స్వితోలినాకు కోస్త్యుక్ షాక్.. ఆండ్రీవా ముందంజ
పారిస్ : టాప్ ప్లేయర్లు, సీడెడ్ ఆటగాళ్లు అనామకుల చేతుల్లో ఓడుతూ ఇంటిదారి పడుతున్నా.. ఫ్రెంచ్ ఓపెన్‌లో జర్మనీ స్టార్ అలెగ్జాండర్ జ్వెరెవ్ జోరు మాత్రం తగ్గడం లేదు. ఎర్రమట్టి కోర్టులో టాప్ గేర్‌లో దూసుకుపోతున్నాడు. అద్భుత ఆటతో అదరగొడుతున్న జ్వెరెవ్ అలవోకగా సెమీఫైనల్ చేరుకొని టైటిల్‌కు రెండు అడుగుల దూరంలో నిలిచాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ జ్వెరెవ్ 7-6 (7/3), 6-1, 6-3తో వరుస సెట్లలో 27వ సీడ్, యువ సంచలనం రఫేల్ జోడార్ను చిత్తుగా ఓడించాడు. ఏకపక్ష పోరులో పవర్ఫుల్ సర్వీస్‌తో విజృంభించిన అలెగ్జాండర్.. ఏడు ఏస్‌లతో ప్రత్యర్థిని హడలెత్తించాడు. పోటాపోటీగా సాగిన తొలి సెట్‌ను టై బ్రేక్‌లో గెలుచుకున్న రెండో సీడ్ ప్లేయర్ ఆ తర్వాత తన మార్కు పవర్ గేమ్‌తో చెలరేగాడు. తను నాలుగు బ్రేక్ పాయింట్లు గెలవగా.. ప్రత్యర్థి ఒక్క బ్రేక్ పాయింట్‌కే పరిమితం అయ్యాడు.
అయితే, మ్యాచ్ ఆరంభంలో 19 ఏండ్ల జోడార్ నుంచి జ్వెరెవ్‌కు గట్టి పోటీ ఎదురైంది. ఒక దశలో జోడార్ 5-3తో ఆధిక్యంలో నిలిచి, సెట్ కోసం సర్వ్ చేసే సువర్ణావకాశాన్ని దక్కించుకున్నాడు. అయితే, ఒత్తిడిని అధిగమించి పుంజుకున్న జ్వెరెవ్, తదుపరి ఐదు గేమ్స్‌లో నాలుగు గెలుచుకుని మ్యాచ్‌ను టై-బ్రేక్‌కు లాగాడు. టై-బ్రేక్‌లో తన అనుభవాన్ని అంతా ఉపయోగించి సెట్‌ను కైవసం చేసుకున్నాడు. ఈ ఉత్సాహంతో జ్వెరెవ్ రెండో సెట్లో మరింత ఉధృతంగా ఆడాడు. ప్రపంచ టెన్నిస్‌లోనే అత్యుత్తమ సర్వీస్‌లు చేయగల సామర్థ్యం ఉన్న ఈ జర్మన్ స్టార్.. ఆరంభంలోనే జోడార్ సర్వీస్‌ను బ్రేక్ చేశాడు. ఆ తర్వాత ఓ అద్భుతమైన డ్రాప్ షాట్‌తో డబుల్ బ్రేక్ సాధించి ఏడో గేమ్‌లో సెట్ నెగ్గాడు. చివరి సెట్ తొలి గేమ్‌లోనే జోదార్ సర్వ్‌ను బ్రేక్ చేసిన జ్వెరెవ్, ఆ తర్వాత తన సర్వీస్‌ను నిలబెట్టుకుంటూ ఆధిక్యాన్ని 4-3కు పెంచుకున్నాడు. అదే జోరుతో వరుస పాయింట్లు నెగ్గిన రెండో సీడ్ ప్లేయర్ ఓ మెరుపు ఫోర్‌హ్యాండ్ విన్నర్‌తో మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు.

మెగా టోర్నీ మహిళల సింగిల్స్ సెమీఫైనల్స్ అత్యంత ఆసక్తికరంగా మారాయి. ఉప్పు-నిప్పు లాంటి దేశాలైన రష్యా, ఉక్రెయిన్‌కు చెందిన ప్లేయర్లు సెమీస్ ఫైట్‌కు రెడీ అయ్యారు. రష్యా టీనేజ్ సెన్సేషన్ మిరా ఆండ్రీవా, ఉక్రెయిన్ ప్లేయర్ మార్తా కోస్త్యుక్ క్వార్టర్ ఫైనల్స్ దాటి ముందంజ వేశారు. క్లే కోర్టుపై ఈ సీజన్లో అత్యుత్తమ ఫామ్‌లో ఉన్న 15వ సీడ్ కోస్త్యుక్ హోరాహోరీగా సాగిన పోరులో తమ దేశానికే చెందిన స్టార్ ప్లేయర్, ఏడో సీడ్ ఎలినా స్వితోలినాకు షాకిచ్చింది. కోస్త్యుక్ 6-3, 2-6, 6-2తో స్వితోలినాపై గెలిచి తన కెరీర్లో తొలిసారి ఓ మేజర్ టోర్నీలో సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. తద్వారా 1968 తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ సెమీస్‌లో అడుగుపెట్టిన ఉక్రెయిన్ తొలి మహిళగా చరిత్ర సృష్టించింది. మరోవైపు స్వితోలినా ఈ టోర్నీ క్వార్టర్ ఫైనల్లో ఓడిపోవడం ఇది ఆరోసారి కావడం గమనార్హం. ఇంకో మ్యాచ్‌లో ఆండ్రీవా 6-0, 6-3 తేడాతో రుమేనియాకు చెందిన 36 ఏండ్ల సీనియర్ క్రీడాకారిణి సోరానా సిరిస్టాను చిత్తు చేసింది. తన కెరీర్లో చివరి సీజన్ ఆడుతున్న సిరిస్టాపై ఆండ్రీవా బేస్‌లైన్ నుంచి పదునైన షాట్లతో విరుచుకుపడింది. ఆండ్రీవా ఫ్రెంచ్ ఓపెన్ సెమీఫైనల్‌కు చేరడం ఇది రెండోసారి. బుధవారం ఆండ్రీవా.. కోస్త్యుక్ మధ్య జరిగే సెమీస్ ఈ టోర్నీకే హైలైట్ కానుంది.