భారత్ మరో విజయంపై కన్నేసింది. బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటికే 1-0 ఆధిక్యంలో ఉన్న టీమ్ఇండియా క్లీన్‌స్వీప్ లక్ష్యంగా బరిలోకి దిగుతున్నది. గురువారం నుంచి మొదలవుతున్న రెండో టెస్టులో బంగ్లాను మట్టికరిపించి ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) రేసులో దూసుకెళ్లాలని చూస్తున్నది. స్వదేశంలో ఆస్ట్రేలియాతో టెస్టు పోరుకు సన్నాహంగా భావిస్తున్న బంగ్లా సమరంలో యువ క్రికెటర్లు అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. తొలి టెస్టులో శుభ్‌మన్ గిల్,కుల్దీప్యాదవ్ అదరగొట్టగా, వెటరన్ బ్యాటర్ పుజారా టచ్‌లోకి వచ్చాడు. ఇదే దూకుడు కనబరుస్తూ బంగ్లాను చిత్తు చేయాలని భారత్ భావిస్తున్నది.
మిర్పూర్: ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్యూటీసీ)లో ప్రతీ మ్యాచ్ కీలకమైన నేపథ్యంలో భారత్ పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నది. ఓవైపు ఆస్ట్రేలియా వరుస విజయాలతో దూసుకెళుతూ 120పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుంటే టీమ్ఇండియా 87 పాయింట్లతో రెండులో ఉంది. ఇప్పటి వరకు భారత్ ఏడు విజయాలు, నాలుగు ఓటములు, రెండు డ్రాలు చేసుకుంది. గురువారం నుంచి బంగ్లాదేశ్‌తో మొదలవుతున్న రెండో టెస్టులోనూ గెలిచి డబ్ల్యూటీసీ రేసులో మరింత ముందంజ వేయాలని టీమ్ఇండియా చూస్తున్నది. అయితే వన్డే సిరీస్ విజయమిచ్చిన ఆత్మవిశ్వాసంతో బంగ్లా..టీమ్ఇండియాకు దీటైన పోటీనిస్తున్నది. తొలి టెస్టులో భారీ విజయం ఖాయమనుకున్న భారత్‌కు బంగ్లా నుంచి అనూహ్య ప్రతిఘటన ఎదురైంది.
టీమ్ఇండియాను గాయాల బెడద బాధిస్తూనే ఉంది. రోహిత్‌శర్మ, నవ్‌దీప్‌సైనీ, షమీ, బుమ్రా ఇప్పటికే గాయాలతో జట్టుకు దూరం కాగా, కేఎల్ రాహుల్ ఈ జాబితాలో చేరే అవకాశం కనిపిస్తున్నది. బంగ్లాతో రెండో టెస్టు కోసం బుధవారం నెట్ ప్రాక్టీస్‌లో రాహుల్ చేతికి గాయమైంది. అయితే గాయం తీవ్రత అంతగా ఏం లేదని మ్యాచ్ మొదలయ్యే సమయానికి రాహుల్ ఫిట్నెస్ సాధిస్తాడని బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ పేర్కొన్నాడు. ఒకవేళ రాహుల్ దూరమైతే అతని స్థానంలో అభిమన్యు ఈశ్వరన్‌కు అవకాశం దక్కనుంది. ఇదిలా ఉంటే గిల్, పుజారా ఫామ్‌లోకి రావడం జట్టుకు లాభించే అంశం కానుండగా, సీనియర్ విరాట్ కోహ్లీ బ్యాటు ఝుళిపిస్తే పరుగుల వరద ఖాయం గా కనిపిస్తున్నది. దాదాపు రెండేండ్ల తర్వాత జట్టులోకి వచ్చిన చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తనలో సత్తా తగ్గలేదని నిరూపించా ఓవైపు అశ్విన్, అక్షర్ అంతగా ఆకట్టుకోలేని వేళ కుల్దీప్ ఎనిమిది వికెట్లతో జట్టు విజయంలో కీలకంగా వ్యవహరించాడు.
పోటీనివ్వాలని: భారత్‌కు దీటైన పోటీనిచ్చేందుకు బంగ్లా తహతహలాడుతున్నది. అరంగేట్రం టెస్టులోనే సెంచరీతో కదంతొక్కిన జకీర్ హసన్ మరోమారు అదరగొట్టాలని చూస్తున్నాడు. సీనియర్ బ్యాటర్లు లిటన్ దాస్, ముష్పికర్ రహీమ్ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబరిస్తే బంగ్లాకు తిరుగుండకపోవచ్చు.
భారత్: గిల్, రాహుల్(కెప్టెన్)/ఈశ్వరన్, పుజారా, కోహ్లీ, పంత్, అయ్యర్, అక్షర్, అశ్విన్, కుల్దీప్, ఉమేశ్, సిరాజ్
బంగ్లాదేశ్: నజ్ముల్, జకీర్, యాసిర్, లిటన్‌దాస్, షకీబల్(కెప్టెన్), ముష్పికర్, నూరుల్, మెహదీ హసన్, తైజుల్, తస్కిన్, ఖాలెద్.