క్వార్టర్స్‌లో అల్కరాజ్
యువ ఆటగాడు కార్లోస్ అల్కరాజ్ ఆస్ట్రేలియా ఓపెన్ క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాడు. నిరుడు వింబుల్డన్ టైటిల్ నెగ్గిన ఈ 20 ఏండ్ల యంగ్‌గన్.. రాడ్ లీవర్ ఎరీనాలో జరిగిన ప్రిక్వార్టర్స్‌లో ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగిపోయాడు.
- ఆస్ట్రేలియా ఓపెన్
- జ్వెరెవ్, మెద్వెదెవ్ ముందంజ
- మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లో నలుగురు కొత్తవాళ్లు
సీజన్ ఆరంభ గ్రాండ్‌స్లామ్ టోర్నీ.. ఆస్ట్రేలియా ఓపెన్‌లో రెండో సీడ్ కార్లోస్ అల్కరాజ్ క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. ప్రత్యర్థులతో సంబంధం లేకుండా.. తన అద్వితీయ ఫామ్ కొనసాగిస్తున్న ఈ నయా స్పెయిన్ బుల్.. ప్రిక్వార్టర్స్‌లో కెక్మానొవిక్పై అలవోకగా విజయం సాధించాడు. వరుస సెట్లలో ప్రత్యర్థిని మట్టికరిపించి ముందడుగు వేశాడు. మూడోసీడ్ మెద్వెదెవ్, జ్వెరెవ్ కూడా క్వార్టర్స్ చేరగా.. మహిళల సింగిల్స్‌లో నొకోవా, జెంగ్ ముందంజవేశారు. హోరాహోరీగా సాగిన పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో రోహన్ బోపన్న జోడీ సంచలన ప్రదర్శన కనబర్చింది.
మెల్బోర్న్: యువ ఆటగాడు కార్లోస్ అల్కరాజ్ ఆస్ట్రేలియా ఓపెన్ క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాడు. నిరుడు వింబుల్డన్ టైటిల్ నెగ్గిన ఈ 20 ఏండ్ల యంగ్‌గన్.. రాడ్ లీవర్ ఎరీనాలో జరిగిన ప్రిక్వార్టర్స్‌లో ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగిపోయాడు. సోమవారం పోరులో ప్రపంచ రెండో ర్యాంకర్ అల్కరాజ్ 6-4, 6-4, 6-0తో ప్రపంచ 60వ ర్యాంకర్ కెక్మానోవిక్పై ఏకపక్ష విజయం నమోదు చేసుకున్నాడు. గాయం కారణంగా నిరుడు ఆస్ట్రేలియా ఓపెన్‌కు దూరమైన అల్కరాజ్.. ఈసారి టోర్నీ ఆరంభం నుంచి అప్రతిహత విజయాలతో దూసుకెళ్తున్నాడు.
గంటా 49 నిమిషాల్లో ముగిసిన ప్రిక్వార్టర్స్ పోరులో 20 ఏండ్ల అల్కరాజ్.. విశ్వరూపం కనబర్చాడు. మ్యాచ్‌లో ఐదు ఏస్‌లు కొట్టిన అల్కరాజ్ 43 విన్నర్లు కొట్టగా.. 14 విన్నర్లే బాదిన కెక్మానోవిక్ 17 అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకున్నాడు. అల్కరాజ్ క్వార్టర్ ఫైనల్‌కు చేరే క్రమంలో ఒక సెట్ మాత్రమే ఓడాడు. ఆ తర్వాత ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా వరుస విజయాలతో ఫైనల్-8లో అడుగుపెట్టాడు. ఇతర మ్యాచ్‌ల్లో మూడోసీడ్ మెద్వెదెవ్ 6-3, 7-6 (7/4), 5-7, 6-1తో బోర్గెస్‌పై.. ఆరో సీడ్ జ్వెరెవ్ 7-5, 3-6, 6-3, 4-6, 7-6 (10/3)తో నోరీపై.. హర్కాజ్ 7-6 (8/6), 7-6 (7/3), 6-4తో కాజక్స్పై విజయం సాధించారు. టాప్ సీడ్ జొకోవిచ్ ఇప్పటికే క్వార్టర్స్ చేరగా.. హర్కాజ్తో మెద్వెదెవ్, జ్వెరెవ్‌తో అల్కరాజ్ తలపడనున్నారు.
