CWC 2023 | గత 20 రోజులుగా భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ ప్రయాణంలో అర్థ భాగం ముగిసింది. 45 లీగ్ మ్యాచ్‌లు, రెండు సెమీస్‌లు, ఒక ఫైనల్ (మొత్తం 48 మ్యాచ్‌లు) ఉన్న ఈ మెగా టోర్నీలో ఢిల్లీ లోని ఆస్ట్రేలియా – నెదర్లాండ్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ 24వది. అంటే సగం టోర్నీ పూర్తైన ఈ మెగా ఈవెంట్లో సెమీస్ చేరే అవకాశాలు ఎక్కువగా ఎవరికి ఉన్నాయి..? లీగ్ స్టేజ్‌లోనే నిష్క్రమించే ప్రమాదంలో ఉన్న జట్లు ఏవి..? హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగి లీగ్ దశలోనే బ్యాగ్ సర్దుకోనున్న జట్లు ఏవి..? అన్న విషయాలు ఇక్కడ చూద్దాం.
సెమీస్ రేసులో ఆ నాలుగు..
23 మ్యాచ్‌లు ముగిసేసరికి టాప్-4లో ఉన్న జట్లు భారత్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా ఉన్నాయి. ఆడిన ఐదు మ్యాచ్‌లలో ఐదింటికి గెలిచిన భారత్.. పది పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. భారత్ సెమీస్ చేరాలంటే తదుపరి నాలుగు మ్యాచ్‌లలో మరో మ్యాచ్ గెలిచినా చాలు. టోర్నీలో దూకుడు మీదున్న దక్షిణాఫ్రికా.. ఐదు మ్యాచ్‌లలో నాలుగు గెలిచి 8 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఆ జట్టుకు నెట్ రన్ రేట్ మెరుగ్గా ఉండటంతో పాటు తర్వాత ఆడబోయే నాలుగు మ్యాచ్‌లలో రెండు గెలిచినా ఆ జట్టు సెమీస్‌కు చేరడం ఖాయమే. కివీస్ కూడా ఐదింటిలో నాలుగు గెలిచి సెమీస్ రేసులో ఉంది.
ఇక ఆడిన నాలుగు మ్యాచ్‌లలో రెండు గెలిచి రెండు ఓడిన ఆసీస్.. టాప్-లో ఉంది. తొలుత రెండు మ్యాచ్‌లు ఓడినా తర్వాత పుంజుకుంది. నెదర్లాండ్స్‌తో పాటు తర్వాత ఆడబోయే నాలుగు మ్యాచ్‌లలో మూడు గెలిస్తేనే కంగారూలకు సెమీస్ అవకాశాలుంటాయి.
ఆ రెండు జట్లకూ కష్టమే..
డిఫెండింగ్ ఛాంపియన్స్ గా బరిలోకి దిగిన ఇంగ్లండ్.. నాలుగింట ఒక్కటి మాత్రమే గెలిచి సెమీస్ రేసులో వెనుకబడింది. తర్వాత ఐదు మ్యాచ్‌లలో ఒక్కటి ఓడినా ఇంగ్లాండ్ కథ కంచికే. పాకిస్తాన్ పరిస్థితి కూడా దాదాపు ఇంతే. ఐదు మ్యాచ్‌లలో రెండు మాత్రమే గెలిచి మూడు ఓడిన పాకిస్తాన్.. నాలుగో స్థానంలో ఉన్న ఆసీస్‌కు గట్టిపోటీనివ్వాలంటే ఆ జట్టు తర్వాత ఆడబోయే ప్రతీ మ్యాచ్ గెలవాల్సి ఉంది.
సంచలనాల అఫ్గాన్..
ఈ టోర్నీలో బంగ్లాదేశ్, నెదర్లాండ్స్‌తో పాటు అఫ్గానిస్తాన్‌లు అగ్రశ్రేణి జట్లకు షాకిస్తాయని పలువురు క్రికెట్ పండితులు వాదించారు. అందుకు తగ్గట్టుగానే నెదర్లాండ్స్.. సౌతాఫ్రికాకు షాకిచ్చింది. మరోవైపు అఫ్గానిస్తాన్ కూడా ఇంగ్లండ్‌తో పాటు పాకిస్తాన్లనూ ఓడించి పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. ఐదు మ్యాచ్‌లలో రెండు గెలిచిన ఆ జట్టు తనకంటే మెరుగైన శ్రీలంక, ఇంగ్లండ్, బంగ్లాదేశ్ కంటే మెరుగ్గా ఉండటం గమనార్హం.