Moon | న్యూఢిల్లీ: నిత్యం మనకు కనిపించే చంద్రుడు రోజూ కొత్తకొత్తగా కనిపిస్తుంటాడు. అందుకు బోలెడు కారణాలున్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతున్నట్టే… భూమి చుట్టూ చంద్రుడు కూడా దీర్ఘవృత్తాకార కక్ష్యలో పరిభ్రమిస్తున్నాడు. ఈ క్రమంలో చంద్రుడు కొన్నిసార్లు భూమికి చాలా దూరంగా, మరికొన్ని సార్లు చాలా దగ్గరి కక్ష్యలో తిరుగుతాడు. భూమికి సుదూర కక్ష్యలో చంద్రుడు తిరిగినప్పుడు చిన్నగా, భూమికి అతి దగ్గరగా ఉన్నప్పుడు చంద్రుడు చాలా పెద్దగా, ప్రకాశవంతంగా కనిపిస్తాడు. సూర్యుడు, భూమి మధ్య ఉండే చంద్రుడిపై వాటి ప్రభావం చాలా ఉన్నది.
భూమి పై నుంచి చూసినప్పుడు మనకు చంద్రుడి ఓ వైపు మాత్రమే కనిపిస్తుంది. భూమి చుట్టూ తిరిగేందుకు చంద్రుడికి 27 రోజుల 7 గంటల 43 నిమిషాల సమయం పడుతుంది. అందుకే చంద్రుడిపై 14 రోజులు పగలు, మరో 14 రోజులు రాత్రి ఉంటుంది. చంద్రుడు తన దీర్ఘవృత్తాకార కక్ష్యకు సమానమైన వేగంతో తిరుగుతుంటాడు. అందుకే చంద్రుడి మరోవైపు మనకు కనిపించదు. 24 గంటల వ్యవధిలో చంద్రుడు 12-13 డిగ్రీల వరకు తూర్పు వైపు మళ్లినట్టు కనిపిస్తాడు. భూ ఉత్తరార్ధ గోళం నుంచి చూసినప్పుడు చంద్రుడు కుడి వైపు పెరుగుతున్నట్టు కనిపించి క్రమంగా పౌర్ణమిగా మారుతుంది. అదే సమయంలో దక్షిణార్ధ గోళం నుంచి చూస్తే ఎడమ వైపు పెరుగుతూ కుడి వైపు క్షీణిస్తున్నట్టు కనిపిస్తాడు. ఈ క్రమంలో చంద్రుడి పరిమాణంలో మార్పులు రాకపోయినా, భూమిపై నుంచి మనం చూసే కోణం కారణంగా అలా రోజూ వేర్వేరు పరిమాణంలో కనిపిస్తాడు. భూమి తిరిగే క్రమాన్ని బట్టి చంద్రుడు మనకు కనిపించే పరిమాణంలో మార్పులు చోటుచేసుకుంటాయి. అందుకే రోజూ చంద్రుడు సరికొత్తగా కనిపిస్తుంటాడు.
ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 స్పేస్‌క్రాఫ్ట్ వడివడిగా జాబిల్లి వైపు అడుగులు వేస్తున్నది. ఈ స్పేస్‌క్రాఫ్ట్‌ను పోలెండ్‌కు చెందిన రోటజ్ టెలిస్కోప్ చిత్రీకరించింది. చంద్రుడి వైపు పరుగులు పెడుతున్న చంద్రయాన్ అందులో ఓ చిన్న చుక్క మాదిరిగా కనిపించింది.