నైరోబి : కెన్యాలో జరిగిన ఒక మహిళల చెస్ టోర్నీలో పురుష చెస్ ఆటగాడు బురఖా ధరించి కళ్లజోడు పెట్టుకుని పోటీలో పాల్గొన్నాడు. 25 ఏళ్ల స్టాన్లీ ఒమండి అనే అటగాడు తన పేరును మిల్లిసెంట్ అవోర్గా మార్చుకుని పోటీలలో పాల్గొన్నాడు. ముస్లిం క్రీడాకారిణులు బురఖా ధరించి చెస్ పోటీలలో పాల్గొనడం అక్కడ సర్వసాధారణం. అందుకే నిర్వాహకులకు మొదట ఆనుమానం రాలేదు. అయితే అతడు అసాధారణ విజయాలు సాధిస్తుండడంతో అనుమానం వచ్చిన నిర్వాహకులు అతడి వివరాలు అడిగినపుడు అసలు విషయం బయటపడింది.
తాను ఒక యూనివర్శిటీ చెస్ ప్లేయర్‌నని, ఆర్ధిక ఇబ్బందులతో ఈ టైటిల్ గెలిస్తే వచ్చే బహుమతితో తన ఇబ్బందులు తొలగిపోతాయని ఈ చర్యకు పాల్పడినట్టు అతడు వెల్లడించాడు. తన తప్పును ఒప్పుకుని ఎటువంటి శిక్షకైనా సిద్ధమేనని లిఖితపూర్వకంగా తెలిపాడు. అతడిపై చాలా ఏళ్లు నిషేధం విధిస్తామని, అయితే ఎంతకాలం అనేది చెప్పలేమని కెన్యా చెస్ సంఘం అధ్యక్షుడు బెర్నార్డ్ వాంజల తెలిపారు. దీనిపై క్రమశిక్షణ కమిటీ వేశామని శిక్షను ఖరారు చేస్తుందని బెర్నార్డ్ తెలిపారు.