9, 10, 11 తేదీల్లో కొత్త జిల్లాల దశాబ్ది ఉత్సవాలు
సిద్దిపేట జిల్లా కల సాకారమై పదేండ్లు పూర్తయింది. ఈ సందర్భంగా ‘సిద్దిపేట జిల్లా పదేండ్ల పండుగను సంబురంగా జరుపుకొంటున్నది. మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే హరీశ్‌రావు నేతృత్వంలో ఈనెల 9, 10, 11 తేదీల్లో మూడు రోజుల పాటు దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరిపేందుకు ఉత్సవ నిర్వహణ కమిటీ సమాయత్తం అవుతున్నది. తెలంగాణ సాధించిన మహానేత కేసీఆర్ సిద్దిపేట ఎమ్మెల్యేగా సిద్దిపేట జిల్లా కోసం పోరాటం చేశారు. సమైక్య పాలకులకు దండంపెట్టి దరఖాస్తులు ఇచ్చినా స్పందించని వారిని వెక్కిరిస్తూ తానే స్వయంగా తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి..ముఖ్యమంత్రి అయిన తర్వాత సిద్దిపేట జిల్లాను ఏర్పాటు చేశారు. జిల్లా ఏర్పడి పదేండ్లు పూర్తయిన సందర్భగా జిల్లా ఏర్పడక ముందు జ్ఞాపకాలు, కష్టాలను నెమరువేసుకుంటున్నది. కేసీఆర్, హరీశ్‌రావుల నేతృత్వంలో జిల్లాలో జరిగిన అభివృద్ధిని, భవిష్యత్తులో చేయాల్సిన కర్తవ్యాలను నిర్దేశించుకుంటున్నది.
1980 దశకంలో సిద్దిపేట జిల్లా కావాలనే డిమాండ్ మెల్లగా మొదలయ్యింది. ఈ సిద్దిపేటకు చెందిన కేసీఆర్ యువనాయకునిగా ఉన్న సమయంలోనే సిద్దిపేట జిల్లా కావాలనే డిమాండ్‌తో యువకులతో సమావేశాలు నిర్వహించారు. సిద్దిపేట జిల్లా సాధన సమితి, సిద్దిపేట జిల్లా పోరాట సమితి లాంటివి ఏర్పాటయ్యాయి. సిద్దిపేట జిల్లా ఏర్పాటు అంశం రాజకీయ ఎజెండా తెరమీదికి వచ్చింది. 1983లో మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన కేసీఆర్ ఆ ఎన్నికల ఎజెండా మీదికి సిద్దిపేట జిల్లా, సిద్దిపేట ప్రాం తానికి రైలు, సిద్దిపేట ప్రాంతానికి సాగు, తాగునీరు అనేఅంశాలను ప్రధానంగా చర్చకు తెచ్చారు.
1983లో స్వల్ప తేడాతో కేసీఆర్ ఓడిపోయారు. 1985లో రాష్ట్ర ప్రభుత్వంలో సంక్షోభం రావడం..అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని ప్రధాని ఇందిరాగాంధీ బర్తరఫ్ చేయడం వంటి రాజకీయ పరిణామాలు సంభవించాయి. అదే ఏడాది మధ్యంతర ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో రెండోసారి సిద్దిపేట నుంచి పోటీచేసిన కేసీఆర్ గెలుపొంది మొదటిసారి శాసనసభలో అడుగుపెట్టారు.
