బంజారాహిల్స్,డిసెంబర్ 3 : చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయడం ద్వారా ఎంతోమంది ప్రాణాలు కాపాడుతున్న మెగాస్టార్ చిరంజీవి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారని హైదరాబాద్‌లో బ్రిటిష్ డిప్యుటీ హైకమిషనర్ గ్యారెత్ విన్ వోవెన్ అన్నారు. ఇటీవల హీరో చిరంజీవికి ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ అవార్డు వచ్చిన సందర్భంగా శనివారం గ్యారెత్ విన్ వోవెన్ జూబ్లీహిల్స్‌లోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌కు వచ్చి ఆయనను అభినందించారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో 25 సార్లకు పైగా రక్తదానం చేసిన వారికి గుర్తింపు కార్డులతో పాటు బీమా కార్డులను గ్యారెత్ విన్ వోవెన్ చేతులమీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..వేలాదిమంది రక్తదాతలలో స్ఫూర్తిని కలిగించడం ద్వారా నిత్యం వేలాదిమంది ప్రాణాలు కాపాడుతున్న చిరంజీవి సేవలు ఎంతో గొప్పవన్నారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ సీఈవో డా.మాధవి పాల్గొన్నారు.