మనీలా(ఫిలిప్పీన్స్): ఫిలిప్పీన్స్ దిగ్గజం మానీ పకియావో.. బాక్సింగ్‌కు వీడ్కోలు పలికాడు. గత కొన్నేండ్లుగా ప్రపంచ బాక్సింగ్‌లో అనితర సాధ్యమైన విజయాలు సాధించిన పకియావో..రాజకీయాల వైపు మొగ్గుచూపుతూ ఆటకు దూరమవుతున్నట్లు బుధవారం ప్రకటించాడు. ఇన్నేండ్లు తన పదునైన పంచ్‌లతో ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేసిన ఈ 42 ఏండ్ల దిగ్గజ బాక్సర్ రాజకీయ సమరంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. 26 ఏండ్ల సుదీర్ఘ బాక్సింగ్ కెరీర్లో 72 బౌట్లలో బరిలోకి దిగి 62 విజయాలు, 8 ఓటములు, రెండు డ్రాలు నమోదు చేసుకున్నాడు. ఇందులో 39 నాకౌట్ విజయాలు ఉండటం విశేషం. వేర్వేరు శరీర బరువు విభాగాల్లో ఎనిమిది టైటిళ్లు దక్కించుకున్న అరుదైన రికార్డు పకియావో పేరిట ఉంది. దీనికి తోడు కెరీర్లో 12 ప్రపంచ టైటిళ్లను తన ఖాతాలో వేసుకున్నాడు.