నేటితరం వధూవరులు తమ వివాహ రిసెప్షన్‌ను మరింత స్పెషల్‌గా జరుపుకొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. పెండ్లయిన మరుసటి రోజు రిసెప్షన్‌ను ఏర్పాటు చేసుకుంటూ ఆటపాటలతో సందడి చేస్తున్నారు. నూతన దంపతులు ప్రత్యేకంగా ముస్తాబై వస్తుండగా.. యువతీయువకులు వారి ముందు స్పెషల్ థీమ్‌తో స్టెప్పులు వేస్తూ వేదికపైకి స్వాగతం పలుకుతుంటారు. అనంతరం వివిధ పాటలకు పలువురు డ్యాన్స్‌లు చేస్తూ వధూవరులతోనూ స్టెప్పులు వేపిస్తారు. ఆ రోజంతా విందు, వినోదాలతో సరదాగా గడుపుతూ మధుర జ్ఞాపకాలను పదిలం చేసుకుంటారు. ఇదీ మధ్యతరగతి, ఉన్నత వర్గాల్లో ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్.
పెద్దఅంబర్‌పేట, జూన్ 24: పెండ్లయిన మరుసటి రోజు రిసెప్షన్. చుట్టాలంతా వచ్చారు. ఇంకొంతమంది వస్తూనే ఉన్నారు.. అప్పటి వరకు ఫంక్షన్ హాల్ నిశ్శబ్దంగా ఉన్నది. నూతన వధూవరుల రాకతో ఆ ప్రాంతం సంగీతంతో దద్దరిల్లింది. వెనుక కొత్త దంపతులు ఒక్కో అడుగు వేస్తుండగా.. వారి ముందు స్పెషల్ థీమ్‌తో స్టెప్పులు వేశారు యువతీ యువకులు. నృత్యాలు చేస్తూనే వేదిక వరకు స్వాగతం పలికారు. అంతేకాదు, స్టేజీపై మరో ప్రత్యేక పాటకు అడుగులు వేశారు. ఓ వైపు వరుడు, మరోవైపు వధువు సైతం డ్యాన్సులు చేసేశారు. వారి చుట్టూ ఉన్న సమీప బంధువులు సైతం అవే స్టెప్పులను జతచేస్తూ సందడి చేశారు.. ఇదీ ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్. మధ్య తరగతి, ఆపై ఉన్నత వర్గాలకు చెందిన పిల్లల విందు వేడుకల్లో కనిపిస్తున్న నృత్యాలివి.
పెండ్లి రోజు సంతోషంగా ఆడేందుకు ఎవరైనా బరాత్ పెడుతుంటారు. అక్కడ వధువు, వరుడి స్నేహితులు, బంధువులు కలిసి డ్యాన్సులు చేస్తుంటారు. ఫినిషింగ్ టచ్‌గా నూతన వధూవరులు సైతం స్టెప్పులేస్తారు. ఇదంతా సాధారణమే. ఇక పెండ్లి తర్వాత రోజు రిసెప్షన్లో డీజేలు ఏర్పాటు చేస్తారు. అక్కడ కూడా వధూవరుల స్నేహితులు, దగ్గరి బంధువులు సంతోషంగా ఆడుతుంటారు. చివరకు కొత్త దంపతులూ ఓ స్టెప్పేసేస్తున్నారు. ఇది కూడా సాధారణంగా మారిపోయింది. ఆర్కేస్ట్రా పేరుతో దాండియా పాటలకు కాళ్లు కదపడమూ సర్వసాధారణమైపోయింది. ఇప్పుడు కొత్తగా రిసెప్షన్ డ్యానులు ట్రెండీగా మారాయి. పెండ్లయిన మరుసటి రోజు వరుడు ఏర్పాటుచేసే విందు (రిసెప్షన్)లో స్టేజీపై దగ్గర బంధువులు స్పెషల్‌గా డ్యాన్సులను పెర్ఫామ్ చేస్తున్నారు. ఖర్చయినా, కష్టమనిపించినా కనీసం రెండు మూడు పాటలకు నాలుగు స్టెప్పులు నేర్చుకుంటున్నారు. చుట్టాలను ఆకట్టుకుంటున్నారు. వధూవరులకు కొత్త అనుభూతి పంచుతున్నారు. ఇక ఫొటోలు, వీడియోల రూపంలో తీపి జ్ఞాపకాలను పది కాలాలపాటు పదిలం చేసుకుంటున్నారు.
రిసెప్షన్లలో స్టేజీపై డ్యాన్సులు చేసేందుకు చాలామంది ఆసక్తి చూపుతున్నారు. ప్రధానంగా వరుడి తోబుట్టువులు, వరుసకు మరదళ్లు, కొడుకులు, బావ మరుదులు ఇలా దగ్గర బంధువులు స్టేజీపై నృత్యాలు చేస్తున్నారు. ఇందుకోసం పెండ్లికి వారం ముందే పక్కాగా ప్లాన్ చేస్తున్నారు. పాటల ఎంపిక మొదలు.. వేసే స్టెప్పుల వరకు అన్నీ కొత్తగా ఉండేలా చూస్తున్నారు. డ్యాన్సు స్టెప్పులు నేర్చుకునేందుకు ప్రత్యేకంగా మాస్టర్‌ను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఫన్నీ సన్నివేశాలను జ్ఞాపకాలుగా మలుచుకుంటున్నారు. చిన్నారులతో ప్రత్యేకంగా పాటలకు డ్యాన్సులు చేపిస్తుండగా.. ఎక్కువశాతం యువతీ, యువకులే ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఇది వచ్చే చుట్టాలను సైతం అమితంగా ఆకట్టుకుంటున్నది. దీనిపైనే చర్చ నడుస్తున్నది.