బీజింగ్ : ప్రపంచ దేశాలు పోటీపడే ఒలింపిక్స్‌లో నిర్వహించే పరుగు పందేల్లో జమైకన్ చిరుత ఉసేన్ బోల్ట్ది ప్రత్యేక స్థానం. మరీ ముఖ్యంగా వంద మీటర్ల రేసులో అతడి రికార్డును అధిగమించే సంగతి పక్కనబెడితే ఆ దరిదాపుల్లోకి రావడానికి కూడా ప్రత్యర్థులు సాహసించరు. 2009లో బోల్ట్.. 100 మీటర్ల రేసును 9.58 సెకన్లలో పూర్తిచేసి రికార్డు నెలకొల్పగా ఇన్నాళ్లూ చెక్కుచెదరకుండా ఉన్న ఆ ఘనతను ఇప్పుడొక మరమనిషి అధిగమించింది.
చైనాలో జరుగుతున్న వరల్డ్ హ్యూమనాయిడ్ రోబో గేమ్స్‌లో భాగంగా మంగళవారం జరిగిన పోటీల్లో చైనాకు చెందిన టియాన్గాంగ్ అల్ట్రా రూపొందించిన ఒక రోబో.. వంద మీటర్ల రేసును బోల్ట్ కంటే వేగంగా ఏకంగా 8.64 సెకన్లలోనే పూర్తిచేయడం గమనార్హం. ఇవే క్రీడల్లో మూడు రోజుల క్రితం ఒక రోబో.. ఇదే రేసును 9.39 సెకన్లలో పూర్తిచేసిన రికార్డును అల్ట్రా రోబో బద్దలుకొట్టింది. ఈ పోటీల్లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 2 వేల రోబోలు పాల్గొంటున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ఐదు రోజుల పాటు సాగే ఈ గేమ్స్‌లో రన్నింగ్ రేసులే గాక టేబుల్ టెన్నిస్, సాకర్ వంటి ఇతర క్రీడలనూ రోబోలతో ఆడిస్తుండటం విశేషం.