మెగా టోర్నీలో సంచలన ప్రదర్శన చేస్తున్న చిన్న జట్టు కాబోవెర్డె నాకౌట్ చేరుకొని చర్రిత సృష్టించింది. వరల్డ్ కప్‌లో నాకౌట్ రౌండ్‌కు అర్హత సాధించిన అతి చిన్న దేశంగా రికార్డుకెక్కింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో స్పెయిన్, ఉరుగ్వేను నిలువరించిన కాబో.. గ్రూప్-హెచ్లో తమ ఆఖరి పోరులో 0-0తో సౌదీ అరేబియాతో డ్రా చేసుకుంది. దాంతో మూడు పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి రౌండ్-32లో అడుగు పెట్టింది. 40 ఏండ్ల వెటరన్ గోల్ కీపర్ వోజిన్హా ఈ మ్యాచ్‌లోనూ ప్రత్యర్థికి అడ్డు గోడలా నిలిచి కాబో విజయంలో కీలక పాత్ర పోషించాడు. మూడు కీలక సేవ్స్ చేసి సౌదీని దెబ్బకొట్టాడు. ఏడు ప్రయత్నాల తర్వాత వరల్డ్ కప్‌నకు క్వాలిఫై అయిన ఆ జట్టు అరంగేట్రంలోనే గ్రూప్ దశను విజయవంతంగా దాటింది. గ్రూప్‌లో ఒక్క గెలుపు లేకున్నా ముందంజ వేసిన కాబో.. జూలై 4న జరిగే రౌండ్32 పోరులో డిఫెండింగ్ చాంప్ అర్జెంటీనా తలపడనుంది. మరో మ్యాచ్‌లో స్పెయిన్ 1-0తో ఉరుగ్వేను ఓడించి గ్రూప్-హెచ్ టాపర్‌గా ముందంజ వేసింది.