మెక్సికో సిటీ: వరల్డ్ కప్ ఫేవరేట్లలో ఒకటైన ఇంగ్లండ్ సైతం క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. మెక్సికో అభిమానులు స్టేడియానికి పోటెత్తగా ఆసాం తం నువ్వానేనా అన్నట్టుగా సాగిన ప్రిక్వార్టర్స్‌లో హ్యారీ కేన్ సేన 3-2తో ఆతిథ్య జట్టును ఓడించి టోర్నీలో తదుపరి దశకు ముందంజ వేసింది. మ్యాచ్ ముందు రోజు రాత్రి మెక్సికో అభిమానులు ఇంగ్లిష్ ఆటగాళ్ల నిద్ర, ఏకాగ్రతను దెబ్బతీసేందుకు ఇంగ్లండ్ బస చేస్తున్న హోటల్ ముందుకు వచ్చి డ్రమ్స్, బాణాసంచాతో భారీ శబ్దాలు చేశారు. కానీ మ్యాచ్‌లో ఇంగ్లండ్ మాత్రం గోల్స్‌తో వారికి దీటైన సమాధానమిచ్చింది. ఇంగ్లిష్ మిడ్‌ఫీల్డర్ జూడ్ బెల్లింగ్హమ్ (36వ, 38వ నిమిషంలో) 98 సెకన్ల వ్యవధిలో రెండు గోల్స్ చేయగా ఆ జట్టు సారథి హ్యారీ కేన్ (60వ) ఓ గోల్ కొట్టాడు. ఈ టోర్నీలో కేన్‌కు ఇది ఆరో గోల్ కాగా వరల్డ్ కప్స్‌లో 14వది కావడం విశేషం. మెక్సికో తరఫున జులియన్ క్వినోన్స్ (42వ), జిమెనెజ్ (69వ) తలా ఓ గోల్ చేశారు.