దుబాయ్ : అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పుడిప్పుడే ఓనమాలు దిద్దుతున్న బ్రెజిల్ తరఫున ఆ జట్టు బౌలర్ లారా కార్డొసొ ప్రపంచ రికార్డు ప్రదర్శనతో సత్తాచాటింది. అంతర్జాతీయ టీ20ల్లో మరే బౌలర్‌కూ సాధ్యం కాని రీతిలో ఒకే ఇన్నింగ్స్‌లో ఏకంగా 9 వికెట్లు తీసి సరికొత్త రికార్డు సృష్టించింది. ఐసీసీ ఆధ్వర్యంలో దక్షిణ అమెరికా, ఆఫ్రికాకు చెందిన ఏడు దేశాలు ఆడే బోట్స్వానా క్రికెట్ అసోసియేషన్ (బీసీఏ) కలహరి ఉమెన్స్ టీ20 టోర్నమెంట్లో భాగంగా లెసొతొతో జరిగిన మ్యాచ్‌లో లారా ఈ రికార్డు నెలకొల్పింది.
రెండో ఓవర్లో బౌలింగ్‌కు వచ్చిన లారా.. ఆఖరి మూడు బంతుల్లో హ్యాట్రిక్ తీయడంతో పాటు తన తదుపరి ఓవర్ రెండు బంతులకూ వికెట్లు పడగొట్టింది. 3 ఓవర్లు విసిరిన ఆమె.. 2 మెయిడిన్లతో 4 పరుగులు (ఇందులో మూడు వైడ్ల ద్వారా వచ్చినవే) మాత్రమే ఇచ్చి ఏకంగా 9 వికెట్లు తీయడం గమనార్హం. లారా దెబ్బకు లెసొతొ 6.2 ఓవర్లలో 13 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టులో ఏకంగా ఏడుగురు ఖాతానే తెరవలేదు. కాగా టీ20 ఫార్మాట్లో ఇదే అత్యుత్తమ ప్రదర్శన. గతంలో భూటాన్ బౌలర్ సోనమ్ (8 వికెట్లు) తీయడమే ఇప్పటిదాకా బెస్ట్. మహిళల టీ20ల్లో లారా.. ఇండోనేషియా బౌలర్ రొహమలియ (7/0) రికార్డును అధిగమించింది.