Indian Cricketers – Food Habbits : క్రీడ ఏదైనా శారీరక దారుఢ్యం, ఫిట్నెస్ చాలా ముఖ్యం. ఎందుకంటే..? ఆటగాడి భవితవ్యాన్ని నిర్ణయించేది అదే. కాబట్టి ఆరోగ్యకరమైన, బలవర్థకమైన ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. శరీరానికి శక్తినిచ్చేందుకు మాంసాహారం తప్పనిసరిగా తీసుకోవాల్సి వస్తుంది. ఆటగాళ్లు అంత ఫిట్‌గా ఉండడం వెనక రహస్యం కూడా అదేననే అపోహ చాలామందిలో ఉంటుంది. అయితే, ఇందులో ఎంత మాత్రమూ నిజం లేదు. ప్రస్తుతం భారత జట్టులోని స్టార్ క్రికెటర్లతో పాటు మాజీ ఆటగాళ్లలో కొందరు ముక్క ముట్టరన్న సంగతి మీలో ఎంతమందికి తెలుసు? మరి వారెవరో? వారి ఆహారపు అలవాట్లు ఏంటో తెలుసుకుందామా?
ఆహార నియమాలను పక్కాగా పాటించేవాళ్లలో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli) ముందు వరుసలో ఉంటాడు. ప్రపంచంలోని అత్యంత ఫిట్‌గా ఉండే ఆటగాళ్లలో ఒకడైన కోహ్లీ శాకాహారం మాత్రమే తింటాడు. అయితే, అతడి భోజనంలో గుడ్ల(Eggs)కు మాత్రం చోటు ఉంటుంది. కెరీర్ ఆరంభంలో కోహ్లీ బటర్ చికెన్(Butter Chicken) అంటే చెవి కోసుకునేవాడు. అయితే.. ఆ తర్వాత క్రమంగా వెజిటేరియన్ వైపు మళ్లాడు. 2018 నుంచి పూర్తిగా ‘వేగాన్’గా మారిపోయాడు. తాను మాంసాహారం మానేయడానికి కారణం తన భార్య అనుష్క శర్మే(Anushka Sharma)నని పలుమార్లు కోహ్లీ బహిరంగంగానే చెప్పాడు.
టీమిండియా అత్యుత్తమ బ్యాటర్లలో రోహిత్‌శర్మ(Rohit Sharma) ఒకడు. ఈ విధ్వంసక ఓపెనర్ ఒంటిచేత్తో మ్యాచ్‌లు గెలిపించిన సందర్భాలు అనేకం. రోహిత్ కూడా శాకాహారే. కోహ్లీలానే ఆహారంలో గుడ్లు తప్పనిసరిగా తీసుకుంటాడు. అంతేకాదు ‘ది గ్రేట్ వన్ హార్న్’(The Grate One Horn) ఖడ్గమృగాల పరిరక్షణకు సంబంధించి అందరిలో అవగాహన కల్పిస్తన్నాడు.
భారత టెస్టు జట్టులోని ముఖ్యమైన ఆటగాళ్లలో చతేశ్వర్ పుజారా(Cheteshwar Pujara) ఒకడు. నిలకడకు మారుపేరుగా మారిన నయావాల్ క్రీజులో పాతుకుపోతాడు. ఓపికగా ఆడుతూ బౌలర్లను అలసిపోయేలా చేస్తాడు. పూజరా ఆట వెనక అతడి ఫిట్నెస్ రహస్యం దాగి ఉంది. అతడు కూడా పూర్తి శాకాహారే. వంటల్లో ఎక్కువ మసాలా దినుసులు లేకుండా జాగ్రత్త పడతాడు. గుడ్ల జోలికి అస్సలు వెళ్లడు. లాక్టో వెజిటేరియన్ (Lacto Vegetarian) ఆహారమంటే పూజారాకు చాలా ఇష్టం.
