వాషింగ్టన్ : జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ తీసిన చిత్రాలను అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ఫొటోలను సోమవారం ఆవిష్కరించారు. వైట్ హౌస్లో జరిగిన ప్రివ్యూ ఈవెంట్లో నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్ సమక్షంలో జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ మొదటి చిత్రాన్ని విడుదల చేశారు. వెబ్ స్పేస్ టెలిస్కోప్ మొదటి చిత్రం సైన్స్, టెక్నాలజీకి సంబంధించి చారిత్రాత్మక క్షణాలను సూచిస్తుందని బైడెన్ పేర్కొన్నారు. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తీసిన ఫొటోలను నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, కెనడియన్ స్పేస్ ఏజెన్సీలు సంయుక్తంగా మంగళవారం విడుదల చేయనున్నాయి.
ఈ నేపథ్యంలోనే అమెరికా అధ్యక్ష, ఉపాధ్యక్షులు ఓ చిత్రాన్ని ప్రివ్యూ చూశారు. ఈ చిత్రాన్ని విడుదల చేసిన బైడెన్ ఇది చారిత్రాత్మక రోజన్నారు. అమెరికాతో పాటు సమస్త మానవాళికి చారిత్రక క్షణమన్నారు. నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్ మాట్లాడుతూ వెబ్ టెలిస్కోప్ నుంచి విడుదలైన తొలి చిత్రం ఇదే అని తెలిపారు. ఇప్పుడు మనం 13 బిలియన్ సంవత్సరాలు వెనక్కి వెళ్లి చూస్తున్నామని పేర్కొన్నారు. ఈ చిత్రంలో మీరు చూస్తున్న కాంతి 1300 కోట్ల సంవత్సరాలుగా ప్రయాణిస్తూనే ఉందని వివరించారు. ఈ టెలిస్కోప్ మరెన్నో రహస్యాలను ఛేదించాల్సి ఉన్నదని పేర్కొన్నారు.
వెబ్ టెలిస్కోప్ తీసిన మిగతా చిత్రాలను మంగళవారం విడుదల చేయనున్నట్లు నెల్సన్ పేర్కొన్నారు. నాసా వెబ్సైట్ ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు పేర్కొన్నారు. కారినా నెబ్యులా, WASP-96b, సదరన్ రింగ్ నెబ్యులా, స్టీఫన్స్ క్వింటెట్కు సంబంధించిన ఫొటోలను విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. కారినా నెబ్యులా భూమికి 7600 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నది. 2014లో గుర్తించిన WASP-96b భూమికి 1,150 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ఇది గురుగ్రహంలో సగం ద్రవ్యరాశిని కలిగి ఉంటుందని నాసా తెలిపింది.