మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)లో ఢిల్లీ క్యాపిటల్స్ టైటిల్ ఫైట్‌కు దూసుకెళ్లింది. తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్‌ను చిత్తుచేస్తూ టాప్ ప్లేస్‌తో ఫైనల్లోకి అడుగుపెట్టింది. తొలుత 126 పరుగులకే గుజరాత్‌ను కట్టడిచేయడంలో సఫలమైన ఢిల్లీ.. డాషింగ్ బ్యాటర్ షెఫాలీవర్మ ధనాధన్ అర్ధసెంచరీతో అలవోక విజయాన్ని సొంతం చేసుకుంది. ఆకాశమే హద్దుగా చెలరేగిన షెఫాలీ ధాటికి 41 బంతులు మిగిలుండగానే ఢిల్లీ గెలుపుతీరాలకు చేరింది. వరుసగా రెండో సీజన్లో ప్లేఆఫ్స్ చేరకుండానే ఆఖరి స్థానంతో గుజరాత్ తమ పోరాటాన్ని ముగించింది.
WPL | న్యూఢిల్లీ: డబ్ల్యూపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ దుమ్మురేపింది. భారీ విజయం లక్ష్యంగా బరిలోకి దిగిన ఢిల్లీ అనుకున్న ఫలితాన్ని అందుకుంది. బుధవారం పూర్తి ఏకపక్షంగా సాగిన పోరులో ఢిల్లీ 7 వికెట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్‌పై ఘన విజయం సాధించింది. దీంతో లీగ్ ఫైనల్లోకి ప్రవేశించింది. గుజరాత్ నిర్దేశించిన 127 పరుగుల లక్ష్యఛేదనలో ఢిల్లీ 13.1 ఓవర్లలో 129/3 స్కోరు చేసింది. ఓపెనర్ షెఫాలీవర్మ(37 బంతుల్లో 71, 7ఫోర్లు, 5 సిక్స్‌లు) అర్ధసెంచరీతో విజృంభించగా, జెమీమా రోడ్రిగ్స్(38 నాటౌట్) దూకుడుగా ఆడింది. తనూజ కన్వర్(2/20) రెండు వికెట్లు తీసింది. అంతకుముందు ఢిల్లీ 20 ఓవర్లలో 126/9 స్వల్ప స్కోరుకే కుప్పకూలింది. కాప్(2/17), మిన్ను మణి(2/9), శిఖాపాండే(2/23) ధాటికి గుజరాత్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. భారతి ఫల్మాలీ(42) మినహా అందరూ ఘోరంగా విఫలమయ్యారు. షెఫాలీకి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.
షెఫాలీ మెరుపులు: ఫామ్‌మీదున్న షెఫాలీ ఆది నుంచే తనదైన శైలిలో దూకుడు కనబరిచింది. శబ్నమ్ వేసిన మూడో ఓవర్లో షెఫాలీ మూడు ఫోర్లతో విరుచుకుపడింది. మరుసటి ఓవర్లోనే ల్యానింగ్ (18), క్యాప్సె (0) ఔట్ అయ్యారు. షెఫాలీకి జెమీమా రోడ్రిగ్స్ జత కలిసింది. పవర్ ప్లే ముగిసే సరికి ఢిల్లీ 2 వికెట్ల నష్టానికి 45 పరుగులు చేసింది. ఇక్కణ్నుంచి రోడ్రిగ్స్ అండగా షెఫాలీ రెచ్చిపోయింది. గార్డ్నర్ వేసిన ఏడో ఓవర్లో రెండు భారీ సిక్స్‌లతో విరుచుకుపడింది. ఈ క్రమంలో 28 బంతుల్లో అర్ధసెంచరీ మార్క్ అందుకుంది. తానేం తక్కువ కాదన్నట్లు రోడ్రిగ్స్ బౌండరీలతో చెలరేగడంతో లక్ష్యం అంతకంతకూ తరిగిపోయింది. మేఘనాసింగ్ వేసిన 12వ ఓవర్లోనే అయితే షెఫాలీ ఓఫోర్, సిక్స్ కొడితే..రోడ్రిగ్స్ రెండు ఫోర్లు అరుసుకుంది. కన్వర్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడబోయిన షెఫాలీ..క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగింది. ఆ తర్వాతి బంతికే రోడ్రిగ్స్ ఫోర్‌తో గెలుపు లాంఛనాన్ని పూర్తి చేసింది.
గుజరాత్ ఢమాల్ : ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే కెప్టెన్ బేత్ మూనీ(0) ఔట్ కాగా, హేమలత(7), వోల్వార్డ్(7), గార్డ్నర్(12)స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. భారతీ, బ్రైస్(28 నాటౌట్), లిచ్‌ఫీల్డ్(21) పరుగులు చేయడంతో గుజరాత్ పరువు దక్కింది.
గుజరాత్: 20 ఓవర్లలో 126/9(ఫల్మాలీ 42, బ్రైస్ 28 నాటౌట్, మణి 2/9, కాప్ 2/17),
ఢిల్లీ: 13.1 ఓవర్లలో 129/3 (షెఫాలీ 71, రోడ్రిగ్స్ 38 నాటౌట్, కన్వర్ 2/20)