నగోయా: ఆర్చరీ పోటీల ఆఖరి రోజూ భారత్ పసిడి మోత మోగించింది. 17 ఏండ్ల యువ సంచలనం కుంకుమ్ మొహొద్ ఆసియాడ్ చరిత్రలో మహిళల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో పసిడి పతకం గెలిచిన భారత తొలి ఆర్చర్‌గా రికార్డు నెలకొల్పింది. ఉత్కంఠగా సాగి షూటాఫ్‌కు దారితీసిన ఫైనల్లో ఈ మహారాష్ట్ర టీనేజర్ 6-5తో దక్షిణ కొరియా టాప్ ఆర్చర్ ఒహ్ యెజిన్‌పై అద్భుత విజయం సాధించి 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్ బెర్తు కూడా దక్కించుకుంది. స్వర్ణ పతక పోరుకు చేరే క్రమంలో కుంకుమ్ వరల్డ్ బెస్ట్ ఆర్చర్లను మట్టికరిపించింది. క్వార్టర్ ఫైనల్లో 6-4తో ప్రస్తుత ప్రపంచ చాంపియన్ కంగ్ చేయాంగ్ (దక్షిణ కొరియా)ను, సెమీఫైనల్లో 6-2తో మాజీ ప్రపంచ నంబర్ వన్ జు యింగ్ యీ (చైనా)ను చిత్తు చేసింది.
ఈ ఆసియాడ్‌లో కుంకుమ్‌కు ఇది మూడో పతకం కావడం విశేషం. మహిళల టీమ్ ఈవెంట్లో గోల్డ్, మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో రజతం గెలిచింది. మరో పురుషుల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో భారత ఆటగాడు నీరజ్ చౌహాన్ కాంస్యం గెలిచాడు. కాంస్య పతక పోరులో 6-4తో ఏపీ కుర్రాడు, టాప్ సీడ్ బొమ్మదేవర ధీరజ్‌కు షాకిచ్చాడు. ఆసియాడ్ ఆర్చరీని భారత్ 5 స్వర్ణాలు సహా 9 పతకాలతో అగ్రస్థానంతో ముగించింది.