పార్లమెంట్లో అంబేద్కర్ గళం!
రాజ్యాంగంలోని ఆర్టికల్ 17 అస్పృశ్యత నివారణ చట్టం అమలుపై కాని, ఆర్టికల్ 17లోని కుల నిర్మూలన భావాలకు సంబంధించిన అంశాల పట్ల గాని విపక్ష నాయకులైన రాహుల్‌గాంధీ, మల్లికారున్ ఖర్గే, చిదంబరం తదితరులు పార్లమెంట్లో చర్చ లేవనెత్తకపోవడం విడ్డూరం.
2024-25 కేంద్ర బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో పార్లమెంట్లో జరగబోయే చర్చల పట్ల దళిత, బహుజన, మైనారిటీ ప్రజలు ఆసక్తిగా ఉన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు అవుతున్నా ప్రపంచ దేశాల ఆర్థిక సూచీలో ఇంకా 14వ స్థానంలో ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. మన దేశంలో ఇంకా అస్పృశ్యత, కుల వివక్ష, అత్యాచారాలు, అణచివేత, నిరక్షరాస్యత కొనసాగడానికి ప్రధాన కారణం దేశాన్ని 75 ఏండ్లు పాలించిన వివిధ పాలకవర్గాల ఆర్థిక, సామాజిక దోపిడీ విధానాలే అన్నది సుస్పష్టం.
దేశంలో రవాణా వ్యవస్థ పెరుగుతున్నది. ప్రయాణికుల సంఖ్య కూడా పెరుగుతున్నది. కానీ, పేద ప్రజలకు రైలులో బోగీలు తగ్గిపోతున్నాయి. అసలు రైళ్ల సంఖ్యే తగ్గిపోతున్నది. అదే సమయంలో విమానాలు పెరుగుతున్నాయి. పేద ప్రజలు ప్రయాణం చేయలేని స్థితిలో ఉన్నారు. దళిత బహుజన ఎంపీలు రైలు మార్గాల విస్తృతి గురించి ఉభయ సభల్లో బలంగా వాదించాలి.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 17 అస్పృశ్యత నివారణ చట్టం అమలుపై కాని, ఆర్టికల్ 17లోని కుల నిర్మూలన భావాలకు సంబంధించిన అంశాల పట్ల గాని విపక్ష నాయకులైన రాహుల్‌గాంధీ, మల్లికారున్ ఖర్గే, చిదంబరం తదితరులు పార్లమెంట్లో చర్చ లేవనెత్తకపోవడం విడ్డూరం. ఏ రాజ్యాంగాన్ని అయితే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు పార్లమెంట్లో తన చేతితో ఎత్తిచూపిస్తున్నాడో.. ఆ రాజ్యాంగంలో ఉన్న ప్రధాన అంశం అస్పృశ్యత లేని భారతదేశాన్ని సష్టించడమే. అలా సృష్టించాలంటే దళితులకు భూమి పంపిణీ, విద్యాభివద్ధి, నిరుద్యోగ నిర్మూలన, ఉద్యోగ కల్పన, ఉన్నత విద్యావకాశాలు కల్పించడం ప్రధానమైనవి. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఈ అంశాలను ఆ రోజుల్లోనే వాదించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకోవాలి. మతసామరస్య వాదం వల్ల అస్పృశ్యత పోతుందా? బౌద్ధ సాంస్కతిక విప్లవం వల్ల పోతుందా? అనే అంశాన్ని అధికారపక్షం, విపక్షం అర్థం చేసుకోవాలి.
