బోస్టన్ : సాకర్ ప్రపంచకప్‌లో ఫ్రాన్స్ స్టార్ కిలియన్ ఎంబాపె హవా కొనసాగుతోంది. ఫుట్‌బాల్ ఆటలోనే అత్యంత కఠినమైన ఫిఫాకప్లో ఒక్క గోల్ కొట్టడమే ఆటగాళ్లకు పెద్ద ఘనత అనుకుంటే.. అతను మాత్రం టీ20 క్రికెటర్ల తరహాలో దంచికొడుతూ గోల్స్ మోత మోగిస్తున్నాడు. మెగా టోర్నీలో ఇప్పటివరకు ఆడిన 20 మ్యాచ్‌ల్లో మ్యాచ్‌కు ఒకటి చొప్పున 20 గోల్స్ కొట్టి అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అతని మెరుపులతో గత ఎడిషన్ రన్నరప్ ఫ్రాన్స్ వరుసగా మూడోసారి సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది.
శుక్రవారం తెల్లవారుజామున జరిగిన క్వార్టర్స్‌లో 2-0 తేడాతో మొరాకోను చిత్తు చేసింది. తొలి అర్ధభాగంలో ఫ్రాన్స్ ఖాతా తెరవలేకపోయినప్పటికీ.. సెకండాఫ్‌లో ఆరు నిమిషాల వ్యవధిలోనే మొరాకోను ముంచేసింది. 27 ఏండ్ల ఎంబాపె 60వ నిమిషంలో అద్భుత గోల్ సాధించగా.. 66వ నిమిషంలో అతను అందించిన పాస్‌ను ఉస్మాన్ డెంబెలే గోల్‌గా మలిచాడు. గత టోర్నీ సెమీఫైనల్ తరహాలోనే ఈసారి కూడా ఫ్రాన్స్ చేతిలో ఇదే స్కోరుతో పరాజయం పాలై మొరాకో తన ప్రపంచకప్ ప్రస్థానాన్ని ముగించింది. ఈ ఎడిషన్‌లో ఇప్పటికే 8 గోల్స్ కొట్టిన ఎంబాపె.. గోల్డెన్ బూట్ రేసులో అర్జెంటీనా దిగ్గజం లియోనల్ మెస్సీకి గట్టి పోటీ ఇస్తున్నాడు.
మ్యాచ్ ఆరంభం నుంచి ఫ్రాన్స్ పూర్తిగా అటాకింగ్ గేమ్ ఆడినప్పటికీ ఫస్టాఫ్‌లో గోల్స్ మాత్రం నమోదు కాలేదు. ఆట 25వ నిమిషంలో మొరాకో డిఫెండర్ నౌసైర్ మజ్రౌయి బాక్స్ లోపల ఎంబాపెను కిందపడేయడంతో పెనాల్టీ లభించింది. అయితే, సుదీర్ఘ వార్ సమీక్ష తర్వాత ఎంబాపె కొట్టిన పెనాల్టీ కిక్‌ను మొరాకో కీపర్ యాసిన్ బోనో అద్భుతంగా అడ్డుకున్నాడు. ఆ తర్వాత లూకాస్ డిగ్నే కొట్టిన లాంగ్ రేంజ్ షాట్ గోల్ పోస్ట్ క్రాస్ బార్‌కు తగలడంతో మరో లక్కీ చాన్స్ చేజారింది. తొలి అర్ధభాగంలో ఫ్రాన్స్ ఏకంగా 13 సార్లు గోల్ కోసం ప్రయత్నించింది. మొరాకో 51 శాతం బంతిని ఆధీనంలో ఉంచుకున్నప్పటికీ టార్గెట్‌పై షాక్ కొట్టలేకపోయింది.
ఇక,తొలి భాగంలో పెనాల్టీ చేజార్చుకున్న ఎంబాపె.. విరామం తర్వాత ఆ తప్పును సరిదిద్దుకున్నాడు. మ్యాచ్ 60వ నిమిషంలో డెసిరే డౌ అందించిన పాస్‌ను అందుకున్న అతను బంతిని గోల్ పోస్ట్ మూలలోకి పంపి తన జట్టుకు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. ఆ తర్వాత ఆరు నిమిషాలకే ప్రస్తుత బాలన్ డిఓర్ విజేత డెంబెలే ఫ్రాన్స్ ఆధిక్యాన్ని డబుల్ చేశాడు. ఈసారి ఎంబాపె అందించిన పాస్‌ను డెంబెలేలో కర్లింగ్ షాట్ కొట్టి బోనోను దాటుకుంటూ గోల్‌గా మలిచాడు. ఈ టోర్నీలో డెంబెలేకు ఇది ఐదో గోల్ కావడం విశేషం. మరోవైపు మొరాకో మ్యాచ్ మొత్తంలో టార్గెట్‌పై ఒకే ఒక్క షాట్ కొట్టగిలిగింది. డిఫెన్స్ గట్టిగా నిలబడటంతో పాటు వరుసగా మూడో క్లీన్ షీట్ నమోదు చేసిన ఫ్రాన్స్ తమ సత్తా చాటుకుంది.
1 ప్రపంచకప్‌లో అతి తక్కువ మ్యాచ్‌లో ్ల 20 గోల్స్ కొట్టిన తొలి ఆటగాడిగా, ఈ ఘనత సాధించిన పిన్న వయస్కుడిగా 27 ఏండ్ల ఎంబాపె రికార్డు సృష్టించాడు. వీటిలో12 గోల్స్ నాకౌట్ దశలోనే వచ్చాయి. వరల్డ్ కప్ అత్యధిక గోల్స్ జాబితాలో మెస్సీ (21) తర్వాత స్థానంలో నిలిచాడు.
8 మెగా టోర్నీలో ఫ్రాన్స్ సెమీఫైనల్ చేరడం ఓవరాల్ గా ఎనిమిదోసారి. ఈ ఘనత సాధించిన మూడో జట్టుగా బ్రెజిల్ రికార్డును సమం చేసింది. జర్మనీ అత్యధికంగా 12 సార్లు సెమీస్ ఆడింది.
క్వార్టర్ ఫైనల్
నార్వే x ఇంగ్లండ్..రేపు తె.జా. 2.30 నుంచి