Cricketers – Funny Activites : క్రికెట్ ఎప్పుడూ ఒత్తిడి మధ్య సాగుతూ ఉంటుంది. ప్రతి క్షణం ప్రతి ఒక్కరు అలెర్ట్‌గా ఉండాల్సిందే. ఆఫ్ ఫీల్డ్‌లో ఎంత సరదాగా ఉండే క్రికెటర్ అయినా ఆన్ ఫీల్డ్‌లో మాత్రం సీరియస్‌గా మారిపోతారు. అయితే, అందరూ అలా ఉండరు. కొందరు ఆటగాళ్లు తమ చేష్టలతో అభిమానులను ఉల్లాసపరుస్తారు. 2003-04లో భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించింది. టీమిండియా బౌలర్ అజిత్ అగార్కర్(Ajit Agarkar) వరుసగా ఏడుసార్లు డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత తొలి పరుగు సాధించినప్పుడు బ్యాట్‌ను పైకిలేపి డకౌట్ నుంచి తప్పించుకున్నానంటూ ఆనందం వ్యక్తం చేయడాన్ని అభిమానులు ఎప్పటికీ మర్చిపోరు. 1990, 2000వ సంవత్సరంలో పాక్ మాజీ కెప్టెన్ ఇంజిమాముల్ హక్(Inzamam-Ul- Haq) చాలాసార్లు ఫన్నీగా రనౌట్ అయ్యాడు. ఈ ఫన్నీ రనౌట్లు కూడా అభిమానుల మదిలో నిలిచిపోయాయి. ఆటలో ప్రేక్షకులకు వినోదాన్ని పంచే ఓ పదిమంది క్రికెటర్లు వీళ్లే..
టీమిండియా ఆటగాడు శిఖర్ ధవన్(shikhar dhawan) ఆట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడైతే ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్నాడు. కానీ, నిన్నమొన్నటి వరకు ఒంటిచేత్తో జట్టుకు ఎన్నో విజయాలు అందించిపెట్టాడు. ధవన్ మంచి బ్యాటరే కాదు.. అంతకుమించిన ఎంటర్టైనర్ కూడా. క్యాచ్ పట్టగానే వెంటనే తొడచరిచి సెలబ్రేట్ చేసుకుంటాడు.
శిఖర్ ధవన్
ధవన్ సెలబ్రేషన్స్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. సోషల్ మీడియాలోనూ చురుగ్గా ఉండే ధవన్ 2021 ఐపీఎల్ సెకండ్ ఫేజ్ సందర్భంగా ఓ ఫన్నీ రీల్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. అందులో పృథ్వీషాను అనుకరిస్తూ ఓ టీవీ సీరియల్ డైలాగ్ చెప్పి నవ్వులు పూయించాడు. ఈ ఏడాది జూలైలో ఓ పాపులర్ హిందీ సాంగ్‌కు గబ్బర్ స్టెప్పులేశాడు.
క్రికెట్లోని మూడు ఫార్మాట్లలోనూ దూకుడు ప్రదర్శిస్తున్న క్రికెటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli). 15 ఏళ్ల కెరియర్లో ఎన్నో అద్భుతాలు చేశాడు. మైదానంలో కోహ్లీ ఎంత దూకుడుగా ఉంటాడో.. అంతే సరదాగానూ ఉంటాడు. మైదానంలో ఉన్నప్పుడు జాలీగా కనిపిస్తాడు. తనను తాను ఉత్తేజపరుచుకుంటూనే ఇతరులను కూడా జాలీమూడ్లోకి తీసుకెళ్తాడు.
విరాట్ కోహ్లీ గంగ్నమ్ స్టైల్ డ్యాన్స్
2013లో చాంపియన్స్ ట్రోఫీ గెలుచుకున్న భారత జట్టు `గంగ్నమ్ స్టైల్` డ్యాన్స్‌తో సెలబ్రేట్ చేసుకుంది. కొన్ని నెలల క్రితం ఇన్‌స్టాలో ఓ వీడియోను కోహ్లీ షేర్ చేశాడు. అందులో నార్వే డ్యాన్స్ ట్రూప్ `క్విక్ స్టైల్` డ్యాన్స్‌తో అదరగొట్టాడు. 2016లో జరిగిన యువరాజ్‌సింగ్-హేజెల్ కీచ్ వివాహంలోనూ కొన్ని బ్లాక్‌బస్టర్ పంజాబీ పాటలకు కోహ్లీ డ్యాన్స్ చేశాడు.