ఆ ఎన్నికల్లో కూడా సిద్దిపేట జిల్లా ఏర్పాటు అంశం ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. 1989 నాటికి సిద్దిపేట జిల్లా అంశం మరింత ఉధృతమైంది. ఆ ఎన్నికల్లో సిద్దిపేటకు ప్రచారానికి వచ్చిన అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌కు సిద్దిపేట జిల్లా అంశంపై కేసీఆర్ వినతిపత్రం ఇచ్చారు. అప్పటినుంచి సిద్దిపేట జిల్లా అంశానికి రాజకీయ ప్రాధాన్యత వచ్చింది. ఉద్యమ సమయంలోనూ అనేకసార్లు సిద్దిపేటలో జరిగిన సభల్లోనూ కేసీఆర్ సిద్దిపేట జిల్లా అంశాన్ని ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన వెంటనే సిద్దిపేట జిల్లా చేసుకుందామని స్పష్టంగా చెప్పారు. 2014లో కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక సిద్దిపేట జిల్లా ఏర్పాటు అంశానికి మంచి రోజులు వచ్చాయి. 2016 అక్టోబర్ 11న దసరా పండుగ రోజున సిద్దిపేట జిల్లా ఆవిర్భావానికి ముహూర్తం ఖరారు చేశారు. సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాలతోపాటు హుస్నాబాద్, జనగామ నియోజకవర్గంలో ఉండి సిద్దిపేటకు అతిచేరువలో ఉన్న కొమురవెల్లి, చేర్యాల, మద్దూరు, ధూల్మిట్ట మండలాలు, మానకొండూరు నియోజకవర్గంలోని బెజ్జంకి మండలాన్ని సిద్దిపేట జిల్లాలో కలుపుతూ సిద్దిపేట జిల్లా భౌగోళిక స్వరూపాన్ని మార్చారు.
సిద్దిపేట జిల్లా కోసం సుమారు రెండు, మూడు దశాబ్దాలుగా పోరాడిన కేసీఆర్ తాను సాధించిన తెలంగాణ తొలి రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో సగర్వంగా జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతర కాలంలో సంగారెడ్డి నుంచి అన్ని ప్రభుత్వ శాఖలు సిద్దిపేట జిల్లాకు తరలివచ్చి, కార్యకలాపాలు ప్రారంభించాయి. కొత్త జిల్లా ఏర్పాటుతో సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, ప్రాంతాల ప్రజల 150 కిలోమీటర్లు వెళ్లే సంగారెడ్డి ప్రయాణానికి బ్రేక్ పడింది. ప్రభుత్వ అధికారులంతా ప్రజల ముందుకు వచ్చి సేవలు చేయడం మొదలుపెట్టారు. సిద్దిపేట జిల్లా అంతటా సంబురాలు అంబరాన్నంటాయి.
హరీశ్‌రావు కోరిక మేరకు కేసీఆర్ సిద్దిపేటకు మెడికల్ కళాశాల మంజూరు చేశారు. పేద ప్రజలకు అన్ని రకాల నాణ్యమైన వైద్య సేవలు అందేవిధంగా అత్యాధునిక సౌకర్యాలతో 1,000 పడకల ఆసుపత్రిని, దీనికి అనుబంధంగా మెడికల్ కళాశాల నిర్మించాలని యోచించడంతో అది కూడా వేగంగా పూర్తయింది. ఏరియా ఆసుపత్రులు అప్‌గ్రేడ్ అయ్యాయి. సిద్దిపేట పట్టణంలో నలుదిక్కులా అర్బన్ హెల్త్ సెంటర్లు ప్రారంభమయ్యాయి. మహిళల కోసం ప్రత్యేక హెల్త్ సెంటర్ ప్రారంభమైంది. పేదలకు వైద్యం మరింత చేరువైంది.
ఒకవైపు సిద్దిపేట, మరోవైపు గజ్వేల్..ఇటు దుబ్బాక, హుస్నాబాద్, చేర్యాల ప్రాంతాలను ఏకకాలంలో అభివృద్ధి చేయడానికి కేసీఆర్ సంకల్పించారు. సిద్దిపేట జిల్లాను ఒక మాడల్ జిల్లాగా రూపొందించి రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలబెట్టారు. విద్య, వైద్య, ఉపాధి, సాగు, తాగునీరు, విద్యుత్తు, రోడ్లు, భవనాలు, పల్లెలు, పట్టణాలనే తేడా లేకుండా సిద్దిపేట జిల్లాను తీర్చిదిద్దారు. సమైక్య రాష్ట్రంలో పాలకుల నిర్లక్ష్యంతో అభివృద్ధికి నోచుకోని సిద్దిపేట ప్రాంతాన్ని ఐదారేండ్లలోనే అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలిపారు.