దళితులకు భూ పంపిణీ ద్వారానే దేశ సంపద పెరుగుతుందని అంబేద్కర్ చెప్పిన ఆర్థిక సామ్యవాదాన్ని రెండు పక్షాలు అర్థం చేసుకోలేకపోతున్నాయి. నిజానికి అంబేద్కర్ కృషి వల్ల అస్పృశ్యతను ఒక నేరంగా రాజ్యాంగం పరిగణిస్తున్నప్పటికీ.. ఇంకా దేశంలోని లక్షలాది గ్రామాల్లో అస్పృశ్యత వెంటాడుతూనే ఉన్నది. దీనికి స్పష్టమైన కారణాలను పార్లమెంటు చర్చల ద్వారా సాధించలేకపోతున్నారు. అంబేద్కర్ రాజ్యాంగ చర్చల సందర్భంగా సోషలిస్టు సిద్ధాంతాల నుంచి రాజ్యాంగం రూపొందిందని, శాసనాధికారుల నుంచి సోషలిజాన్ని సాధించాలని పేర్కొన్నారు. కానీ, ఆచరణలో ధనస్వామిక శక్తుల అభివృద్ధికే గత ప్రభుత్వాలు పాటుపడ్డాయి. ఈ విధమైన అసమ సమాజ సృష్టి కోసం అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాయలేదు. అంబేద్కర్ ‘స్టేట్స్ అండ్ మైనారిటీస్’ అనే గ్రంథ్రాన్ని రాజ్యాంగ రచనకు ముందే ప్రచురించారు. అందులో ఆస్తిని జాతీయం చేయాలని.. అప్పుడే ప్రజలకు ఆర్థిక, సాంఘిక న్యాయం జరుగుతుందని చెప్పారు.
సామాజిక అసమానతలతో నిండిన ఈ వ్యవస్థలో కుల, మత, జాతి ఆధారంగా వివక్ష చూపితే ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతుందని రాజ్యాంగ చర్చల్లో అంబేద్కర్ నొక్కి వక్కాణించారు. మతరహిత రాజ్యాంగ పద్ధతే సెక్యులర్ విధానమని రాజ్యాంగ చర్చల్లో ఆయన వివరించారు. మతం వ్యక్తిగతమని, రాజ్యాంగం వైజ్ఞానికంగా, జ్ఞానపరంగా నడవాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. ప్రభుత్వ సొమ్మును మత బోధనలకు, మత కార్యకలాపాలకు ఉపయోగించరాదని రాజ్యాంగంలోని 21వ ఆర్టికల్ స్పష్టం చేస్తున్నది. సెక్యులరిజం అంటే మత ప్రమేయం లేని రాజ్యం అని అర్థం. దాన్ని ఇరుపక్షాలు ఆచరించవలసిన అవసరం ఉన్నది. వాస్తవానికి పార్లమెంటులో బడుగు వర్గాల జీవన స్థితిగతులను మెరుగుపరచడం కోసమే చర్చ జరగాలి.
కానీ, మతపరమైన అంశాలకే ఎక్కువ సమయం కేటాయిస్తూ విలువైన కాలాన్ని వృథా చేస్తున్నారు. సామాజిక, ఆర్థిక అభివృద్ధి గురించి, ముఖ్యంగా మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు మూలమైన మద్యపాన నిషేధం, మత్తుపదార్థాలు వంటి విషయాలపై పార్లమెంట్ దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. అంబేద్కర్‌తో పాటు రామ్ మనోహర్ లోహియా కూడా కులాధిపత్య భారత రాజకీయ వ్యవస్థ మీద చర్చ పెట్టారు. భారత రాజకీయాల్లో కులం నిర్వహిస్తున్న పాత్రను తక్కువ అంచనా వేయరాదనే అంశాన్ని లోహియా నొక్కిచెప్పారు. దళితుల ఉన్నత విద్యను ప్రోత్సహించడానికి విశ్వవిద్యాలయాల్లో ఎక్కువ నిధులు ఇచ్చి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయాలని అంబేద్కర్ చెప్పారు. అందుకు ఆయన మొదటి ప్రణాళికలోనే నిధులను కేటాయించారు. 111 మంది ఎస్సీ, ఎస్టీ ఎంపీలు ఉన్న భారత పార్లమెంటులో దళిత, బహుజనుల ఆర్థిక, సామాజికాభివృద్ధి గురించి వారు ఎక్కువ మాట్లాడకపోవడం ఆశ్చర్యకరం.
