వాషింగ్టన్: అమెరికా కుబేరుల మధ్య ఇప్పుడు ఆసక్తికరమైన స్పేస్ వార్ నడుస్తోంది. అంతరిక్షంలో అడుగుపెట్టడానికి వర్జిన్ గెలాక్టిక్ ఓనర్ రిచర్డ్ బ్రాన్సన్, అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ పోటీ పడుతున్నారు. ఈ నెల 20 బెజోస్ స్పేస్‌లోకి వెళ్తున్నారని బ్లూ ఆరిజిన్ ప్రకటించిన కొన్ని గంటల్లోనే.. అంతకు 9 రోజుల ముందే అంటే జులై 11నే బ్రాన్సన్ అంతరిక్షంలో అడుగుపెడుతున్నారని వర్జిన్ గెలాక్టిక్ ప్రకటించింది. అటు స్పేస్ఎక్స్ సీఈవో ఎలోన్ మస్క్ అయితే ఇప్పటికే నాసా ఆస్ట్రోనాట్లను స్పేస్స్టేషన్కు పంపించారు. భూమిపై వివిధ రంగాల్లో ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ ప్రపంచ కుబేరులుగా ఎదిగిన వీళ్లు.. ఇప్పుడు స్పేస్ టూరిజంతో అంతరిక్షంలో నువ్వా నేనా అంటూ పోటీకి సిద్ధమయ్యారు.
అటు బెజోస్, ఇటు బ్రాన్సన్కు అంతరిక్షంపై మోజు ఇప్పటిది కాదు. ఈ ఇద్దరూ ఇప్పటికే తమ సంపదలో పెద్ద మొత్తాన్ని తమ ప్రైవేట్ స్పేస్ కంపెనీలపై ఖర్చు చేశారు. ఐదేళ్ల వయసు నుంచే స్పేస్‌లోకి వెళ్లాలని తాను కలలు కంటున్నట్లు బెజోస్ చాలాసార్లు చెప్పారు. ఆ లక్ష్యంతోనే 2000లో బ్లూ ఆరిజిన్ సంస్థను ప్రారంభించారు. అంతేకాదు ప్రతి ఏటా 100 కోట్ల డాలర్ల విలువైన అమెజాన్ స్టాక్‌ను అమ్మి ఈ బ్లూ ఆరిజిన్‌లో పెట్టుబడి పెడుతున్నట్లు 2017లో బెజోస్ ప్రకటించారు.
మరోవైపు బ్రాన్సన్ కూడా తన స్పేస్ కంపెనీ వర్జిన్ గెలాక్టిక్‌ను 2004లోనే ప్రారంభించారు. ప్రయాణికులను స్పేస్‌లోకి తీసుకెళ్లడానికి అప్పుడే ప్లాన్ చేశారు. అంతేకాదు టికెట్ ధరను 2 లక్షల డాలర్లుగా నిర్ణయించి.. ఇప్పటికే వాటిని విక్రయించడం విశేషం. జస్టిన్ బీబర్, ఏంజెలినా జోలీలాంటి సెలబ్రిటీలు కూడా ఈ టికెట్లు కొన్న వాళ్లలో ఉన్నారు. తన వర్జిన్ గెలాక్టిక్‌లో స్పేస్‌లోకి వెళ్లే తొలి ప్రయాణికుల్లో తాను ఉంటానని ఎప్పటి నుంచో చెబుతూ వస్తున్న బ్రాన్సన్.. ఈ నెల 11న అందుకు ముహూర్తం పెట్టుకున్నారు. 1969లో అపోలో 11 చంద్రుడిపై దిగినప్పటి నుంచీ తనకు ఈ స్పేస్‌పై మోజు మొదలైందని బ్రాన్సన్ చెబుతూ ఉంటారు.
అంతరిక్షంలోకి వెళ్లాలన్న తన కలను నెరవేర్చుకోవడానికి అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్.. తన బ్లూ ఆరిజిన్ సంస్థకు భారీగా నిధులను మళ్లిస్తున్నట్లే బ్రాన్సన్ కూడా వర్జిన్ గెలాక్టిక్‌లో భారీ పెట్టుబడులు పెట్టారు. 2009లోనే ఇందులో 10 కోట్ల డాలర్లను ఇన్వెస్ట్ చేసిన బ్రాన్సన్.. తర్వాత బయటి ఇన్వెస్టర్లను తీసుకొచ్చారు. తనతోపాటు బెజోస్ కూడా భూమిపై మనుషుల మనుగడకు ఉపయోగపడేలా స్పేస్ టెక్నాలజీని అభివృద్ధి చేయాలని అనుకుంటున్నట్లు బ్రాన్సన్ చెప్పారు. స్పేస్ టెక్నాలజీలని అభివృద్ధి చేయడం ఈ భూమికి, భవిష్యత్తు తరాలకు చాలా ముఖ్యమని బెజోస్ అన్నారు.
