కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్) సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటింది. గత మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ చేతిలో ఘోర ఓటమి ఎదుర్కొన్న కోల్‌కతా..సొంత ఇలాఖా ఈడెన్‌గార్డెన్స్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ భరతం పట్టింది. వైభవ్ అరోరా ఆదిలోనే ఢిల్లీని దెబ్బకొట్టగా, మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి మిడిల్‌ను కుప్పకూల్చాడు. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన క్యాపిటల్స్.. ఆఖర్లో కుల్దీప్యాదవ్ బ్యాటింగ్‌తో పరువు దక్కించుకుంది. లక్ష్యఛేదనలో ఫిల్‌సాల్ట్ బౌండరీలతో దుమ్మురేపితే..శ్రేయాస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్ గెలుపు లాంఛనాన్ని పూర్తి చేశారు. ఈ విజయంతో ప్లేఆఫ్స్ బెర్తుకు మరింత చేరువ కాగా, ఢిల్లీ మరో ఓటమిని ఖాతాలో వేసుకుంది.
IPL | కోల్‌కతా: ఈడెన్‌గార్డెన్స్‌లో చప్పగా సాగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై కోల్‌కతా నైట్‌రైడర్స్‌దే పైచేయి అయ్యింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ 7 వికెట్ల తేడాతో ఢిల్లీపై భారీ విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచిన ఢిల్లీ..బ్యాటింగ్ ఎంచుకుంది. గత మ్యాచ్‌లో రికార్డులు బద్దలైన వేళ ఈ మ్యాచ్‌లోనూ పరుగుల వరదే అనుకున్న అభిమానులకు నిరాశే ఎదురైంది. వరుణ్ చక్రవర్తి(3/16), హర్షిత్ రానా(2/28), వైభవ్ అరోరా(2/29) ధాటికి ఢిల్లీ 20 ఓవర్లలో 153/9 స్కోరు చేసింది. కుల్దీప్యాదవ్(35 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలువగా, ప్రధాన బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు.
భీకరమైన ఫామ్‌లోఉన్న జేక్ ఫ్రేజర్(12) తీవ్రంగా నిరాశపరిచాడు. గాయం నుంచి కోలుకుని జట్టులోకి వచ్చిన అరోరా..ఢిల్లీని ఘోరంగా దెబ్బకొట్టగా, మిగతా పనిని చక్రవర్తి పూర్తి చేశాడు. ఆ తర్వాత స్వల్ప లక్ష్యఛేదనలో కేకేఆర్ ఓపెనర్ ఫిల్ సాల్ట్(33 బంతుల్లో 68, 7ఫోర్లు, 5 సిక్స్‌లు) జట్టుకు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. పసలేని ఢిల్లీ బౌలింగ్‌ను చీల్చిచెండాడుతూ సాల్ట్ బౌండరీలతో విరుచుకుపడ్డాడు. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్(33 నాటౌట్), వెంకటేశ్ అయ్యర్(26 నాటౌట్) రాణించారు. అక్షర్‌పటేల్(2/25)కు రెండు వికెట్లు దక్కాయి. చక్రవర్తికి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.
తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీకి సరైన శుభారంభం దక్కలేదు. కోల్‌కతా ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశిద్దామనుకున్న ఢిల్లీని ఆదిలోనే వైభవ్ అరోరా దెబ్బతీశాడు. ఓపెనర్ పృథీషా(13)ను ఔట్ చేసి ఢిల్లీ వికెట్ల పతనానికి నాంది పలికాడు. షాట్ ఆడబోయిన షా..కీపర్ సాల్ట్‌కు క్యాచ్ ఇచ్చి తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. లీగ్‌లో సూపర్ ఫామ్‌మీదున్న జేక్ ఫ్రేజర్‌ను సాల్ట్ పెవిలియన్ సాగనంపాడు. దీంతో ఢిల్లీ 30 పరుగులకే ఓపెనర్లను కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకొచ్చిన అభిషేక్ పోరెల్(18), షాయి హోప్(6) విఫలమయ్యారు. హోప్‌ను అరోరా క్లీన్‌బౌల్డ్ చేస్తే..పోరెల్..రానాకు వికెట్ సమర్పించుకున్నాడు.
ఇన్నింగ్స్ నిలబెట్టేందుకు ప్రయత్నించిన కెప్టెన్ రిషబ్ పంత్(27) క్రీజులో నిలదొక్కుకోలేకపోయాడు. వరుణ్ బౌలింగ్‌లో శ్రేయాస్‌కు క్యాచ్ ఇచ్చి ఐదో వికెట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత అక్షర్‌పటేల్(15), స్టబ్స్(4), కుశాగ్ర(1) ఘోరంగా నిరాశపరిచారు. ఆఖర్లో కుల్దీప్యాదవ్ బ్యాటు ఝులిపిస్తూ ఐదు ఫోర్లు, ఒక సిక్స్ కొట్టడంతో ఢిల్లీ 150 పరుగుల మార్క్ అందుకుంది. లేకపోతే స్వల్ప స్కోరుకు పరిమితయ్యేది.
ఢిల్లీ నిర్దేశించిన స్వల్ప లక్ష్యఛేదనను కోల్‌కతా ఆడుతూ పాడుతూ ఛేదించింది. ఓపెనర్ సాల్ట్ మొదటి నుంచే ఢిల్లీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. లిజార్డ్ విలియమ్స్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే ఢిల్లీ ఓటమి ఖరారైంది. ఈ ఓవర్లో 23 పరుగులు వచ్చాయి. ఖలీల్ అహ్మద్ తొలి ఓవర్ మొదటి బంతికే సాల్ట్ ఔటయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డాడు. సాల్ట్ ఇచ్చిన క్యాచ్‌ను విలియమ్స్ విడిచిపెట్టడంతో లైఫ్ దక్కింది. ఇక అక్కణ్నుంచి వెనుదిరిగి చూసుకోని సాల్ట్ బౌండరీలతో చెలరేగాడు.
బౌలర్ ఎవరన్నది లెక్కచేయని సాల్ట్ ఈ క్రమంలో 26 బంతుల్లోనే అర్ధసెంచరీ మార్క్ అందుకున్నాడు. దీంతో పవర్ ప్లే ముగిసే సరికి వికెట్ కోల్పోకుండా 79 పరుగులు చేసింది. అక్షర్ బౌలింగ్‌లో సునీల్ నరైన్(15) ఔటయ్యాడు. మూడో డౌన్లో బ్యాటింగ్‌కు వచ్చిన రింకూసింగ్(11) నిరాశపరిచినా..శ్రేయాస్, వెంకటేశ్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడుతూ జట్టును గెలుపు తీరాలకు చేర్చారు. వీరిని విడదీసేందుకు పంత్ ప్రయత్నించినా..ఢిల్లీ పేలవ ఫీల్డింగ్ అవకాశాలను దెబ్బతీసింది.
ఢిల్లీ: 20 ఓవర్లలో 153/9(కుల్దీప్ 35 నాటౌట్, పంత్ 27, చక్రవర్తి 3/16, రానా 2/28),
కోల్‌కతా: 16.3 ఓవర్లలో 157/3(సాల్ట్ 68, శ్రేయాస్ 33 నాటౌట్, అక్షర్‌పటేల్ 2/25, విలియమ్స్ 1/38)