DC Vs RR | రాజస్థాన్ రాయల్స్‌కు ఢిల్లీ క్యాపిటల్స్ 189 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లకు ఐదు వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. ఢిల్లీ తరపున ఏ బ్యాట్స్‌మెన్ కూడా భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. ఢిల్లీ తరపున పోరెల్ అత్యధికంగా 49 పరుగులు చేయగా.. కేఎల్ రాహుల్ 38 పరుగులు చేశాడు. జాక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్, పోరెల్ జోడీ మంచి ఆరంభం అందించగా.. జోఫ్రా ఆర్చర్ అద్భుతమైన బంతితో మెక్‌గుర్క్‌ను పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత కరుణ్ నాయర్ ఖాతా తెరువకుండానే రనౌట్‌గా వెనుదిరిగాడు. ఐపీఎల్లో కరుణ్ నాయర్ డకౌట్ కావడం ఇది నాలుగోసారి. రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లోపడ్డ ఢిల్లీని రాహుల్-పోరెల్ జోడీ ఆదుకుంది.
ఆరు వికెట్‌కు 63 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. 32 బంతుల్లో 38 పరుగులు చేసిన రాహుల్‌ను ఆర్చర్ విడగొట్టాడు. ఆ తర్వాతి ఓవర్లోనే పోరెట్ అవుట్ అయ్యాడు. తృటిలో హాఫ్ సెంచరీని మిస్ చేసుకున్నాడు. ఆ తర్వాత కెప్టెన్ అక్షర్ పటేల్ క్రీజులోకి వచ్చి దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. అక్షర్ 14 బంతుల్లో నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లతో 34 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. చివరి ఓవర్లలో ట్రిస్టాన్ స్టబ్స్, అశుతోష్ అద్భుతంగా బ్యాటింగ్ చేయడంతో జట్టు స్కోరు 180 దాటింది. స్టబ్స్ 18 బంతుల్లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో 34 పరుగులు, అశుతోష్ 11 బంతుల్లో రెండు ఫోర్లతో 15 పరుగులు చేశాడు. రాజస్థాన్ బౌర్లలో ఆర్చర్ రెండు వికెట్లు, మహేష్ తీక్షణ, వానిందు హసరంగా తలో వికెట్ దక్కింది.