Instagram : సోషల్ మీడియాలో ఎక్కువ మంది వాడేది ఇన్స్టాగ్రామ్. యూజర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్స్, కొత్త ఫీచర్స్ తీసుకొస్తూనే ఉంటుంది ఇన్‌స్టా. తాజాగా, ఇన్స్టంట్స్ పేరుతో మరో క్రేజీ ఫీచర్‌ను తీసుకొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఈ ఫీచర్ ఈ రోజు నుంచే అందుబాటులోకి వచ్చింది. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు తమ ఫాలోవర్లు, ఫ్రెండ్స్‌కు ప్రత్యేకంగా ఫొటోలు పంపుకోవచ్చు. అవి కూడా అన్ ఎడిటెడ్, అన్ ఫిల్టర్డ్, రా ఫొటోలను షేర్ చేయొచ్చు.
ఇందులో ప్రత్యేకత ఏముందీ అనుకుంటున్నారా.. ఈ ఫొటోలను రిసీవ్ చేసుకున్న వారు వాటిని ఒక్కసారి మాత్రమే చూడగలుగుతారు. ఇవి డిసప్పియరింగ్ ఫొటోలు. ఒకసారి ఆ ఫొటోలు చూసిన తర్వాత మళ్లీ అవి వారికి కనిపించవు. ఈ ఫొటోలు 24 గంటలు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఇన్స్టంట్స్ కింద పంపిన ఫొటోలు 24 గంటల తర్వాత కనిపించవు. ఈ ఫీచర్ ఇటీవలి కాలంలో కొద్ది మంది యూజర్లతో ఇన్స్టాగ్రామ్ పరీక్షించింది. అనంతరం నేడు గ్లోబల్‌గా అందుబాటులోకి తెచ్చింది. ఇదే తరహా ఫీచర్ స్నాప్‌చాట్‌లో కూడా అందుబాటులో ఉంది. కొంతకాలంగా ఇన్స్టాగ్రామ్.. స్నాప్‌చాట్, లాకెట్, బీరియల్ వంటి ప్లాట్‌ఫామ్స్‌లో వచ్చిన ఫీచర్లను ఇక్కడా తీసుకొస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇన్స్టంట్స్ ఫీచర్ ద్వారా యూజర్లు యాప్ ఓపెన్ చేసి, అందులోంచి కెమెరా ద్వారా ఫొటోలు తీయొచ్చు. అయితే, ఈ ఫొటోలను ఎడిట్ చేసే అవకాశం లేదు. అలాగే, నేరుగా షేర్ చేయొచ్చు. ఇక, ఈ ఫొటోల్ని ఇన్స్టాగ్రామ్ ఏడాదిపాటు ఆర్కైవ్స్‌లో రహస్యంగా స్టోర్ చేస్తుంది. ఏడాదిపాటు ఈ ఫొటోలు అందుబాటులో ఉంటాయి. ఒకవేళ యూజర్లు ఏదైనా ఫొటోను అనుకోకుండా షేర్ చేస్తే వెంటనే అన్ డూ ఆప్షన్ ఎంచుకోవచ్చు. దీని ద్వారా షేర్ చేసిన ఆ ఫొటోలు వెంటనే డిలీట్ అవుతాయి. ఎవరికీ కనిపించవు. అలాగే, ఎవరైనా ఇలాంటి అన్ఫిల్టర్డ్ ఫొటోలు షేర్ చేస్తే తమకు రాకూడదని కోరుకుంటే వాటిని అడ్డుకునేందుకు పాజ్ ఆప్షన్ కూడా ఎంచుకోవచ్చు. బ్లాక్, మ్యూట్ కూడా చేసుకోవచ్చు.