మయామి గార్డెన్స్ (యూఎస్): రెండోసారి సాకర్ ప్రపంచకప్ నెగ్గాలన్న కలను నెరవేర్చుకోలేకపోయిన ఇంగ్లండ్ ఈ టోర్నీని విజయంతో ముగించింది. టోర్నీ ఫేవరెట్లలో ఒకటిగా నిలిచినా సెమీస్‌లో అర్జెంటీనా చేతిలో ఓడిన ఆ జట్టు మూడో స్థానం కోసం జరిగిన ‘బ్రాంజ్ ఫైనల్’ పోరులో గత ఎడిషన్ రన్నరప్ ఫ్రాన్స్‌ను చిత్తుచేసింది. ఆదివారం తెల్లవారుజామున గోల్స్ వర్షంతో తడిసి ముద్దయిన మయామి స్టేడియంలో ఇంగ్లండ్.. 6-4తో ఎంబాపె సేనపై రికార్డు విజయాన్ని సాధించింది.
‘త్రీ లయన్స్’ స్ట్రైకర్ బుకాయొ సకా (37వ, 45+1వ, 87వ నిమిషాల్లో) హ్యాట్రిక్ గోల్స్‌తో విజృంభించగా డెక్లాన్ రైస్ (3వ), ఎజ్రి కొన్సా (18వ), జూడ్ బెల్లింగ్‌హామ్ (90+8వ) తలా ఒకసారి బంతిని నెట్లోకి పంపారు. ఇక ఫ్రాన్స్ స్టార్ కిలియన్ ఎంబాపె (48వ, 66వ) మరోసారి డబుల్ ధమాకాతో వరల్డ్‌కప్‌లో రికార్డు గోల్స్ నమోదుచేసినా ‘లెస్ బ్లూస్’కు పరాభవం తప్పలేదు. బ్రాడ్లీ బార్కోలా (54వ), ఉస్మాన్ డెంబెలె (90+6వ) ఇంగ్లండ్ ఆధిక్యాన్ని తగ్గించారు.
ఆట ఆరంభమై ప్రేక్షకులింకా పూర్తిస్థాయిలో తమ సీట్లలోకి రాకముందే ఇంగ్లండ్ గోల్స్ ఖాతా తెరిచింది. ఫస్టాఫ్ అంతా త్రీ లయన్స్దే హవా. టోర్నీ ఆసాంతం ప్రత్యర్థి జట్లకు గోల్స్ ఇవ్వకుండా అడ్డుకున్న ఫ్రాన్స్ రక్షణశ్రేణిని ఈ మ్యాచ్‌లో వాళ్లు ఆటాడుకున్నారు. రెగ్యులర్ కెప్టెన్ హ్యారీ కేన్ బెంచ్‌కే పరిమితమవగా తాత్కాలిక సారథిగా వచ్చిన రైస్.. దాదాపు హాఫ్ పిచ్‌లో బంతినందుకుని ప్రత్యర్థి డిఫెన్స్‌ను ఛేదించుకుంటూ బాక్స్ వెలుపలి నుంచే బాల్‌ను నెట్లోకి తన్నేశాడు.

తొలి గోల్ కొట్టిన జోష్‌లో ఉన్న యూకేకు ఈ అర్సెనల్ మిడ్‌ఫీల్డర్ సూపర్ అసిస్ట్‌తో రెండో గోల్లో సాయపడ్డాడు. రైస్ చేసిన కార్నర్ కిక్‌ను కొన్సా హెడర్‌తో గోల్ కొట్టి తన జట్టుకు 2-0 ఆధిక్యాన్ని అందించాడు. ఆ తర్వాత సకా మ్యాజిక్ మొ దలైంది. రష్‌ఫోర్డ్ గోల్ కొట్టే య త్నంలో ఫ్రాన్స్ గోల్‌కీపర్ మైగ్నన్తో పాటు ఆ జ ట్టు డిఫెండర్లు అతడిని నిలువరించినా సకా మెరుపు వేగంతో బంతిని వలలోకి నెట్టేశాడు. అదే ఊపులో ఫస్టాఫ్ స్టాపేజ్ టైమ్‌లోనూ గోల్ చేయడంతో తొలి అర్ధభాగంలోనే ఇంగ్లండ్ 4-0తో బ్రేక్‌కు వెళ్లింది. 1930 తర్వాత ఒక మ్యాచ్‌లో బ్రేక్‌కు ముందు 0-4తో ఉండటం ఫ్రాన్స్‌కు ఇదే ప్రథమం.
ఫస్టాఫ్‌లో తేలిపోయిన ఫ్రాన్స్.. 1958లో బ్రెజిల్ చేతిలో ఓటమి (5-2తో) తర్వాత ఈ టోర్నీలో అతిపెద్ద అపజయం తప్పదా? అని ఆ జట్టు అభిమానులు ఆందోళనపడుతున్న వేళ రెండో అర్ధభాగంలో ఎంబాపె సేన అనూహ్యంగా పుంజుకుంది. 48వ నిమిషంలో కెప్టెన్ ఎంబాపె చేసిన రికార్డు (ఈ టోర్నీలో 21వ గోల్‌తో మెస్సీని అధిగమించాడు)గోల్‌తో ఆ జట్టు ఖాతా తెరిచింది. ఆ తర్వాత ఆరు నిమిషాలకే బార్కోలా.. ఇంగ్లండ్ గోల్‌కీపర్ డీన్ హెండర్సెన్ను బోల్తా కొట్టిస్తూ గోల్ సాధించాడు. బంతిపై పట్టు దక్కించుకున్న ఫ్రాన్స్‌కు.. 66వ నిమిషంలో ఎంబాపె వరల్డ్‌కప్‌లో 10వ గోల్ (మొత్తంగా 22వది)తో ఇంగ్లండ్ ఆధిక్యాన్ని 4-3కు తగ్గించాడు. అయితే ఫస్టాఫ్‌లో రెండు గోల్స్ చేసిన సకా.. 87వ నిమిషంలో తమకు దక్కిన పెనాల్టీని సద్వినియోగం చేసుకుని హ్యాట్రిక్ గోల్‌ను పూర్తిచేశాడు. ఇక ఇంజూరీ టైమ్‌లో డెంబెలె గోల్‌తో ఆటలో ఉత్కంఠ రేగినా ఆట ముగుస్తుందనగా ఇంగ్లండ్ స్టార్ బెల్లింగ్‌హామ్ చేసిన గోల్‌తో ఆ జట్టు విజయం పూర్తైంది.

ఈ మ్యాచ్‌లో రెండు గోల్స్ చేసిన ఎంబాపె టోర్నీలో తన గోల్స్ సంఖ్యను 10కు పెంచుకుని గోల్డెన్ బూట్ రేసులో మెస్సీ (8)ని వెనక్కినెట్టాడు. ఖతార్ ఎడిషన్‌లోనూ ఈ ఘనత సాధించిన ఎంబాపె.. ఈ టోర్నీ చరిత్రలో అత్యధిక గోల్స్ (22) కొట్టిన ఆటగాడిగానూ రికార్డు పుటల్లోకి ప్రవేశించాడు. ఒక టోర్నీలో అత్యధిక గోల్స్ చేసినవారిలో ఎంబాపె.. తన దేశానికే చెందిన జస్ట్ ఫొంటెన్ (1958లో 13), హంగేరి ఆటగాడు సాండొర్ కొక్సిస్ (1954లో 11) తర్వాతి స్థానాల్లో నిలిచాడు.