క్షణకాల సుఖం కోసం జీవితాన్ని, సంసారాన్ని ఆగం చేసుకుంటున్న వారికి పెద్దలు చేసిన హెచ్చరిక ఇది. నీడనిచ్చే చెట్లకు, తాడిచెట్టుకు చాలా తేడా ఉంటుంది. నీడకోసం ఎవరైనా తాడిచెట్టును ఆశ్రయిస్తున్నారంటే అతను అవివేకి అని అర్థం చేసుకోవాలి. పైగా నీడనిచ్చే చెట్లను వదిలేసి, తాడిచెట్టు నీడకోసం వెంపర్లాడితే.. అపనిందలు మోయాల్సి వస్తుంది. ‘తాటికింద కూర్చొని పాలు తాగినా.. కల్లు తాగుతుండనే’ అనుకుంటారు. ఇక తగులుకున్నది అంటే.. పరాయి స్త్రీ. అలాంటివారు తమ అవసరాల కోసం వాడుకుంటారే కానీ, జీవితాంతం తోడురారు. ఇంట్లో భార్యకు, బయటి వారకాంతలకూ చాలా తేడా ఉంటుంది. క్షణకాలం సుఖం కోసం వారి వెంటవెళ్తే.. ఓ కుటుంబాన్ని, జీవితాన్ని, పిల్లల్ని దూరం చేసుకున్న వారవుతారు. అందుకే క్షణకాలపు సుఖాల కోసం నిండు జీవితాలను ఆగం చేసుకోవద్దని
చెబుతారు పెద్దలు.
గుడ్డెద్దు చేలో పడినట్లు
ఏదైనా పనికి ఒప్పుకొన్నప్పుడు కానీ, కొత్త కార్యం మొదలుపెట్టినప్పుడు కానీ.. దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలని సలహా ఇస్తారు పెద్దలు. కనీస అవగాహన కూడా లేకుండా రంగంలోకి దిగితే తీవ్ర నష్టాల పాలవుతామని, నిందలు మోయాల్సి వస్తుందని హెచ్చరించే సామెత ఇది. కన్నూమిన్నూ కానకుండా మహా దూకుడుగా వ్యవహరిస్తే మన పతనాన్ని మనం కోరుకున్నట్టే. గుడ్డెద్దు చేలో పడితే విధ్వంసమే. దారీతెన్నూ తెలియక మొత్తం పైరును నాశనం చేసేస్తుంది. గుడ్డెద్దు తినేది తక్కువే అయినా, పంట మొక్కలను ఛిన్నాభిన్నం చేసి నష్టపరిచేదే ఎక్కువ. తీరూతెన్నూ లేక అటూ ఇటూ తిరిగేవాళ్లను ఉదహరిస్తూ కూడా ఈ సామెత చెబుతారు.
అంతా.. పొరుగూరి సేద్యమే
‘పొద్దంతా కష్టపడినా.. ఆ శ్రమంతా పొరుగూరి సేద్యం కిందనే జమైతున్నది. ఉన్న ఊర్ల ఏదైనా కొలువు జూసుకో బేటా’ అంటుంటారు తల్లిదండ్రులు. ఉన్న ఊరిని వదిలి ఎక్కడో పనిచేసి, మళ్లీ రాత్రికి ఇల్లు చేరే ఏ పనైనా పొరుగూరి సేద్యమే. ఎంత శ్రమపడినా తగిన ఫలితం రాని సందర్భాల్లో ఈ పలుకుబడిని ఉపయోగిస్తారు. పొరుగూరి సేద్యం అంటే, ఉన్న ఊళ్లో పొలం లేకపోవడంతో.. సాగు కోసం పొరుగూరి పొలాన్ని కౌలుకు తీసుకొని వ్యవసాయం చెయ్యడం. ఏడ్వ గలిగితేనే ఎవుసం చెయ్యాలి.. అన్నారు జానపదులు. ఎందుకంటే వ్యవసాయంలో చీడపీడలతో పాటు కష్టనష్టాలూ ఉంటాయి. బాధలు భరించాలి, ఓపికతో పనిచేయాలి. రుతుపవనాలతో జూదంలాంటి సేద్యాన్ని ఉన్న ఊళ్లో చేయడమే సాహసం అనుకుంటే.. పొరుగూరిలో కౌలుకు చేయడం పెద్ద సవాలు. అందుకే ‘పొరుగూరి సేద్యం తనను తినేదే కానీ, తాను తినేది కాదు’ అన్నారు జానపదులు. ఉద్యోగమైనా, వ్యాపారమైనా, ఎవుసమైనా ఎక్కడుంటే అక్కడే చేయడం ఉత్తమం. ఉన్నచోట కాకుండా, ఇంకెక్కడో చేస్తానంటే కుదరదని చెప్పడం. ఈ సూక్ష్మాన్ని అర్థంచేసుకుంటే చాలు.
అర్థ వివరణ
1. తంబేసుడు = తిష్ఠవేయడం (సుట్టపు చూపుకొచ్చి ఇక్కడే తంబేసిండు. సుట్టమై వచ్చి.. దయ్యమై పట్టిండంటే ఇదేనేమో అక్కా!)
2. ఇల్లుటం = ఇల్లరికం, ఇల్లిరికం (మాకెలాగూ కొడుకులు లేరు. మీవోణ్ని ఇల్లుటం ఇస్తానంటేనే ఈ పెండ్లి జేస్తం. లేకుంటే.. ఊకుంటం)
3. ఉప్పుకాక = ఉప్పు సురుకు (అయ్యో.. బిడ్డా ఏడ ఆడితివిరా. కాలినిండా ముండ్లే. అచ్చికూసో ఉప్పుకాక పడ్తా)
4. ఎగ్గుల పెట్టుడు = బనాయించడం/హేళన చేయడం/ఏడిపించడం/చిన్నబుచ్చడం (ఏందిరా సూరిగా మా చెల్లెకు ఎగ్గులు పెడుతున్నవ్? పొద్దస్తమానం అట్ల సతాయిస్తే
నీకెట్ల ఇచ్చేది మా బిడ్డను?)
5. తేరుల్లా/తేరుకుల్లా = తీరిపోయింది (చిన్నప్పుడు దోస్తుల దగ్గర పైసలు తీసుకొని మళ్లా ఇచ్చి తేరుల్లా/తేరుకుల్లా అనేది)
బొమ్మలు: మృత్యుంజయ్
…?డప్పు రవి