అంబేద్కర్ ఎన్నో కష్టాలకోర్చి, పోరాటాలు చేసి రాజకీయ రిజర్వేషన్లు సాధించారు. అయితే ఆ హక్కులు నేరవేర్చే క్రమంలో ఎస్సీ, ఎస్టీ ఎంపీలు పోరాడుతున్నారా? అనేదే ప్రశ్న. వివిధ పార్టీల్లో ఉన్నప్పటికీ 1989లో ఏపీ దళిత మహాసభ ఆధ్వర్యంలో 1989 ఎస్సీ, ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్‌ను సాధించారు. ఇప్పుడు మళ్లీ అదే ఐక్యత దళిత ఎంపీల్లో కావాలి. అట్రాసిటీ యాక్ట్‌ను దేశంలో బలంగా అమలు జరపాలని వారు వాదించగలగాలి.
బీసీ అంటే వెనుకబడిన కులం అని కాదు, వెనుకబడిన తరగతి అని అర్థం. వారు కులాలు కావచ్చు, బౌద్ధులు కావచ్చు, క్రైస్తవులు, ముస్లిం కావచ్చు. స్వాతంత్య్రం నాటికి వీరి మధ్య ఐక్యత లేదు. వీరికి జనగణన లేదు. మన రాజ్యాంగ నిర్మాత వీరి కోసమే రాజ్యాంగంలో 340 ఆర్టికల్‌ను పొందుపరిచారు.
ఆ తర్వాత ఈ ఆర్టికల్‌ను అమలు చేయడానికి, బీసీల జనాభా లెక్కలు తేల్చటానికి మొదట కాకా కాలేల్కర్ కమిషన్, 1992 నుంచి మండల్ కమిషన్ అమలవుతూ ఉంది. అయితే ఇప్పటికీ చట్టసభలలో బీసీలకు రిజర్వేషన్ లేదు. అంబేద్కర్ బీసీల కోసమే మొదటి ప్రాధాన్యమిచ్చి 340 ఆర్టికల్, ఆ తర్వాతే ఎస్సీ, ఎస్టీల కోసం 341, 342 ఆర్టికల్‌లను రాజ్యాంగంలో పొందుపరిచారు. బీసీల అభ్యున్నతి కోసం వారి ఆర్థిక, సామాజిక అంశాల మీద, సామాజిక న్యాయం కోసం 340 ఆర్టికల్‌ను తీసుకువస్తే, బీసీలు మత ఛాందసవాదులై, దైవానికి తలవంచి, అగ్రకులాలకు బానిసలై బీసీల విముక్తి ప్రదాత అయిన అంబేద్కర్‌ను మరిచిపోయి మానసిక బానిసత్వంలో బతుకుతున్నారు.
