World Cup 2023 |వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్ రేసులో నిలువాలంటే తప్పినిసరిగా విజయం సాధించాల్సిన నేపథ్యంలో శుక్రవారం దక్షిణాఫ్రికాతో అఫ్గానిస్థాన్ అమీతుమీకి సిద్ధమైంది. గత మ్యాచ్‌లో గెలుపు అంచులదాకా వెళ్లి.. ఆఖర్లో ఒత్తిడిని జయించలేక పరాజయం పాలైన అఫ్గానిస్థాన్.. వన్డే ప్రపంచకప్‌లో మరో కీలక పోరుకు సిద్ధమైంది. మెగాటోర్నీలో భాగంగా శుక్రవారం అహ్మదాబాద్‌లో జరుగనున్న తమ చివరి లీగ్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో అఫ్గాన్ తలపడనుంది.
గత మ్యాచ్‌లో ఐదుసార్లు విశ్వ విజేత ఆస్ట్రేలియాను ఓడించినంత పనిచేసిన అఫ్గాన్ అదే జోరు ఇక్కడా కనబర్చాలని చూస్తుంటే.. భారత్ చేతిలో ఓడిన అనంతరం తిరిగి పుంజుకోవాలని సఫారీలు యోచిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తేనే సెమీస్ రేసులో నిలువనున్న నేపథ్యంలో అఫ్గాన్‌కు విజయం తప్పనిసరి!
అద్భుత బ్యాటింగ్‌కు ఆ తర్వాత బౌలర్ల క్రమశిక్షణ తోడవడంతో ఆస్ట్రేలియాతో పోరులో విజయానికి చేరువైన అఫ్గాన్.. చెత్త ఫీల్డింగ్‌తో మూల్యం చెల్లించుకుంది. స్కోరు బోర్డుపై వంద పరుగులు కూడా చేరకముందే.. ఏడుగురు ప్రధాన బ్యాటర్లు పెవిలియన్‌కు చేరిపోగా.. ఆఖరి ఆశ అయిన మ్యాక్స్‌వెల్ ఇచ్చిన సులువైన క్యాచ్‌ను ఆ జట్టు స్పిన్నర్ ముజీబ్ నేలపాలు చేశాడు. దాన్ని సద్వినియోగం చేసుకున్న మ్యాక్స్‌వెల్.. ప్రపంచకప్ చరిత్రలోనే అత్యంత విధ్వంసకర ఇన్నింగ్స్‌తో అఫ్గాన్ బౌలింగ్‌ను తుత్తునియాలు చేస్తూ.. కంగారూ జట్టు ఒంటి చేత్తో గెలిపించడమే కాక.. సెమీఫైనల్‌కు చేర్చాడు.
ఆ మ్యాచ్‌లో దాదాపు గెలిచినట్లు కనిపించిన అఫ్గాన్.. చివరి మ్యాచ్‌లోనూ అదే దూకుడు కొనసాగించాలని భావిస్తున్నది. మరోవైపు ఈ టోర్నీలో ఇప్పటి వరకు ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లో కేవలం భారత్, నెదర్లాండ్స్ చేతిలో మాత్రమే ఓడి నాలుగుసార్లు 350+ స్కోర్లు చేసిన సఫారీ జట్టు కాబూలీలపై అదే ప్రతాపం కొనసాగించాల్సిన అవసరం ఉంది. మొదట బ్యాటింగ్ చేస్తున్న సమయంలో దంచికొడుతున్న ప్రొటీస్.. లక్ష్యఛేదన అనేసరికి మాత్ర తడబడుతున్నారు.
వరల్డ్‌కప్‌లో ఓడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఆ జట్టు లక్ష్యాలను ఛేదించలేకే చతికిలబడింది. దీంతో నాకౌట్ మ్యాచ్‌లకు ముందు తమ చేజింగ్‌ను పరీక్షించుకోవాలని బవుమా సేన భావిస్తున్నది. డికాక్, క్లాసెన్, మార్క్రమ్, డసెన్, మిల్లర్, జాన్సెన్, రబడ, కేశవ్ మహరాజ్ ఆ జట్టుకు కీలకం కానుండగా.. అఫ్గాన్ తమ స్పిన్నర్లనే నమ్ముకుంది. రషీద్‌ఖాన్, నబీ, ముజీబ్, నూర్ ప్రదర్శనపైనే ఈ మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంది.