ముంబై: ఐపీఎల్లో బ్రిటన్‌కు చెందిన బ్రాడ్కాస్ట్ ఇంజినీర్ అనుమానస్పద మృతి కలకలం రేపింది. లీగ్ కోసం పనిచేస్తున్న 76 ఏండ్ల జాన్ విలియమ్ లాంగ్‌ఫోర్డ్ ముంబైలోని హోటల్లో అచేతనంగా పడిపోవడం పలు అనుమానాలకు తావిస్తున్నది. గత ఆదివారం ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య మ్యాచ్ ముగిశాక తాను బస చేస్తున్న హోటల్‌కు చేరుకున్నాడు.
అయితే మరుసటి రోజు లాంగ్‌ఫోర్డ్ నుంచి ఎలాంటి ప్రతిస్పందన లేకపోవడంతో అనుమానం వచ్చి హోటల్ రూమ్ తెరువడంతో అతడు సృహలేకుండా పడిపోయి ఉన్నాడు. డ్యూటీ డాక్టర్ పరిశీలించిన అనంతరం దగ్గరలోని దవాఖానకు తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు పేర్కొన్నారు. అయితే పోస్ట్‌మార్టం నివేదికలో ఎలాంటి అనుమానస్పద అంశాలు లేవని, సహజ మరణమేనని దవాఖాన వర్గాలు పేర్కొన్నాయి.