భారత వైట్‌బాల్ క్రికెట్‌కి యుజ్వేంద్ర చాహల్(Yuzvendra Chahal) అందించిన విజయాలు చాలానే ఉన్నాయి. టీమిండియా ఫన్నీ ఆటగాళ్లలో అతడు కూడా ఒకడు. మైదానంలో అతడుంటే ఆ సందడే వేరు. సీనియర్లను, జూనియర్లు, ప్రత్యర్థులు అన్న తేడాలేకుండా అందరినీ ఆటపట్టిస్తుంటాడు. అంపైర్లను కూడా వదిలిపెట్టడు. 2019 ప్రపంచ కప్‌లో భారత్, శ్రీలంక జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. 12వ ఆటగాడిగా ఉన్న చాహల్ బౌండరీకి ఆ వైపున కిందపడుకుని రిలాక్స్ అవుతున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. మీమ్స్‌కు అయితే లెక్కే లేదు.
కిందపడుకుని రిలాక్స్ అవుతున్న చాహల్
2022 ఐపీఎల్ సీజన్లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై హ్యాట్రిక్ సాధించినప్పుడు పడుకున్నట్టు పోజిచ్చాడు. 2017లో చాహల్, కుల్దీప్ యాదవ్‌ను ఇంటర్వ్యూ చేశాడు. ఈ సందర్భంగా చాహల్‌ను ఉద్దేశించి రోహిత్ మాట్లాడుతూ.. నీ కాంటాక్ట్ లిస్ట్‌లో ఉండాలనుకునే నంబరు ఏది? అని అడిగితే.. వెంటనే రాక్ (హాలీవుడ్ నటుడు డ్వేన్ జాన్సన్) అని చెప్పాడు. అయితే, రాక్ అని ప్రస్తావించిన విధానాన్ని చూసి రోహిత్, కుల్దీప్ పడీ పడీ నవ్వారు. ఇంకా చెప్పుకోవాలంటే ప్రపంచంలోని క్రికెటర్లందరిలోనూ చాహల్‌ను ఫన్నీయెస్ట్ క్రికెటర్‌గా చెప్పుకోవచ్చు.
పాక్ వికెట్ కీపర్ బ్యాటర్ రిజ్వాన్(Mohammad Rizwan) కూడా మంచి ఎంటర్టైనరే. జట్టుకు విజయాల్లో కీలకపాత్ర పోషించే రిజ్వాన్ వికెట్ల వెనక బంతికోసం కాపుకాస్తూనే చేతికందిన బంతిని ఫన్నీగా విసురుతుంటాడు. 2001 మార్చిలో ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగిన మ్యాచ్‌లో రిజ్వాన్ – ఆసీస్ టాపార్డర్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ కలిసి ప్రేక్షకులకు వినోదాన్ని పంచారు.
స్టీవ్ స్మిత్, రిజ్వాన్, లబుషేన్
ప్రాక్టీస్ సెషన్లో వీళ్లిద్దరూ స్టీవ్ స్మిత్ బ్యాటింగ్ శైలిని అనుకరించే ప్రయత్నం చేశారు. ఈ వీడియోను పాక్ క్రికెట్ బోర్డు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అభిమానులు ఫన్నీ కామెంట్లతో హోరెత్తించారు. ఆసియా కప్‌లో భాగంగా భారత్‌తో మ్యాచ్ జరుగుతున్నప్పుడు హార్దిక్ పాండ్యా()తో కలిసి నవ్వులు పూయించాడు.
ప్రపంచంలోని విధ్వంసకర బ్యాటర్లలో క్రిస్ గేల్(Chris Gayle) ఒకడు. నవంబరు 2021 టీ20 ప్రపంచ కప్‌లో చివరిసారి ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఆడాడు. ప్రస్తుతం జట్టుకు దూరంగా ఉంటున్నప్పటికీ రిటైర్మెంట్పై మాత్రం ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. జట్టులో అతడుంటే చాలా సందడిగా ఉండేది. 2012 ప్రపంచ కప్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓ ఘటన జరిగింది.
