న్యూయార్క్: తాడిని తన్నేవాడుంటే వాడి తలదన్నేవాడుంటాడన్నట్లు.. టాప్‌సీడ్ మెద్వెదెవ్‌ను ఓడించి క్వార్టర్స్‌కు చేరిన కిర్గియోస్‌కు కచనొవ్ రూపంలో అడ్డంకి ఎదురైంది. యుఎస్ ఓపెన్ టోర్నీ పురుషుల క్వార్టర్ఫైనల్లో కరెన్ కచనొవ్ అయిదు సెట్ల హోరాహోరీ పోరులో కిర్గియోస్‌ను ఓడించి తొలిసారి ఒక గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరుకున్నాడు. కచనొవ్ 7-5, 4-6, 7-5, 6-7(3), 6-4తో కిర్గియోస్‌ను ఇంటిబాట పట్టించాడు.
కచనొవ్ సెమీస్‌లో నార్వేకు చెందిన కాస్పర్ రూడ్‌తో తలపడతాడు. రూడ్ 6-1, 6-4, 7-6(4)తో ఇటలీకి చెందని మాటియో బెరెట్టినిపై గెలుపొంది కచనొవ్తో పోరుకు సిద్ధమయ్యాడు. ఈ విజయంతో రూడ్ టాప్ ర్యాంక్‌కు మరింత దగ్గరయ్యాడు. కాగా మహిళల విభాగంలో సెరెనా వారసురాలిగా పేరొందిన కొకొ గాఫ్ క్వార్టర్స్‌లోనే వెనుతిరిగింది. కిర్గియోస్‌తో పోరులో మ్యాచ్ పాయింట్వద్ద కచనొవ్ ఒక తిరుగులేని సర్వీస్‌తో విజయాన్ని సొంతం చేసుకున్నాడు. మెరుపు సర్వీసులకు పెట్టింది పేరైన కచనొవ్ ఎంతో సంయమనం ప్రదర్శించి తొమ్మిది బ్రేక్ పాయింట్లలో ఏడింటిని కాచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో కిర్గియోస్ తన భావోద్వేగాలకు భిన్నంగా ప్రవర్తించాడు. ఆరంభంలోనే సర్వీసును కోల్పోయిన కిర్గియోస్ సెట్నుకూడా చేజార్చుకున్నాడు. అయినా కోలుకుని రెండో సెట్‌ను గెలుచుకుని బరిలో నిలిచాడు. ఆపై నువ్వానేనా అన్నట్టు సాగిన మ్యాచ్‌లో చెరో సెట్‌ను గెలుచుకున్నారు. నిర్ణాయక అయిదో సెట్ ఆరంభంలోనే బ్రేక్ సాధించిన కచనొవ్ అదే జోరులో సెట్‌ను, మ్యాచ్‌ను గెలుచుకుని ముందంజవేశాడు. దీనితో ఓటమిని భరించలేని కిర్గియోస్ అలవాటుచొప్పున తన రాకెట్‌ను ధ్వంసం చేసి నిరాశను వ్యక్తంచేశాడు. కచనొవ్ సెమీస్ ప్రత్యర్థి రూడ్ వరుస సెట్లలో బెరెట్టినిపై విజయం సాధించాడు. తొలి రెండు సెట్లలో తేలికగా తలొగ్గిన బెరెట్టిని మూడో సెట్‌ను టైబ్రేక్‌కు తీసుకెళ్లాడు.
గార్సియా గర్జన
మహిళల సింగిల్స్‌లో ఫ్రాన్స్ క్రీడాకారిణి కరోలిన్ గార్సియా వరుస సెట్లలో 6-3, 6-4తో గాఫ్‌పై గెలుపొందింది. ఈ విజయంతో గార్సియా గ్రాండ్‌స్లామ్ టోర్నీలో తొలిసారి సెమీస్‌కు చేరుకుంది. మ్యాచ్ ఆరంభం నుంచి గార్సియా ఆధిపత్యం ప్రదర్శించింది. వరుసగా రెండు బ్రేక్‌లు సాధించి 4-0 ఆధిక్యంలోకి దూసుకుపోయింది. తరువాత సుదీర్ఘంగా సాగిన వ్యాలీతో గార్సియా తొలి సెట్‌ను దక్కించుకుంది. రెండో సెట్లోనూ గాఫ్ పుంజుకోలేపోయింది. 3-2తో వెనుకంజలో ఉన్నపుడు బ్రేక్ సాధించే అవకాశాన్ని కోల్పోయి సెట్ స్కోరును సమం చేసే అవకాశాన్ని గాఫ్ చేజార్చుకుంది. చివరకు గాఫ్ బ్యాక్‌హ్యాండ్ షాట్ నెట్‌కు తగలడంతో గార్సియా సెట్‌ను, మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. ఈ యేడాది మూడు టోర్నీలలో విజేతగా నిలిచిన గార్సియాకు గాఫ్ సరితూగ లేకపోయింది. మ్యాచ్‌లో గార్సియా నాలుగు ఏస్లతోపాటు మొత్తం 24 విన్నర్స్‌ను సర్వ్ చేయగా, గాఫ్ అయిదు ఏస్‌లతో 18 విన్నర్లను మాత్రమే సర్వ్ చేయగలిగింది. గార్సియా సెమీఫైనల్లో ట్యునీషియాకు చెందిన ఓన్స్ జాబర్‌తో తలపడుతుంది. క్వార్టర్ఫైనల్లో జాబర్ 6-4, 7-6 (4)తో ఆస్ట్రేలియాకు చెందిన అజ్ల తామ్జనోవిచ్ను ఓడించింది.