న్యూయార్క్: ఫిఫా వరల్డ్‌కప్(FIFA Worldcup)ను అమెరికా కో-హోస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజా టోర్నీలో అమెరికా జట్టు కూడా చరిత్రాత్మక రీతిలో ప్రదర్శన ఇస్తున్నది. రౌండ్16లో ఇవాళ బెల్జియం జట్టుతో అమెరికా తలపడనున్నది. కానీ ఆ దేశానికి చెందిన స్టార్ ఫార్వర్డ్ ప్లేయర్ ఫోలారిన్ బలొగన్పై గత మ్యాచ్‌లో సస్పెన్షన్ విధించారు. బోస్నియాతో జరిగిన రౌండ్32 మ్యాచ్‌లో బలోగన్‌కు రెడ్ కార్డ్ జారీ చేశారు. ఫుట్‌బాల్ టోర్నీల్లో ఓ ప్లేయర్‌కు రెడ్ కార్డు ఇస్తే, అప్పుడు ఆ ప్లేయర్ తన తర్వాత మ్యాచ్‌లో ఆడరాదు. అతనిపై తక్షణమే ఓ మ్యాచ్ నిషేధం అమలులోకి వస్తుంది.
కానీ అమెరికా తరపున బలొగన్ కీలక ప్లేయర్‌గా మారాడు. ఇక రౌండ్16లో బెల్జియంను ఢీకొట్టాంటే అతను జట్టులో ఉండడం చాలా అవసరం. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ జోక్యం చేసుకున్నట్లు తెలుస్తోంది. బలోగన్‌పై ఒక్క మ్యాచ్ సస్పెన్షన్ ఎత్తివేయాలని ఫిఫా అధికారులకు ట్రంప్ ఫోన్ చేసినట్లు తెలిసింది. దీంతో బెల్జియంతో జరిగే కీలక పోరులో అతను ఆడేందుకు ఫిఫా అనుమతి ఇచ్చినట్లు తెలిసింది. బలోగన్ ప్రస్తుత టోర్నీలో ఆమెరికా తరపున ఇప్పటికే మూడు గోల్స్ చేశాడు.
బలోగన్‌పై సస్పెన్షన్ ఎత్తివేయడాన్ని బెల్జియం తప్పుపట్టింది. 1962 తర్వాత రెడ్ కార్డు జారీ చేసిన ప్లేయర్‌పై సస్పెన్షన్ ఎత్తివేయడం ఇదే తొలిసారి అవుతుంది. బలోగన్ అంశాన్ని తేల్చేందుకు ఫిఫా అధ్యక్షుడు గియన్ని ఇన్ఫాంటినోకు ట్రంప్ ఫోన్ చేశారు. రెడ్ కార్డు అంశంపై నిర్ణయాన్ని సమీక్షించాలని ట్రంప్ కోరినట్లు తెలిసింది. ఇక ట్రంప్ తన సోషల్ మీడియా అకౌంట్లో ఫిఫాకు థ్యాంక్స్ తెలిపారు. ఫిఫా చర్యలను బెల్జియం ఫుట్‌బాల్ సమాఖ్య తప్పుపట్టింది.