సాగునీటి సమస్యతో అల్లాడుతున్న రైతులకు గొప్ప ఊరటను.. బతుకుమీద ఆశను కల్పిస్తూ గోదావరి నదికి 570 మీటర్ల ఎత్తున ఉన్న సిద్దిపేట ప్రాంత కరువును శాశ్వతంగా దూరం చేసే మహత్తర యజ్ఞానికి శ్రీకారం చుట్టారు. కేసీఆర్ తన కలల ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారు. సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లాల సరిహద్దులో అంతగిరి వద్ద అన్నపూర్ణ సాగర్, సిద్దిపేట నియోజకవర్గంలోని చిన్నకోడూరు మండలం చందులాపూర్ గ్రామం వద్ద రంగనాయకసాగర్, దుబ్బాక నియోజకవర్గంలోని తొగుట మండలం తుక్కాపూర్ గ్రామ శివారు అటవీ ప్రాంతంలో మల్లన్నసాగర్, గజ్వేల్ నియోజకవర్గంలోని మర్కూక్ మండలం పాములపర్తి వద్ద కొండ పోచమ్మసాగర్, హుస్నాబాద్ నియోజకవర్గంలోని గౌరవెల్లి, గండిపల్లి రిజర్వాయర్ల నిర్మాణం యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి గోదావరి జలాలతో సిద్దిపేట జిల్లా భూమిని పునీతం చేశారు. సిద్దిపేట జిల్లా సాగునీటి రంగంలో ఇది ఒక విప్లవాత్మక మార్పు. గోదావరి జలాలు సిద్దిపేట జిల్లాకు తరలివచ్చి బీడుపడ్డ భూముల గొంతు తడుపడంతో జిల్లా రైతుల జీవితాల్లో ఎవరూ ఊహించని మార్పు వచ్చింది. చుక్కనీటి కోసం అల్లాడిన సిద్దిపేట ప్రాంతం ప్రాజెక్టుల ఖిల్లాగా మారిపోయింది. అద్భుతమైన పంటలు పండాయి.
సిద్దిపేట పట్టణంలోని కోమటి చెరువు అందాలు జిల్లా ప్రజల్ని, రాష్ట్ర ప్రజల్ని మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి. సిద్దిపేటకు రైలు రావాలన్న కోరిక కూడా ఎన్నో ఏండ్లుగా ఉన్నది. కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో అప్పటి యూపీఏ ప్రభుత్వం ద్వారా మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వేలైన్‌కు నిధులు మంజూరు చేయించారు. తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులను మంజూరు చేశారు. హరీశ్‌రావు వెంటపడి భూ సేకరణ చేయించి శరవేగంగా రైల్వే లైన్ పనులు పూర్తి చేయించి సిద్దిపేటకు రైలు తీసుకువచ్చారు. విద్యారంగంలో గొప్ప మార్పు వచ్చింది. హరీశ్‌రావు కృషితో సిద్దిపేట పీజీ కళాశాలకు అదనపు కోర్సులు మంజూరయ్యాయి. ప్రత్యేకంగా మహిళల కోసం డిగ్రీ కళాశాల ఏర్పాటైంది. రాజ్‌గోపాల్‌పేట వద్ద పాలిటెక్నిక్ కళాశాల, లింగారెడ్డి పల్లి వద్ద మహిళా పాలిటెక్నిక్ కళాశాల, తోర్నాల వద్ద వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల, ఐటీఐ కళాశాల, రంగనాయక సాగర్ వద్ద ఫార్మసీ కళాశాల, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకుల పాఠశాలలు. కేంద్రీయ విద్యాలయం సిద్దిపేటకు తరలివచ్చాయి. ప్రైవేట్ మెడికల్ కళాశాల కూడా ఏర్పాటైంది. మార్కెటింగ్ సదుపాయాలు పెరిగాయి. వ్యాపార, పారిశ్రామికరంగం అభివృద్ధి చెందింది. యువకులకు ఉపాధి అవకాశం పెరిగింది. భూముల రేట్లు మూడింతలు పెరిగి రియల్ ఎస్టేట్ వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా విరాజిల్లింది. రైతుల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చేలా నంగునూరు మండలం నర్మెట గ్రామం వద్ద ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభమైంది.