బ్లూ ఆరిజిన్, వర్జిన్ గెలాక్టిక్ రెండూ పర్యాటకులను భూమి ఉపకక్ష్యలోకి తీసుకెళ్లాలని భావిస్తున్నాయి. భూమి నుంచి 80 నుంచి 100 కిలోమీటర్ల ఎత్తు వరకూ తీసుకెళ్లి.. కొన్ని నిమిషాల పాటు భారరహిత స్థితిలో ఉంచాలని ఈ కంపెనీలు చూస్తున్నాయి. మరోవైపు స్పేస్ఎక్స్ మాత్రం ఇప్పటికే ఆస్ట్రోనాట్లను భూకక్ష్యలోకే తీసుకెళ్లి, తిరిగి భూమిపైకి తీసుకొచ్చింది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు కూడా నాసా ఆస్ట్రోనాట్లను తీసుకెళ్లింది. సెప్టెంబర్‌లో సాధారణ పౌరులతో కూడిన క్రూని అంతరిక్షంలోకి తీసుకెళ్లాలని భావిస్తోంది.
బ్లూ ఆరిజిన్, వర్జిన్ గెలాక్టిక్ కంపెనీలు ప్రయాణికులను అంతరిక్షంలోకి తీసుకెళ్లే ప్రక్రియ వేర్వేరుగా ఉంటుంది. తన న్యూ షెపార్డ్ క్యాప్సూల్‌లో ప్రయాణికులను కూర్చోబెట్టి రాకెట్ ద్వారా బ్లూఆరిజిన్ స్పేస్‌లోకి తీసుకెళ్తుంది. అదే వర్జిన్ గెలాక్టిక్ మాత్రం తన సబ్‌ఆర్బిటల్ ప్లేన్ స్పేస్‌షిప్‌టూ ద్వారా అంతరిక్షంలోకి తీసుకెళ్లనుంది. ఈ స్పేస్షిప్టూని వైట్ నైట్ టూ అనే క్యారియర్ ఎయిర్‌క్రాఫ్ట్ తీసుకెళ్తుంది.
వర్జిన్ గెలాక్టిక్ ఇప్పటికే మూడుసార్లు విజయవంతంగా స్పేస్ ఫ్లైట్ పరీక్షలు నిర్వహించింది. బ్లూ ఆరిజిన్ మాత్రం ఈ నెల 20నే తొలిసారి ప్రయాణికులను అంతరిక్షంలోకి తీసుకెళ్లబోతోంది. వాణిజ్య స్పేస్ ఫ్లైట్స్‌ను నడపడానికి వర్జిన్ గెలాక్టిక్‌కు ఇప్పటికే ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ నుంచి అనుమతి లభించింది. దీంతో 2022లో టికెట్లు కొన్న ప్రయాణికులను స్పేస్‌లోకి తీసుకెళ్లడానికి ఆ సంస్థ సిద్ధమవుతోంది. ఇటు బ్లూ ఆరిజిన్ మాత్రం ఇప్పటి వరకూ వాణిజ్య స్పేస్‌క్రాఫ్ట్‌లు రెగ్యులర్‌గా ఎప్పుడు నడుపుతారన్న విషయం ఇంకా చెప్పలేదు.
ఈ కుబేరులంతా అంతరిక్షంపై ఈ స్థాయిలో దృష్టి సారించడానికి ఓ బలమైన కారణం ఉంది. 2030 వరకల్లా ఈ స్పేస్ టూరిజం విలువ 300 కోట్ల డాలర్లు (సుమారు రూ.23 వేల కోట్లు)కు చేరనుందని అంచనా. భూమి ఉపకక్ష్యలోకి ప్రయాణికులను తీసుకెళ్లే టూరిజం విలువ 2028 కల్లా 280 కోట్ల డాలర్లకు చేరుతుందని ఈ మధ్యే స్పేస్ ఇండస్ట్రీ కన్సల్టెన్సీ నార్తర్న్ స్కై రీసెర్చ్ అంచనా వేసింది. ఆ తర్వాతి పదేళ్లలో ఈ టూరిజం నుంచి వెయ్యి కోట్ల డాలర్ల ఆదాయం సమకూరనుందని వెల్లడించింది.