క్రికెట్.. క్రికెట్.. క్రికెట్.. దాదాపుగా ఈ పదం తెలియనివారు ఎవరూ ఉండరు. ఈ ఆట తెలియని వారు కూడా తక్కువే. చాలామంది ఏదో ఒక వయసులో క్రికెట్ ఆడే ఉంటారు. క్రికెట్ అనగానే.. కొంచెం పెద్ద పట్టణాల్లో యువకులు గ్రౌండ్ వెతుక్కుంటూ వెళ్లిపోతారు. కొన్నిచోట్ల ముందుగానే బుక్ చేసుకుని ఆటలు ఆడేందుకు ఇష్టపడుతున్నారు. ఒక్కో జట్టుకు 11 మంది, బ్యాట్లు, బాల్స్, వికెట్లు, గ్లౌజ్‌లు ఇలా అన్నీ ఉన్న బ్యాగులు భుజాన వేసుకుని మైదానాల వైపు పరుగులు తీస్తారు.
ఇక గ్రామాల్లో మాత్రం బ్యాట్లు, బాల్స్ ఉంటే చాలు చిన్న గల్లీ అయినా క్రికెట్ ఆడేస్తుంటారు. ప్రస్తుతం యువత ఉన్నత చదువులు, ఉద్యోగాలతో వారంలో ఐదు రోజులు బిజీగా గడిపినా వీకెండ్లో క్రీడలకు ప్రాధాన్యం ఇస్తున్నది. శారీరక శ్రమతోపాటు మానసికోల్లాసం లభిస్తుండటంతో ఆసక్తి చూపుతున్నది. యువత ఆసక్తికి అనుగుణంగా క్రికెట్ ప్రేమికుల కోసం బాక్స్ క్రికెట్ స్టేడియాలు వెలుస్తున్నాయి. చిన్నపాటి స్థలాలను సైతం నిర్వాహకులు గ్రౌండ్లుగా సిద్ధం చేసేస్తున్నారు. ఇటీవల బాక్స్ క్రికెట్‌కు క్రేజీ పెరిగింది.
గ్రౌండ్లో ఒక్కో మ్యాచ్ ఆడేందుకు కనీసం రెండు గంటలు పడుతుంది. బాక్స్ క్రికెట్లో మాత్రం ఒక్కో గంటకు రేటు నిర్ణయిస్తారు. గంటకు సాధారణంగా రూ.700 వరకు తీసుకుంటున్నట్లు ఓ బాక్స్ క్రికెట్ నిర్వాహకుడు తెలిపాడు. ఒక్కో జట్టులో ఏడుగురు చొప్పున 14 మంది ఆడితేనే ఆటలో మజా ఉంటుందని చెప్తున్నాడు. తక్కువ మంది ఆడితే పెద్దగా ఆసక్తి ఉండదంటున్నాడు. రద్దీని బట్టి గంటకు రూ.600 నుంచి 800 వరకు కూడా నిర్వాహకులు వసూలు చేస్తున్నారు.
వారాంతాల్లోని సాయంత్రం సమయం ఈ బాక్స్ క్రికెట్లు బిజీగా మారిపోతున్నాయి. కొందరు స్నేహితులతో కలిసి ఆడేందుకు వస్తుండగా.. మరికొందరు కుటుంబసభ్యులే వచ్చి ఉత్సాహంగా ఆడుతున్నారు. ఒక్కో బాక్స్ క్రికెట్ కోసం రూ.12 లక్షల నుంచి 20 లక్షల వరకు ఖర్చు పెడుతున్నారు. అన్ని వసతులు కల్పిస్తున్నారు. సదుపాయాలు బాగుంటుండంతో క్రీడాకారులు సైతం అక్కడ సమయం వెచ్చించేందుకు ఆసక్తి చూపుతున్నారు.
బాక్స్ క్రికెట్లో చుట్టూ నెట్ ఉంటుంది. బంతి బయటకు వెళ్లేందుకు ఏ అవకాశం ఉండదు. పైన కూడా నెట్‌తో కవర్ చేస్తారు. ఆడేందుకు వెళ్లేవారికి బాక్స్ క్రికెట్ నిర్వాహకులే బ్యాట్, బాల్, వికెట్లు, గ్లౌజ్‌లు తదితర అన్ని క్రీడా పరికరాలు అందిస్తారు. అందుకు తగ్గట్టు అన్ని వసతులు కల్పిస్తారు. చాలా చోట్ల బాక్స్ క్రికెట్లు బయట వెలుతురులోనే ఉంటాయి. అంటే ఇండోర్ స్టేడియం తరహా ఉండవు. కొన్నిచోట్ల మాత్రం అలా కూడా ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుత బిజీ షెడ్యూళ్లలో క్రీడలు ఆడేందుకు యువత ప్రత్యేకంగా సమయం కేటాయించేందుకు ఆసక్తి చూపుతున్నది.
అందుకే వారాంతాల్లో ఈ బాక్స్ క్రికెట్‌కు మంచి గిరాకీ ఉంటున్నది. ఆడిన గంట లేదా రెండు గంటలు బిందాస్‌గా ఆడుతున్నారు. సాయంత్రం వేళ మరీ స్పెషల్‌గా ఉంటున్నది. లైట్ల వెలుతురులో ఆడటం అంటే అందరికీ ఆసక్తే. అందుకే సాయంత్రం అదీ.. లైట్ల వెలుతురులో ఆడేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. ప్రధానంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఇందుకు అమితాసక్తి కనబరుస్తున్నారు. ఆడిన గంట లేదా రెండు గంటల్లోనే వారానికి సరిపడే ఆసక్తిని తీర్చుకుటున్నారు. ప్రతి బంతిని బౌండ్రీ కొట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు.
బ్యాట్, బాల్ తీసుకెళ్లాల్సిన పనిలేదు.. వికెట్లు చేతిలో పట్టుకుని పరుగులు తీయాల్సిన అవసరమూ లేదు.. గ్రౌండ్ గుంతలుగా ఉందేమో అని దిగులు చెందాల్సిన పనేలేదు. అయ్యో చీకటి పడితే బాల్ కనిపించదేమో అని ఆందోళనకు ఆస్కారమే లేదు.. మరి ఇదేంటి? ఏదీ తీసుకెళ్లకుండానే ఎలా ఆడుతామని అనుకుంటున్నారా? అవును నిజమే. ఇప్పుడు మనం ఏ బ్యాటూ తీసుకెళ్లాల్సిన పనిలేదు. ముందుగా బుక్ చేసుకుంటే చాలు.. అన్నీ అక్కడే అందుబాటులో ఉంటాయి.. అదే బాక్స్ క్రికెట్. ఇటీవల యువతలో ఎక్కువగా వినిపిస్తున్న పదం ఇది. బాక్స్ క్రికెట్‌కు రోజురోజుకూ క్రేజీ పెరుగుతున్నది.
– పెద్దఅంబర్‌పేట, డిసెంబర్ 7