కళలు, సంస్కృతి, కవులు, రచయితలకు కాణాచి అయిన సిద్దిపేటలో సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు అనుకూలంగా విపంచి ఆడిటోరియం ప్రారంభమైంది. మెట్రోపాలిటన్ సిటీల మాదిరిగా సిద్దిపేట పట్టణమంతటా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటైంది. స్వచ్ఛ సిద్దిపేటగా జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్నది. చెత్తను బయో గ్యాస్‌గా మార్చే ప్లాంట్ బస్సాపూర్ వద్ద ఏర్పాటైంది. సిద్దిపేట చుట్టూ అద్భుతమైన రింగ్ రోడ్డు ఏర్పాటైంది. పట్టణ శాశ్వత మంచినీటి సమస్య పరిష్కారానికి మల్లన్నసాగర్ నీటి పంపు ద్వారా రింగ్ మెయిన్ లైన్ ప్రారంభమైంది.
ఇక గజ్వేల్ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి గురించి ఒక్కమాటలో చెప్పాలంటే..కేసీఆర్‌కు ముందు, కేసీఆర్ వచ్చిన తర్వాత అని నిర్వచించు కోవచ్చు. గజ్వేల్ అభివృద్ధిలో అత్యంత ప్రధానమైనది కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుసంధానంగా నిర్మించిన కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్‌గా చెప్పవచ్చు. ఈ రిజర్వాయర్ నియోజకవర్గ రైతుల, ప్రజల ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక జీవన విధానాన్ని సమూలంగా మార్చేసింది. ప్రజల జీవన ప్రమాణ స్థాయిని పెంచింది.
నియోజకవర్గంలో కొండా లక్ష్మణ్ బాపూజీ వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఫారెస్ట్ యూనివర్సిటీ, ఎడ్యుకేషన్ హబ్, అర్బన్ పార్క్, ఫారెస్ట్ రిజనవేషన్, ఇంటిగ్రేటెడ్ రైతు బజార్ ఏర్పాటయ్యాయి. వాడవాడలా సీసీ రోడ్ల నిర్మాణం, ప్రతి గ్రామం నుంచి మండల కేంద్రానికి వెళ్లే దారులను డబుల్ రోడ్‌గా మార్పు, గజ్వేల్ డివిజన్ ఏర్పా టు. వంటి అభివృద్ధి పనులు శరవేగంగా పూర్తయ్యాయి. సిద్దిపేట జిల్లా పాడి పంటల జిల్లాగా ప్రసిద్ధి చెందింది. దీనికంతటికీ కేసీఆర్, హరీశ్‌రావు ప్రధాన కారకులు. సిద్దిపేట జిల్లా ఏర్పడి పదేండ్లు పూర్తయిన సందర్భంగా జి ల్లా ప్రజలు ఆ ఇద్దరు నేతలకు జేజేలు పలుకుతున్నారు.
కేంద్రీయ విద్యాలయం సిద్దిపేటకు తరలివచ్చాయి. ప్రైవేట్ మెడికల్ కళాశాల కూడా ఏర్పాటైంది. మార్కెటింగ్ సదుపాయాలు పెరిగాయి. వ్యాపార, పారిశ్రామికరంగం అభివృద్ధి చెందింది. యువకులకు ఉపాధి అవకాశం పెరిగింది. భూముల రేట్లు మూడింతలు పెరిగి రియల్ ఎస్టేట్ వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా విరాజిల్లింది.