భువనేశ్వర్ కుమార్, ఇషాంత్ శర్మ
భారత మాజీ క్రికెటర్ ఇషాంత్ శర్మ(Ishanth Sharma) చిన్నప్పుడు రోజూ నాన్‌వెజ్ లాగించేవాడు. అయితే, ఫిట్‌నెస్‌పై అవగాహన పెరిగిన తర్వాత మాంసాహారాన్ని పక్కనపెట్టేశాడు. 2018 నుంచి మాంసాన్ని నిషేధించాలన్న ‘బ్యాన్ మీట్’ (Ban Meet)కార్యక్రమంలో భాగమయ్యాడు.
టీమిండియా స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్(Bhuvaneshwar Kumar) కూడా పూర్తిగా శాకాహారే. స్వింగ్ డెలివరీలతో ప్రత్యర్థి బ్యాటర్లను బెంబేలెత్తించే భువీ కఠినమైన శాకాహార నిబంధనలను అనుసరిస్తాడు. భువనేశ్వర్ ఆహారంలో పండ్లు, కూరగాయలు ఉండేలా జాగ్రత్త పడతాడు.
ఈ వెటరన్ స్పిన్నర్‌ను లివింగ్ లెజెండ్‌గా అభివర్ణిస్తారు. అతడి ఖాతాలో వందలకొద్దీ వికెట్లు ఉన్నాయి. బంతితో మ్యాజిక్ చేసే అశ్విన్(Ravichandran Ashwin) టెస్టుల్లో సుదీర్ఘంగా బౌలింగ్ చేయగలడు. క్యారమ్ బాల్ బౌలింగ్ చేయడంలో నేర్పరి అయిన అశ్విన్ ఫిట్నెస్ రహస్యం శాకాహారమే. మాంసాహారాన్ని అతడు ఆమడ దూరంలో ఉంచుతాడు.
‘జాట్ జీ’గా పిలిపించుకునే శిఖర్ ధావన్(Shikhar Dhawan) వెజిటేరియన్. 2018లో మాంసాహారాన్ని విడిచిపెట్టి శాకాహారిగా మారిపోయాడు. ఓసారి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మాంసాహారం వల్ల కలిగే ప్రతికూల శక్తిపై సుదీర్ఘ ఉపన్యాసం దంచాడు. మాంసాహారం అనేది ఆలోచనలను ఎలా ప్రభావితం చేస్తుందో కూడా చెప్పుకొచ్చాడు.
17 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన పార్థివ్ పటేల్(Parthiv Patel) ఒక శాకాహారి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. పార్థివ్ ఉల్లిపాయలు, వెల్లుల్లి కూడా తినడు. టెస్టు క్రికెట్లో అతి పిన్న వయస్కుడైన వికెట్ కీపర్‌గా పార్థీవ్ రికార్డులకెక్కాడు. 2016-17లో గుజరాత్‌కు తొలిసారి రంజీ ట్రోఫీ అందించాడు.
పార్థివ్ పటేల్
భారత జట్టుకు ఆడిన అత్యుత్తమ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లలో రైనా(Suresh Raina) ఒకడు. ఫినిషర్‌గా ఓ వెలుగువెలిగిన రైనా ఆ తర్వాత ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ లైనప్‌కు వెన్నెముకగా మారాడు. కశ్మీరీ పండిట్ కుటుంబానికి చెందిన రైనా శాకాహారి. అయినా సరే గుడ్లు అంటే మాత్రం ప్రీతి. ఈ మధ్యే రైనా తన పేరుతో అమ్‌స్టర్‌డామ్ రెస్టారెంట్ ప్రారంభించాడు.
ఓ టెస్టు మ్యాచ్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో పదికి పది వికెట్లు పడగొట్టిన భారత బౌలర్ అనిల్ కుంబ్లే(Anil Kumble). 7 ఫిబ్రవరి 1999న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై ఈ ఘనత సాధించాడు. 2016లో భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. కుంబ్లే కూడా శాఖాహార క్రికెటరే. ఓసారి ఇర్ఫాన్ పఠాన్ తన ఇంట్లో వెజిటేరియన్ బిర్యానీ విందుకు కుంబ్లేను ఆహ్వానించాడు.