క్రిస్ గేల్
గేల్ బంతి వేయడానికి ముందే మోర్గాన్ క్రీజు వదిలాడు. దీంతో గేల్ అతడిని సరదాగా హెచ్చరించి వదిలేశాడు. 2012 ప్రపంచ కప్ గెలుచుకున్న తర్వాత గేల్ సౌత్ కొరియన్ సింగర్ `సై` హార్స్ రైడింగ్ డ్యాన్స్‌ను ఇమిటేట్ చేసి నవ్వులు పంచాడు. 2019లో భారత జట్టు విండీస్‌లో పర్యటించినప్పుడు కోహ్లీతో కలిసి క్రిస్ గేల్ చేసిన డ్యాన్స్ వైరల్ అయింది.
సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే క్రికెటర్లలో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్(David Warner) ఒకడు. బ్యాటింగ్‌తో విధ్వంసం సృష్టించే వార్నర్ ఆన్లైన్లో డ్యాన్సులతో దుమ్మురేపుతుంటాడు. సోషల్ మీడియాలో అతడికి మంచి ఫాలోయింగ్ ఉంది. 2020లో భార్య కేండిస్ వార్నర్‌తో కలిసి `బుట్టబొమ్మ` సాంగ్‌కు చిందేశాడు. 2022లో పుష్ప సినిమాలోని శ్రీవల్లి పాటకు డ్యాన్స్ వేశాడు. అలాగే, అదే సినిమాలోని `యవ్వ తగ్గేదే లే` అనే డైలాగ్ చెప్పి అభిమానులను అలరించాడు. ఈ పోస్టుకు అల్లు అర్జున్(Allu Arjun) కూడా స్పందించాడు. `వార్నర్.. డేవిడ్ వార్నర్.. యవ్వ తగ్గేదేలే` అని కామెంట్ చేశాడు.
అల్లు అర్జున్, డేవిడ్ వార్నర్
2021-22లో ఆస్ట్రేలియా జట్టు పాకిస్థాన్‌లో పర్యటించింది. మూడో టెస్టులో వార్నర్, పాక్ ఆటగాడు షహీన్ షా మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. ఇద్దరూ ఒకరిపైకి మరొకరు దూసుకెళ్లారు. దీంతో స్టేడియం మొత్తం నిశ్శబ్దంగా మారిపోయింది. వారి మధ్య ఏదో జరగబోతోందని ప్రేక్షకులు నిర్ఘాంతపోయి చూస్తున్నారు. అంతలోనూ ఇద్దరూ ఒక్కసారిగా నవ్వేసి వెనక్కి తిరగడంతో ఆటగాళ్లే కాదు.. గ్యాలరీల్లోని ప్రేక్షకులు కూడా పెద్దగా నవ్వుకున్నారు.
ప్రస్తుత భారత జట్టులో ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లలో ఇషాన్ కిషన్(Ishan Kishan) ఒకడు. జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని భావిస్తున్న ఇషాన్ ఎప్పుడూ ఉత్సాహంగా కనిపిస్తాడు. 2023 ఐపీఎల్ సీజన్లో ఇషాన్.. గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ శుభమల్ గిల్(Shubman Gill)కు సంబంధించిన వీడియో వైరల్ అయింది.
ఇషాన్ కిషన్, శుభమల్ గిల్
గిల్‌ను ఇషాన్ తమాషాగా కౌగిలించుకున్న ఆ వీడియో చూసిన అభిమానులు స్పందించకుండా ఉండలేకపోయారు. తాజాగా విండీస్ పర్యటనలో టెస్టు అరంగేట్రం చేసిన కిషన్ తొలి గేమ్‌లో ఈ వికెట్ కీపర్ గిల్‌ను ఆటపట్టించడాన్ని ఎవరూ మర్చిపోరు.
