్‌ను ఐదో స్థానానికి నెట్టి కొరియా టాప్-4లో రానుంది.
అథ్లెటిక్స్‌లో ప్రపంచ రికార్డుల మోత
భారత పతకాల హోరులో పారా అథ్లెటిక్స్ విభాగం సింహభాగం వహించి మొత్తం 65 పతకాలను అందించింది.చివరి రోజు జరిగిన పురుషుల 400 మీటర్ల టీ64 ఫైనల్లో సందీప్ 52.28 సెకన్ల ప్రపంచ రికార్డు టైమింగ్‌తో స్వర్ణం గెలుచుకోగా, అజయ్ కుమార్ కాంస్యం సాధించాడు. జావెలిన్ త్రో ఎఫ్37/38 ఈవెంట్లో హేనీ 60.49 మీటర్ల ప్రపంచ రికార్డు త్రోతో పసిడి పతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఎఫ్ 42-44/61-64 విభాగంలో పారాలింపిక్ చాంపియన్ సుమిత్ అంటిల్ 72.46 మీటర్ల అత్యుత్తమ త్రోతో స్వర్ణం నెగ్గాడు. మహేంద్ర గుర్జర్, సంజయ్ సందీప్ రజతం, కాంస్యం గెలవడంతో భారత్ ఈ ఈవెంట్లో క్లీన్ స్వీప్ సాధించింది. ఇక, పురుషుల క్లబ్ త్రోలో వీల్‌చైర్ అథ్లెట్ ప్రణవ్ సూర్మ 32.87 మీటర్ల గేమ్స్ రికార్డుతో స్వర్ణం సాధించి భారత్‌కు ఆఖరి పసిడిని అందించాడు. లాంగ్ జంప్ టీ47లో నిమిషా , 1500 మీటర్ల టీ46 పరుగులో పర్మోద్ బిజార్నియా రజతాలు సాధించారు.
షట్లర్ల పసిడి తీన్ మార్
బ్యాడ్మింటన్ లో భారత షట్లర్లు నితేశ్ కుమార్, తులసిమతి, నవీన్ స్వర్ణ పతకాలతో మెరిశారు. పురుషుల సింగిల్స్ ఎస్ఎల్3 ఫైనల్లో పారిస్ పారాలింపిక్ చాంపియన్ నితేశ్ కుమార్ 21-18, 21-16తో తోటి ఆటగాడు, టోక్యో పారాలింపిక్ చాంప్ ప్రమోద్ భగత్‌ను ఓడించి పసిడి సాధించాడు. ఆపై మిక్స్డ్ డబుల్స్‌లో తులసిమతితో జత కట్టిన నితేశ్ ఫైనల్లో ఓడి రజతం కూడా ఖాతాలో వేసుకున్నాడు. ఇక, ఎస్ఎల్ 4 విభాగం సింగిల్స్ లో నవీన్ శివకుమార్ 21-9, 21-17తో ఇండోనేషియా షట్లర్ ఫ్రెడీ సెటియావాన్‌ను ఓడించి తొలి ప్రయత్నంలోనే స్వర్ణం గెలుచుకున్నాడు. మహిళల డబుల్స్ ఎస్ ఎల్ 3-ఎస్ యూ5 ఫైనల్లో తులసిమతి – మానసి జోషి ద్వయం 21-16, 21-13తో చైనా జంటపై విజయం సాధించి పసిడిని కైవసం చేసుకుంది. ఆర్చరీ పురుషుల డబుల్స్ రికర్వ్ లో పారాలింపిక్ చాంపియన్ హర్విందర్ సింగ్- విజయ్ సుండి జోడీ 5-1తో చైనా జట్టును చిత్తు చేసి స్వర్ణ పతకం సాధించింది.
స్విమ్మర్ హిమాన్షు హ్యాట్రిక్
పారా స్విమ్మింగ్‌లో భారత స్విమ్మర్లు అంచనాలకు మించి రాణించి మొత్తం 11 పతకాలు సాధించారు. చూపులేమి సవాలును అధిగమించిన 22 ఏండ్ల హిమాన్షు నందాల్ పురుషుల 100 మీటర్ల ఫ్రీస్టైల్ ఎస్11 విభాగంలో 1:05.90 సెకండ్ల టైమింగ్‌తో కాంస్యం సాధించి, ఈ టోర్నీలో తన పతకాల హ్యాట్రిక్‌ను పూర్తి చేసుకున్నాడు. అంతకుముందు రవి బుడిగిన కూడా ఈ ఈవెంట్లో మూడు పతకాలు (రెండు రజతాలు, ఒక కాంస్యం) సాధించి సత్తా చాటాడు.
షూటర్ మోనా మ్యాజిక్

షూటింగ్లో పారా షూటర్ మోనా అగర్వాల్ ప్రపంచ రికార్డును బద్దలు కొడుతూ సంచలనం సృష్టించింది. మహిళల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ ఎస్‌హెచ్1 విభాగంలో ఆమె 357.5 పాయింట్లు సాధించి కొత్త ప్రపంచ రికార్డుతో ఈ మెగా ఈవెంట్లో తన రెండో స్వర్ణాన్ని ఖాయం చేసుకుంది. అంతకుముందు ఆమె 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ (స్టాండింగ్)లోనూ గేమ్స్ రికార్డుతో స్వర్ణం సాధించింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