నలుగురికి ఇదే తొలిసారి..
ఆస్ట్రేలియా ఓపెన్ మహిళల సింగిల్స్‌లో యంగ్ ప్లేయర్ల జోరు సాగుతున్నది. సీనియర్లకు షాక్ ఇస్తూ.. ఈసారి నలుగురు కొత్త ప్లేయర్లు గ్రాండ్‌స్లామ్ క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టారు. 12వ సీడ్ జెంగ్ 6-0, 6-3తో డాడిన్పై.. కలిన్స్కాయ 6-4, 6-2తో పావోలిన్పై.. యాస్త్రెమ్స్కా 7-6 (8/6), 6-4తో అజరెంకపై విజయాలు సాధించారు. నొకోవాతో జరిగిన మరో ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్ నుంచి గాయం కారణంగా స్వితోలినా తప్పుకుంది. క్వార్టర్స్‌లో యాస్త్రెమ్స్కాతో నొకోవా, కలిన్స్కాయతో జెంగ్ అమీతుమీ తేల్చుకోనున్నారు.

చెమటోడ్చిన బోపన్న జోడీ
ఇటీవలి కాలంలో వరుస విజయాలతో నిలకడైన ప్రదర్శన కనబరుస్తున్న భారత సీనియర్ ప్లేయర్ రోహన్ బోపన్న.. ఆస్ట్రేలియా ఓపెన్‌లో దుమ్మురేపుతున్నాడు. పురుషుల డబుల్స్‌లో ఆస్ట్రేలియా ప్లేయర్ మాథ్యూ ఎబ్డెన్తో జతకట్టిన బోపన్న క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టాడు. సోమవారం జరిగిన ప్రిక్వార్టర్స్‌లో బోపన్న-మాథ్యూ ద్వయం 7-6 (10/8), 7-6 (7/4)తో వెస్లీ-నికోలా మెక్టిక్ జంటపై గెలుపొందింది. రెండో సీడ్‌గా బరిలోకి దిగిన బోపన్న జంటకు.. 14వ సీడ్ జోడీ నుంచి గట్టి పోటీ ఎదురైంది. అయితే కీలక సమయాల్లో తన అనుభవాన్ని రంగరించిన 43 ఏండ్ల బోపన్న..
తిరుగులేని సర్వీస్‌లతో అదరగొట్టాడు. ఆద్యాంతం నువ్వా నేనా అన్నట్లు సాగిన పోరులో బోపన్న జోడీ 5 ఏస్‌లు కొట్టి 31 విన్నర్లు సంధిస్తే.. 18 విన్నర్లకే పరిమితమైన ప్రత్యర్థి జంట మూల్యం చెల్లించుకుంది. క్వార్టర్ ఫైనల్లో ఆరో సీడ్ మాక్సిమా గొంజలాజ్-ఆండ్రెస్ మోల్టెనీ (అర్జెంటీనా)తో బోపన్న-మాథ్యూ తలపడనున్నారు. ప్రస్తుతం పురుషుల డబుల్స్ బరిలో ఉన్న అత్యుత్తమ ర్యాంకర్లు వీళ్లే కాగా.. మరో మూడు మ్యాచ్‌ల్లో ఇదే జోరు కొనసాగిస్తే.. బోపన్న ఖాతాలో తొలి ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ చేరనుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Man Dragged On Car Roof | వ్యక్తి చేతులను కారు విండోలో ఇరికించి రూఫ్‌పై తీసుకెళ్లి.. వాహనంతో తొక్కి హత్య
Akka Trailer | స్త్రీల రాజ్యమేలుతున్న పెన్నురు గడ్డపై పవర్ వార్.. కీర్తి సురేష్ ‘అక్క’ ట్రైలర్ అదుర్స్!
Bigg Boss | బిగ్‌బాస్‌లో షాలిని రీ ఎంట్రీతో రచ్చ.. డబుల్ ఎలిమినేషన్‌కు రంగం సిద్ధమైందా?
NZvIND: కివీస్‌తో తొలి టీ20 మ్యాచ్.. ఇండియాను గెలిపించిన నమన్ ధీర్, సంజూ శాంసన్
Amit Shah | కాంగ్రెస్ పార్టీ మరో 30 ఏళ్లు అధికారంలోకి రాదు.. రాహుల్ గాంధీపైనా అమిత్ షా విమర్శలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

