సీజన్ ఆరంభ గ్రాండ్‌స్లామ్ టోర్నీ.. ఆస్ట్రేలియా ఓపెన్ అంచనాలకు తగ్గట్లు సాగుతున్నది. మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ అరియానా సబలెంక, కోకో గాఫ్ ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టగా.. పురుషుల విభాగంలో టాప్ సీడ్ జొకోవిచ్, రుబ్లేవ్, సిట్సిపాస్, సిన్నెర్ ముందంజ వెశారు. డబుల్స్‌లో రోహాన్ బోపన్న, బాలాజీ జోడీలు విజయాలు సాధించాయి.
మెల్బోర్న్: డిఫెండింగ్ చాంపియన్ అరియానా సబలెంక ఆస్ట్రేలియా ఓపెన్‌లో సత్తాచాటుతున్నది. రెండో సీడ్‌గా బరిలోకి దిగిన ఈ బెలారస్ ప్లేయర్.. మహిళల సింగిల్స్ మూడో రౌండ్లో ప్రత్యర్థికి ఒక్క గేమ్ కూడా కోల్పోకుండా విజయం సాధించింది. శుక్రవారం జరిగిన పోరులో సబలెంక 6-0, 6-0తో సురెంకోపై గెలుపొందింది.
52 నిమిషాల్లోనే ముగిసిన పోరులో ప్రత్యర్థిని ఊపిరి మెసలనివ్వకుండా సబలెంక వరుస పాయింట్లతో రెచ్చిపోయింది. పూర్తి ఏకపక్షంగా సాగిన పోరులో సబలెంక 16 విన్నర్లు కొట్టగా.. ప్రత్యర్థి ఏడింటికే పరిమితమైంది. 6 డబుల్ ఫాల్ట్స్ చేసిన సురెంకో.. 15 అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది. ‘నా ప్రదర్శనతో సంతృప్తిగా ఉన్నా. ఈ స్థాయి విజయం కోసం చాన్నాళ్లుగా కష్టపడుతున్నా. నిరుడు ఇగా స్వియాటెక్ ఇలా (6-0) ప్రత్యర్థులపై పూర్తి ఆధిపత్యం కనబర్చింది.
ఆమెను సమీపించాలనే లక్ష్యం పెట్టుకున్న నేను.. అందుకు తగ్గట్లే అడుగులు వేస్తున్నా’ అని మ్యాచ్ అనంతరం సబలెంక వెల్లడించింది. మరో మ్యాచ్‌లో బడోసాపై గెలిచిన అనిసిమోవాతో.. ప్రిక్వార్టర్స్‌లో సబలెంక అమీతుమీ తేల్చుకోనుంది. ఇతర మ్యాచ్‌ల్లో అమెరికా యంగ్‌స్టర్ కోకో గాఫ్ 6-0, 6-2తో పార్క్స్పై.. క్రెజికోవా 4-6, 7-5, 6-3తో హంటర్‌పై.. టిమోఫీవ 7-6 (9/7), 6-3తో హద్దద్ మయాపై విజయాలు సాధించారు.
జొకోవిచ్ అలవోకగా..
పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ జొకోవిచ్ అలవోక విజయం సాధించాడు. శుక్రవారం మూడో రౌండ్లో జొకో 6-3, 6-3, 7-6 (7/2)తో ఎచెన్వెర్రీపై గెలుపొందాడు. తొలి రెండు సెట్లను సునాయాసంగా దక్కించుకున్న టాప్‌సీడ్‌కు.. మూడో సెట్లో ప్రత్యర్థి నుంచి కాస్త ప్రతిఘటన ఎదురైనా.. ఏమాత్రం వెనక్కి తగ్గని జొకో.. బలమైన సర్వీస్‌లు, అద్భుతమైన బ్యాక్ హ్యాండ్ షాట్లతో ప్రత్యర్థి పనిపట్టాడు. ఇతర మ్యాచ్‌ల్లో రుబ్లేవ్ 6-2, 7-6 (8/6), 6-4తో కోర్డాపై.. సిట్సిపాస్ 6-3, 6-0, 6-4తో వాన్ అచేపై.. సిన్నెర్ 6-0, 6-1, 6-3తో బీజ్‌పై.. కచనోవ్ 6-4, 7-6 (7/4), 4-6, 7-6 (7/5)తో మచాక్పై గెలిచారు.
ప్రిక్వార్టర్స్‌లో బోపన్న జోడీ
భారత సీనియర్ ప్లేయర్ రోహన్ బోపన్న ఆస్ట్రేలియా ఓపెన్ ప్రిక్వార్టర్స్‌కు చేరాడు. పురుషుల డబుల్స్ రెండో రౌండ్లో బోపన్న-మాథ్యూ జంట 6-2, 6-4తో జాన్-ఎడ్వర్డ్‌పై గెలిచి ముందంజ వేసింది. మరో మ్యాచ్‌లో శ్రీరామ్ బాలాజీ జంట రెండో రౌండ్లో అడుగు పెట్టింది.