ఇంగ్లండ్ పేస్ అటాక్‌లో కీలకమైన మార్క్ వుడ్(Mark Wood) జట్టుకు ఎన్నో విజయాలు అందించిపెట్టాడు. అతడి కారణంగా జట్టు బౌలింగ్ యూనిట్ బోలోపేతం కావడమే కాదు.. జోక్స్, తమాషా చేష్టలతో జట్టులో ఉత్సాహం నింపుతుంటాడు. 2022లో ఇంగ్లండ్ జట్టు వెస్టిండీస్‌లో పర్యటించినప్పుడు తొలి టెస్టు రెండోరోజు తమాషా ఘటన జరిగింది. వ్యూహం రచించేందుకు కెప్టెన్ జో రూట్ సభ్యులందరినీ పిలిచాడు. అందరూ వచ్చారు కానీ వుడ్ బౌండరీ వద్ద నిల్చుని నవ్వులు తెప్పించాడు.
మార్క్ వుడ్
ఈ ఏడాది యాషెస్ సిరీస్ సందర్భంగా ఐదో టెస్టుకు ముందు ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్() ప్రెస్ కాన్ఫరెన్స్‌కు సిద్ధమయ్యాడు. అంతలోనే ఓ బార్బీ బొమ్మ అక్కడే ఆట మొదలుపెట్టింది. అది చూసి స్టోక్స్.. వెంటనే అదెవరో గుర్తించాడు. ఆడుతున్నది మరెవరో కాదని, తన టీమ్మేట్ వుడ్ తనపై ప్రాంక్ చేస్తున్నాడని గుర్తించడంతో అందరూ హాయిగా నవ్వుకున్నారు.
ప్రస్తుతం ఇంగ్లండ్ జట్టులో జో రూట్(Joe Root) అత్యుత్తమ టెస్టు బ్యాటర్‌గా చెలామణి అవుతున్నాడు. సుదీర్ఘ ఫార్మాట్లో ఇంగ్లండ్ తరపున అత్యంత విజయవంతమైన రెండో బ్యాటర్‌గా పేరుకెక్కాడు. రూట్ గొప్ప ఆటగాడు మాత్రమే కాదు.. మంచి హాస్య చతురత కలిగిన వ్యక్తి కూడా. మైదానంలో ఉన్నాడంటే తనచుట్టూ ఉండేవారిని ఎప్పుడూ నవ్విస్తూనే ఉంటాడు. డిసెంబరు 2022లో ఇంగ్లిష్ జట్టు పాకిస్థాన్‌లో పర్యటించింది.
జో రూట్, జాక్ లీచ్
రావాల్పిండిలో జరిగిన తొలి టెస్టు మూడో రోజు బంతిని ప్యాంటుకు రుద్దడానికి బదులు చెమటతో ఉన్న సహచర ఆటగాడు జాక్ లీచ్(Jack Leach) తలకు రుద్దాడు. రూట్ చేసిన ఆ పని అందరి దృష్టిని ఆకర్షించడమే కాదు నవ్వులు తెప్పించింది కూడా.
2023 సీజన్లో రాజస్థాన్ రాయల్స్‌కు రూట్ ప్రాతినిధ్యం వహించాడు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పార్టీలో టీమిండియా లెగ్ బ్రేక్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్‌తో కలిసి డ్యాన్స్ చేశాడు. ఆ స్టెప్పులు తనకు రూట్ నేర్పించనవేనని ఆ తర్వాత చాహల్ చెప్పుకొచ్చాడు.
ఈ పాక్ క్రికెటర్ ప్రస్తుతం జట్టులో లేడు. కానీ, ఆడినప్పుడు మాత్రం బంతితో జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. హసన్ అలీ(HasanAli) జట్టుతో ఉన్నంత సేపు నవ్వులే నవ్వులు. తన మాటలు, చేష్టలతో వాతావరణాన్ని ఉల్లాసంగా మార్చేడాడు. 2018లో పాక్ జట్టు న్యూజిలాండ్‌లో పర్యటించినప్పుడు బులవాయోలో జరిగిన రెండో వన్డేలో ర్యాన్ ముర్రే వికెట్ తీశాడు. ఈ సందర్భంగా తన దైన శైలిలో సంబరాలు చేసుకున్న హసన్.. మెడ ప్రాంతంలో కండరాన్ని లాగడంతో గాయపడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపించారు. 2020లో కొంతమంది బస్కర్లు వీధిలో మ్యూజిక్ ప్లే చేస్తున్నప్పుడు హసన్ అలీ కాలు కదిపిన వీడియో ఒకటి వైరల్ అయింది.