హైదరాబాద్‌ను హ్యాండ్‌బాల్ హబ్‌గా మార్చేందుకు అడుగులు పడుతున్నాయి. క్రికెట్, హాకీ, ఫుట్‌బాల్, బ్యాడ్మింటన్ లాంటి స్పోర్ట్స్‌కు ఏమాత్రం తీసిపోకుండా హ్యాండ్‌బాల్ అభివృద్ధికి పక్కా ప్రణాళిక తయారైంది. అంతర్జాతీయ స్థాయి వసతులతో భాగ్యనగరం వేదికగా హ్యాండ్‌బాల్ అకాడమీ ఏర్పాటుకు సన్నాహకాలు మొదలవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో అకాడమీతో పాటు హాస్టల్ సౌకర్యాలు నెలకొల్పబోతున్నట్లు జాతీయ హ్యాండ్‌బాల్ అసోసియేషన్(హెచ్ఎఫ్ఐ) అధ్యక్షుడు జగన్మోహన్రావు పేర్కొన్నారు. ఆసియా క్లబ్ లీగ్ టోర్నీని విజయవంతంగా నిర్వహించిన నేపథ్యంలో ‘నమస్తే తెలంగాణ’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన పలు అంశాలపై మాట్లాడారు.
హైదరాబాద్‌లో అకాడమీ ఎలా ఉండబోతున్నది?
అంతర్జాతీయ నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా హ్యాండ్‌బాల్ అకాడమీని నెలకొల్పబోతున్నాం. అంతర్జాతీయ హ్యాండ్‌బాల్ అసోసియేషన్ ప్రతినిధులను కలిసినప్పుడు హైదరాబాద్‌లో అకాడమీ ఏర్పాటు చేయాలన్న ఆలోచనను వారితో పంచుకున్నా. దానికి వారు సమ్మతించారు. అందుకు అనుగుణంగా ఒకవైపు అకాడమీ నిర్మాణ పనులతో పాటు కోచింగ్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తాం. భవిష్యత్‌లో హైదరాబాద్‌ను హ్యాండ్‌బాల్‌కు హబ్‌గా తీర్చిదిద్దే ఆలోచనతో ఉన్నాం. ఇందుకోసం త్వరలో ఒక బృందం..వివిధ దేశాల్లోని అకాడమీలను సందర్శించనుంది. వారి నివేదిక, నిపుణుల ఆలోచనకు అనుగుణంగా అకాడమీని ఏర్పాటు చేస్తాం. ఇందులో హాస్టల్ వసతితో పాటు జిమ్, స్విమ్మింగ్‌పూల్, స్పోర్ట్స్ సైన్స్ సెంటర్ వంటి సౌకర్యాలు అందుబాటులోకి తెస్తాం.
ద్వితీయ శ్రేణి నగరాలపై మీ ఫోకస్?
రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో హైదరాబాద్ వేదికగా ఒక అంతర్జాతీయ, రెండు జాతీయ స్థాయి టోర్నీలను నిర్వహించాం. భారీ ఏర్పాట్లతో టోర్నీలను నిర్వహించడం ద్వారా హైదరాబాద్‌కు ఒక బ్రాండ్ఇమేజ్ వచ్చింది. రానున్న రోజుల్లో దీన్ని భాగ్యనగరానికే పరిమితం చేయకుండా రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాలైన కరీంనగర్, వరంగల్, సిద్దిపేటలో నిర్వహించాలన్న ఆలోచనతో ఉన్నాం. రాష్ట్రంలో హ్యాండ్బాల్తో పాటు ఇతర క్రీడల అభివృద్ధికి నా వంతు సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నాను.
హ్యాండ్‌బాల్‌కు ఆదరణ ఎలా ఉంది?
క్రికెట్, హాకీ, ఫుట్‌బాల్, బ్యాడ్మింటన్ లాంటి మాస్ క్రీడలతో పోల్చుకుంటే హ్యాండ్‌బాల్‌కు కూడా ఊహించిన రీతిలో ఆదరణ లభిస్తున్నది. ఏ ఆటకైనా ప్రతిభావంతులైన ప్లేయర్లు చాలా కీలకం. అందుకే జట్ల ఎంపిక విషయంలో ఎలాంటి వివక్షకు తావులేకుండా అత్యుత్తమ ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుంటున్నాం. మరో రెండు, మూడు నెలల్లో నిర్వహించే ప్రీమియర్ హ్యాండ్‌బాల్ లీగ్ ద్వారా ఈ దిశగా తొలి అడుగులు పడనున్నాయి.
హెచ్ఎఫ్ఐ అధ్యక్షుడిగా మీ విజన్ ఏంటి?
హెచ్ఎఫ్ఐ అధ్యక్షుడిగా బాధ్యతలు అందుకున్న తక్కువ వ్యవధిలోనే విప్లవాత్మక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఈ కారణంగా జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ టోర్నీల్లో మన జట్లు అద్భుత విజయాలు సొంతం చేసుకున్నాయి. గతానికి భిన్నంగా ప్రతీ టోర్నీని ఇండోర్‌లో నిర్వహిస్తున్నాం. ఇటీవల ఆసియా మహిళల జూనియర్ టోర్నీలో భారత్ విజేతగా నిలువడం ఇందుకు నిదర్శనం. హిమాచల్‌ప్రదేశ్‌లో ప్రత్యేకంగా హ్యాండ్‌బాల్ క్యాంప్ నిర్వహిస్తున్నాం. ఇక్కడ దాదాపు 200 మంది అమ్మాయిలు శిక్షణ పొందుతున్నారు. ఈ అకాడమీకి సాయ్తో పాటు హెచ్ఎఫ్ఐ ఆర్థిక సాయం అందిస్తున్నది.