అమ్మంటే మెరిసే మేఘం.. నాన్నంటే నీలాకాశం.. అన్నారో సినీకవి..
నాన్న గొప్పతనాన్ని వర్ణిస్తూ ఎన్నెన్నో కవితలు.. ఎన్నెన్నో పాటలు.. మరెన్నో కథలు..
అప్పటికీ.. ఇప్పటికీ.. ఎప్పటికీ.. నాన్నే చాలామందికి రోల్ మాడల్..
నేటి నాన్న ఆఫీసు పనుల్లో.. వ్యాపారంలో ఎంత బిజీగా ఉన్నా..
పిల్లల కోసం ప్రత్యేకంగా సమయాన్ని కేటాయిస్తున్నాడు..
వారికి హితుడిగా.. స్నేహితుడిగా మారిపోతున్నాడు..
తన అనుభవాలను పాఠాలుగా చెబుతూ గెలుపు వైపు బాటలు వేస్తున్నాడు…
ఓడిపోతే ధైర్యం చెబుతున్నాడు.. గెలిస్తే భుజం తడుతున్నాడు..
ఇప్పుడు పిల్లలూ తమ తండ్రికి కృతజ్ఞత చెప్పడానికి ప్రతి సందర్భాన్ని ఉపయోగించుకుంటున్నారు..
అటువంటిదే ఫాదర్స్‌డే..
తండ్రి ఇష్టాలకు తగ్గినట్టు బహుమతులివ్వడం..
కేకులు కట్‌చేసి సెలబ్రేట్ చేసుకోవడం..
ఇప్పుడు సాధారణమైపోయింది..
ఉత్సవంగా జరుపుకోవడానికి ఒకరోజు ఉన్నా..
ప్రతిరోజూ నాన్నదే..
నడక నేర్చిన కొత్తలో నాన్న షూలలో కాళ్లు పెట్టి ఉత్సాహపడే పిల్లాడి నుంచి..
వయసు పెరిగేకొద్ది జీవితంలో, చదువులో, ఉద్యోగంలో ఎదురైన ప్రతి సవాలునూ తండ్రితో పంచుకుంటూ.. పరిష్కరించుకుంటున్న వారందరికీ..
నాన్నే నేస్తం.. నాన్నే సమస్తం..
-పెద్దఅంబర్‌పేట, జూన్ 17
పెద్దఅంబర్‌పేట, జూన్ 17: గంభీర్యంగా కనిపించే నాన్నంటే ఎవరికైనా భయమే. కానీ, అతడికి అంతకు మించిన ప్రేమ కూ డా ఉంటుంది. ఒకప్పుడు కుటుంబ సభ్యుల అవసరాలను తీర్చ డం, వారికి ఇబ్బందుల్లేకుండా చూసుకోవడమే పనిగా ఉండేది. కానీ, నేటితరం నాన్నలు కుటుంబ సభ్యుల అవసరాలను తీర్చడమేకాదు, పిల్లలకు మరింత ప్రాధాన్యం ఇస్తున్నారు. వారితో స్నేహంగా ఉంటున్నారు. పిల్లల ఇబ్బందులను తెలుసుకుంటూ.. వారి సమస్యలను తీర్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏది ఒప్పు, ఏది తప్పో పిల్లలకు వివరిస్తున్నారు. పిల్లలకు ప్రత్యేకంగా సమయాన్ని కేటాయిస్తున్నారు. వారితో ఆడిపాడుతూ సంతోషాన్ని పంచుకుంటున్నారు.పిల్లల్లోనే ఆనందాన్ని చూసుకుంటూ కష్టా న్ని మరిచిపోతున్నారు. ఒకప్పుడు తమ ఇబ్బందులను కేవలం స్నేహితులతోనే పంచుకునే పిల్లలు.. ఇప్పుడు మాత్రం నాన్నల తో పంచుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు.
