అవును.. పాఠశాలకు వెళ్లే ప్రాయంలోనే ప్రపంచ చాంపియన్‌గా నిలిచింది ఆ బాలిక. 13 ఏండ్ల వయసులోనే ఒలింపిక్స్‌లో పసిడి పతకాన్ని పట్టి అద్భుతం చేసింది. ఆమే జపాన్‌కు చెందిన యువ సంచలన స్కేటర్ మొమిజి నిషియా. విశ్వక్రీడల్లో తొలిసారి ప్రవేశపెట్టిన మహిళల స్కేట్ బోర్డింగ్‌లో నిషియా స్వర్ణం సాధించింది. ఒలింపిక్స్‌లో పసిడి పట్టిన పిన్నవయస్కురాలైన జపాన్ అథ్లెట్‌గా రికార్డులకెక్కింది.
టోక్యో: ఒలింపిక్స్‌లో అద్భుతం జరిగింది. సొంతగడ్డపై జపాన్‌కు చెందిన 13 ఏండ్ల అమ్మాయి మొమిజి నిషియా చరిత్ర లిఖించింది. విశ్వక్రీడల్లో తొలిసారి ప్రవేశపెట్టిన మహిళల స్ట్రీట్ స్కేట్‌బోర్డింగ్‌లో స్వర్ణం సాధించింది. తద్వారా 13 ఏండ్ల 330 రోజుల వయసులో పసిడి పట్టి.. జపాన్ తరఫున ఈ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కురాలిగా నిషియా రికార్డు నెలకొల్పింది. అలాగే ఒలింపిక్స్ చరిత్రలో స్వర్ణం పట్టిన రెండో చిన్న వయసు అథ్లెట్‌గా నిలిచింది. ఇదే స్కేట్బోర్డింగ్ పోటీలో రజతం సాధించిన బ్రెజిల్ అథ్లెట్ రైసా లీల్ వయసు కూడా 13 ఏండ్ల 203 రోజులు కావడం విశేషం. సోమవారం జరిగిన పోటీలో నిషియా మొత్తంగా 15.26 పాయింట్లు సాధించి టాప్‌లో నిలిచింది. అలాగే లీల్ 14.64 పాయింట్లతో రెండులో నిలువగా నకాయమా (14.49, జపాన్) కాంస్యం దక్కించుకుంది. నకాయమా (16 ఏండ్లు) పేరిట ఉన్న రికార్డును చెరిపేసి జపాన్ తరఫున స్వర్ణం సాధించిన పిన్న వయస్కురాలిగా నిషియా నిలిచింది. అలాగే 1936 ఒలింపిక్స్‌లో యూఎస్ డైవర్ మర్జోరీ గెస్ట్రింగ్ (13 ఏండ్ల 268 రోజులు) తర్వాత వ్యక్తిగత స్వర్ణం సాధించిన చిన్న వయసు అథ్లెట్‌గానూ రికార్డుకెక్కింది.