Babar Azam: అదేంటీ పొట్టి ప్రపంచకప్‌నకు నేపాల్ అర్హత సాధిస్తే.. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ సంబరపడి పోవడానికి కారణమేంటి అనుకుంటున్నారా? అక్కడే ఉంది మెలిక! ప్రస్తుతం వన్డే ఫార్మాట్లో ప్రపంచ నంబర్‌వన్ బ్యాటర్‌గా కొనసాగుతున్న బాబర్ ఆజమ్.. నేపాల్, ఐర్లాండ్, యూఏఈ, జింబాబ్వే, వెస్టిండీస్ వంటి చిన్న జట్లపైనే పరుగుల వరద పారిస్తాడనే గుర్తింపు బలంగా ఉండటమే దీనికి కారణం. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, భారత్, ఇంగ్లండ్ వంటి పెద్ద జట్లతో తరచూ సిరీస్‌లు ఆడి వరల్డ్ నంబర్ వన్ స్థానం దక్కించుకుంటే అందులో ఓ కిక్కు ఉంటుంది కానీ.. జింబాబ్వే, వెస్టిండీస్‌పై రాణించి బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరిన బాబర్‌పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతున్నది.
ఇటీవల జరిగిన ఆసియాకప్‌లోనూ ఇదే విషయం స్పష్టమైంది. ముల్తాన్ వేదికగా నేపాల్‌తో జరిగిన పోరులో బాబర్ రెచ్చిపోయిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ స్థాయిలో పెద్దగా అనుభవం లేని నేపాల్ బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడిన బాబర్ 131 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్సర్లతో 151 పరుగులు సాధించాడు. ఆ తర్వాత జరిగిన మ్యాచ్‌ల్లో బాబర్ ఇదే జోరు కనబర్చలేకపోయాడు. ముఖ్యంగా భారత్, శ్రీలంకతో మ్యాచ్‌ల్లో అతడు పేలవ ఆటతీరు కనబర్చాడు. దీంతో సామాజిక మాధ్యమాల్లో బాబర్‌ను చెడుగుడు ఆడుకున్నారు. ఇప్పుడిక నేపాల్ వచ్చే ఏడాది జరుగనున్న టీ20 ప్రపంచకప్‌నకు అర్హత సాధించడంతో బాబర్ పంట పండిందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
యూఏఈని చిత్తు చేసి ముందంజ
టీ20 ప్రపంచకప్ ఆసియా క్వాలిఫయర్స్ సెమీఫైనల్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)పై విజయం సాధించడం ద్వారా నేపాల్ ముందంజ వేసింది. శుక్రవారం జరిగిన పోరులో యూఏఈపై నేపాల్ 8 వికెట్ల తేడాతో గెలిచి ఫైనల్లో అడుగుపెట్టింది. మరోవైపు బహ్రెయిన్‌తో జరిగిన పోరులో 10 వికెట్ల తేడాతో నెగ్గిన ఓమన్ కూడా ఫైనల్ చేరి వరల్డ్‌కప్ బెర్త్ దక్కించుకుంది.