‘నాన్న నాకు తోటి స్నేహితులతో ఇబ్బందిగా ఉన్నది, కాలేజీలో సమస్య ఎదురవుతుంది. చదువుపై మరింత శ్రద్ధ పెట్టలేకపోతున్నా’ ఇలా ఎన్నో సందేహాలను నాన్నలతోనే షేర్ చేసుకుంటున్నారు. పిల్లల ఇబ్బందులను తీర్చేందుకు తండ్రులు శ్రద్ధ పెడుతున్నారు. వారికి ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. నేనున్నాననే భరోసా ఇస్తున్నారు. అందుకే నేటి తండ్రు లు, పిల్లలు స్నేహితులుగా మారిపోయారు. కేవలం ఆదేశించే స్థానంలో ఉన్న నాన్న, గంభీర్యంగా మాట్లాడే నాన్న ఇప్పుడు స్నేహితుడిగా మారిపోయాడు. అందుకే నాన్నే నా నేస్తం అంటున్నారు నేటితరం పిల్లలు. మరోవైపు, పిల్లల ఇష్టాలను తీర్చేందు కు తండ్రులు ప్రయత్నిస్తున్నారు. వారితో స్నేహంగా మెలుగు తూ.. వారికి మంచిబుద్ధులు నేర్పుతున్నారు. తాను బాల్యం, యవ్వనంలో ఎదుర్కొన్న సమస్యలు.. వాటిని ఎలా అధిగమించానో చెప్తూ.. పిల్లల్లో ఆత్మైస్థెర్యాన్ని నింపుతున్నారు. కష్టాల్లో ముందుకు నడిచే ధైర్యాన్ని ఇస్తున్నారు. సమస్యలు ఎదురైనప్పుడు ఎలా ముందుకెళ్లాలో సూచనలు చేస్తున్నారు.
ఇంటింటా ఫాదర్స్ డే సెలబ్రేషన్స్
ఫాదర్స్ డే. ఒకప్పుడు ఏదో ఉన్నత వర్గంలోని కుటుంబాల్లో మాత్రమే వినిపించే పదం. కానీ, ఇప్పుడది మధ్యతరగతి కుటుంబాలకు కూడా చేరింది. నాన్నను ప్రత్యేకంగా చూసుకునేందుకు ఫాదర్స్ డేను ఓ సందర్భంగా పిల్లలు వినియోగించుకుంటున్నారు. నాన్న కష్టాన్ని గుర్తు చేసుకుంటున్నారు. నాన్న ఇష్టాలను తీర్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. నాన్నకు ఇష్టమైన వస్తువులను కానుకగా ఇచ్చేందుకు ఇష్టపడుతున్నారు. ఫాదర్స్ డే రోజంతా సంతోషంగా గడిపేందుకు ప్లాన్ చేస్తున్నారు. నాన్న జేబులో చెయ్యి పెట్టకుండా, తాము కష్టపడి సంపాదించిన డబ్బుతో ఆ రోజు నాన్నను సంతోషపెట్టేందుకు ఉద్యోగాలు చేస్తున్న పిల్లలు ప్లాన్ చేసుకుంటున్నారు. అందులో భాగంగానే అవుటింగ్‌లు ప్లాన్ చేస్తున్నారు.
కొత్తగా కానుకలు
నాన్నకు ఇష్టమైన వస్తువులను బహుమతులుగా ఇచ్చేందుకు పిల్లలు ప్లాన్ చేస్తున్నారు. కొందరు నాన్న చిన్ననాటి ఫొటోలను తీపి జ్ఞాపకాలుగా మలిచి కానుకగా ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు, నేటితరం పిల్లలు, తండ్రి ఒకే రకం డ్రెస్సు వేసుకునేలా తల్లులు ప్లాన్ చేస్తున్నారు. చిన్న పిల్లలున్న వారు.. పిల్లలతోనే డ్రాయింగ్లు వేయిస్తూ నాన్నలకు బహుమతిగా ఇప్పిస్తున్నారు. కేక్‌లు కట్ చేస్తూనే గ్రూప్ ఫొటోలు దిగుతూ సంతోషాలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. అం తా కలిసి చిలిపిగా దిగిన ఫొటోలను ఫ్రేమ్‌లుగా చేయిస్తున్నారు. నాన్న చిన్ననాటి ఫొటోలు, ఆయనకు ఇష్టమైన జ్ఞాపకాలను మరింత పదిల పరుస్తున్నారు.
నిన్నటి నాన్న..
ఇంటి అవసరాలను తీర్చేందుకు కష్టపడి పనిచేస్తాడు. పొద్దున ఇంటి నుంచి వెళ్తే తిరిగి పిల్లలు నిద్రపోయాక తిరిగి వస్తాడు. ఏది కావాలన్నా.. తాను ఇబ్బందిపడ్డా.. పిల్లల ఇష్టాలను తీర్చేందుకు ప్రయత్నించేవాడు..
నేటి నాన్న..
ఇంటి అవసరాలను తీర్చేందుకు కష్టపడి పనిచేస్తున్నాడు. ఉద్యోగంలో బిజీగా ఉన్నా పిల్లల కోసం ప్రత్యేకంగా సమయాన్ని కేటాయిస్తున్నాడు. తాను ఇబ్బంది పడ్డా పిల్లల ఇష్టాలను తీరుస్తూనే.. వారితో స్నేహంగా ఉంటున్నాడు. నాన్నే నేస్తం అనేలా మారాడు.