సంచలనాలకు కేంద్రబిందువుగా నిలుస్తున్న ఫిఫా ప్రపంచకప్‌లో మరో షాకింగ్ ఫలితం నమోదైంది. సాకర్ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో ఉన్న బెల్జియంపై 22వ ర్యాంకర్ మొరాకో అద్వితీయ విజయం సాధించింది. సాబిరి, అబుఖలా చెరో గోల్‌తో మొరాకో అభిమానులను ఆనందంలో ముంచెత్తగా.. కప్పుపై కోటి ఆశలు పెట్టుకున్న బెల్జియం ఆటగాళ్లు నిరాశగా మైదానం వీడారు.
దోహా: అనూహ్య ఫలితాలతో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్న ఫిఫా ప్రపంచకప్‌లో మరో సంచలనం నమోదైంది. ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగిన ప్రపంచ రెండో ర్యాంకర్ బెల్జియంకు 22వ ర్యాంకర్ మొరాకో షాక్ ఇచ్చింది. గ్రూప్-‘ఎఫ్’లో భాగంగా ఆదివారం అల్-తుమామా స్టేడియంలో జరిగిన పోరులో మొరాకో 2-0తో బెల్జియంపై విజయం సాధించింది. అబ్దెల్ హామిద్ సాబిరి (73వ నిమిషంలో), జకారియా అబుఖలాల్ (90+2వ నిమిషంలో) చెరో గోల్‌తో మొరాకోను గెలిపించారు.
మ్యాచ్ ఆరంభం నుంచే బెల్జియం తన ఆధిపత్యం ప్రదర్శించేందుకు ప్రయత్నించగా.. మొరాకో కాస్త తడబడుతూ ఆట ఆరంభించింది. ఇరు జట్లు ప్రత్యర్థి గోల్ పోస్ట్‌లపై పదేసి సార్లు దాడి చేయగా.. అందులో మొరాకో రెండు షాట్లను గోల్స్‌గా మలచగలిగింది. మ్యాచ్ మొత్తం పరిశీలిస్తే.. బెల్జియం 67 శాతం బంతిని తమ అధీనంలో ఉంచుకున్నా ఫలితం లేకపోగా.. 33 శాతం మాత్రమే బంతిని నియంత్రించిన మొరాకో.. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఫలితం సాధించింది. మ్యాచ్ మొత్తంలో బెల్జియం ఆటగాళ్లు 651 పాస్‌లు అందించుకోగా.. మొరాకో ప్లేయర్లు 328 పాస్‌లకే పరిమితమయ్యారు.
తొలి అర్ధభాగంలో రెండుసార్లు గోల్ అవకాశాలను సృష్టించుకున్న బెల్జియం ప్లేయర్లు.. ఫినిషింగ్ లోపంతో గోల్ నమోదు చేయలేకపోయారు. దీంతో హాఫ్ టైమ్ వరకు ఇరు జట్లు 0-0తో నిలిచాయి. రెండో అర్ధభాగంలో అందివచ్చిన ఫ్రీ కిక్ అవకాశాన్ని సాబిరి సద్వినియోగ పరుచుకున్నాడు. ప్రత్యర్థి ఆటగాళ్లను తప్పిస్తూ బంతిని గోల్‌పోస్ట్‌లోకి పంపాడు. దీంతో ఒక్కసారిగా స్టేడియం మొత్తం మోతెక్కిపోగా.. ఆఖర్లో జకారియా మరో గోల్ కొట్టడంతో మొరాకో ఘనవిజయం సాధించింది. ఇతర మ్యాచ్‌ల్లో కోస్టారికా 2-0తో జపాన్‌పై, క్రొయేషియా 4-1తో కెనడాపై గెలుపొందాయి.
తొలి పోరులో సౌదీ అరేబియా చేతిలో ఖంగుతిన్న అర్జెంటీనా.. రెండో మ్యాచ్‌లో మెక్సికోపై ఘన విజయం సాధించింది. శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన పోరులో అర్జెంటీనా 2-0తో మెక్సికోపై గెలుపొందింది. అర్జెంటీనా స్టార్ లియోనెల్ మెస్సీ (64వ నిమిషంలో) తొలి గోల్‌తో జట్టుకు జోష్ ఇవ్వగా.. ఎన్జో ఫెర్నాండెజ్ (87వ నిమిషంలో) మరో గోల్‌తో గెలుపు ఖాయం చేశాడు.
తీవ్ర ఒత్తడి మధ్య బరిలోకి దిగిన అర్జెంటీనా తొలి అర్ధభాగంలో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. బంతిని తమ ఆధినంలో ఉంచుకున్నా.. గోల్స్ అవకాశాలను సృష్టించుకోలేకపోయింది. అయితే ద్వితియార్థంలో ప్లాన్ మార్చిన అర్జెంటీనా.. మరింత అటాకింగ్ గేమ్‌తో ఫలితం రాబట్టింది. 18 అడుగుల దూరం నుంచి మెస్సీ తన అద్వితీయ విన్యాసంతో తొలి గోల్ అందించగా.. ఆ తర్వాత అదే జోష్‌లో స్కోరు డబుల్ చేసిన అర్జెంటీనా.. సులువైన విజయాన్ని ఖాతాలో వేసుకుంది.