బీసీ సమాజం ఒక గొప్ప సమాజం. వారికి సామాజిక న్యాయం జరగడం కోసం పార్లమెంటులో బహు సంఖ్యాకులుగా ఉన్న బీసీ ఎంపీలు పోరాడవలసిన చారిత్రక అవసరం ఎంతో ఉన్నది. దేశంలో పేద ప్రజలకు ఉచితంగా ధనం ఇవ్వడం కంటే వారిలో ఉన్న వ్యవసాయ కూలీలకు భూమి, యువకులకు గ్రామీణ ఫ్యాక్టరీలు, విద్యావంతులకు ఉద్యోగ కల్పన పెంచాల్సిన అవసరం ఉన్నది. కాంగ్రెస్ మేధావులుగా పేరొందిన చిదంబరం వంటి వారు రాహుల్‌గాంధీతో సహా వామపక్షాలు కూడా నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి వాటిపైనే మాట్లాడుతున్నారు గాని, అణగారిపోతున్న దళితులకు అటు గ్రామంలోనూ పనిలేదు, ఇటు పట్టణంలోనూ నిల్వ నీడలేదనే విషయాన్ని మరిచిపోతున్నారు. ఇంతటి దుర్భర పరిస్థితుల్లో ఉన్నవారి సామాజిక, ఆర్థిక సమస్యలను ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లే అంబేద్కర్, ఫూలే తాత్విక దృష్టి వీరికి కనిపించడం లేదు. రాబోయే బడ్జెట్లో దళితులు, మహిళలు, బీసీలను ఉపాధి రంగాల్లో విస్తృతం చేయడం కోసం ప్రతి గ్రామంలో పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు పెట్టాలి. వాటిలో తయారయ్యే వస్తువులను ఇతర దేశాలకు మార్కెట్ చేసే విధానాలను రూపొందించాలి. అంబేద్కర్ ఆర్థిక ప్రణాళిక మార్గంలో దేశసంపదను అభివృద్ధి చేసుకోవడం కోసం స్వయం ప్రతిపత్తి, స్వయం జీవనం సంస్కృతిని పెంచే మార్గంలో బడ్జెట్ రూపకల్పన కోసం పార్టీలకు అతీతంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలు పోరాడాల్సిన చారిత్రక సందర్భం ఇది.
ఈ సందర్భంగా అంబేద్కర్ 1937 డిసెంబర్ 31న కాన్ఫరెన్స్ ఆఫ్ ద డిప్రెస్డ్ క్లాసెస్‌లో అంబేద్కర్ మాట్లాడుతూ దళిత బహుజనులకు, స్త్రీలకు ఆత్మగౌరవం, స్వయం సహాయక శక్తి ఉద్యమ స్ఫూర్తి కావాలని అన్నారు. తమ ముందు మూడు సమస్యలున్నట్టు చెప్పారు. మొదటిది.. హిందూ సమాజంలో అణగారిన వర్గాలు ఏ నాటికైనా సమాన ప్రతిపత్తి పొందుతాయా, లేదా? రెండోది.. వారు జాతీయ సంపత్తిలో సరైన వాటా పొందగలరా, లేదా? మూడోది.. ఆత్మగౌరవ, స్వయం-సహాయక ఉద్యమాల గతి ఏమిటి?
మొదటి అంశానికి సంబంధించి, కుల వ్యవస్థ ఉన్నంతకాలం అది సాధ్యం కాదన్నారు. రెండో అంశానికి సంబంధించి, పెట్టుబడిదారుల నేతృత్వంలోని కాంగ్రెస్ అణగారిన వర్గాల పట్ల వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ పెట్టుబడిదారుల చేతుల్లో ఉన్నంతవరకు ప్రస్తుత ప్రభుత్వం అణగారిన వర్గాల అభ్యున్నతికి ఏదో చేస్తుందని నమ్మలేమని చెప్పారు. దోపిడీకి ఎగబడిన పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా ఒక యునైటెడ్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. ఆర్థిక స్వాతంత్య్రం సాధించుకోవాల్సిన తరుణం ఆసన్నమైందని అణగారిన వర్గాలవారికి ఉద్బోధించారు. ఇక మూడో అంశానికి సంబంధించి ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోవాలని ప్రజలకు సూచించారు. ఉద్యమం వల్ల లాభాలే తప్ప పోగొట్టుకోవడానికి ఏమీ లేదని, వారు చావు భయం పోగొట్టుకోవాలని సలహా ఇచ్చారు. ఆయన ఆశయాల మార్గంలో పార్లమెంట్‌లోని దళిత, బహుజన, మైనారిటీ, లౌకికవాద ఎంపీలు పోరాడాల్సిన అవసరం ఉన్నది.
-డాక్టర్ కత్తి పద్మారావు
Read Today's Latest Opinions News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

