మనం ఏదైనా హోటల్ లేదా రెస్టారెంట్‌కు వెళ్లినప్పుడు కామన్‌గా మనకు సర్వ్ చేసిన సిబ్బందికి ఎంతో కొంత టిప్ ఇస్తుంటాం. అదే వెయిటర్ మనతో ఆప్యాయంగా పలకరిస్తూ.. చిరునవ్వుతో సేవలందిస్తే.. ఇంకొంచెం ఎక్కువగా టిప్ ఇస్తుంటాం. అలా ఎంత ఇచ్చిన వంద రెండు వందలకు మించి అయితే ఇవ్వం కదా.. కానీ ఒక మహిళ మాత్రం తనకు ఫుడ్ సర్వ్ చేసిన వెయిటర్‌కు లక్షల్లో టిప్ ఇచ్చింది. అదేంటి.. మనం తిన్న బిల్లే అంత అవ్వదు.. మరి లక్షల్లో టిప్ ఎలా ఇచ్చిందని ఆశ్చర్యపోతున్నారా? అసలు ఏం జరిగిందంటే..
విలియమ్స్ అనే మహిళ ఒకరోజు భోజనం చేయడానికి తనకు దగ్గరలో ఉన్న ఒక రెస్టారెంట్‌కు వెళ్లింది. అక్కడ ఆమెకు జాస్మిన్ కాస్టిల్లో అనే వెయిట్రస్ ఫుడ్ సర్వ్ చేసింది. ఆ సమయంలో ఆమె చిరునవ్వుతో పలకరిస్తూ ప్రేమగా వడ్డించింది. జాస్మిన్ సర్వ్ చేసే విధానానికి విలియమ్స్ ఎంతగానో ఇంప్రెస్ అయిపోయింది. దీంతో కాస్టిల్లోకు 40 డాలర్లు అంటే దాదాపు 3,082 రూపాయల టిప్ ఇచ్చింది. అంత మొత్తంలో టిప్ అందడంతో కాస్టిల్లో ఎంతో సంబురపడిపోయింది. పెద్ద మొత్తం టిప్ ఇచ్చినందుకు విలియమ్స్‌కు కృతజ్ఞతలు తెలిపింది. కాస్టిల్లో తెగ ఎమోషన్ కావడం చూసిన విలియమ్స్ ఆమెతో మాట కలిపింది. ఈ క్రమంలో కాస్టిల్లో తన కష్టాల గురించి చెప్పుకొచ్చింది. తన పాపను డే కేర్‌లో ఉంచి అక్కడ జాబ్ చేస్తున్నానని.. పాప కోసం ఉద్యోగం మానేయాలని అనుకున్నా కానీ.. కావాల్సినంత డబ్బులు లేకపోవడంతో ఇలాగే కొనసాగాల్సి వస్తుందని తన బాధను చెప్పుకుంది కాస్టిల్లో.
ఇది విన్న విలియమ్స్ కాస్టిల్లోకు ఎలాగైనా సాయం చేయాలని అనుకుంది. దీంతో కాస్టిల్లో పేరు మీద క్యాష్ యాప్‌లో ఒక అకౌంట్ ఓపెన్ చేసింది విలియమ్స్. అలాగే ఫేస్బుక్లో ఆమె స్టోరీని పోస్టు చేసింది విలియమ్స్. కాస్టిల్లో, ఆమె కుమార్తెకు సాయం చేయండని కోరింది. దీనికి నెటిజన్లు కూడా చాలా సానుకూలంగా స్పందించారు. విలియమ్స్ ఇచ్చిన అకౌంట్‌కు చాలామంది డబ్బులు పంపించారు. అయితే ఈ విషయం తెలియని కాస్టిల్లో.. తన అకౌంట్లో వరుసగా డబ్బులు పడుతున్నట్లు మెసేజ్‌లు చూసి ఆశ్చర్యపోయింది. తన అకౌంట్లో మొత్తం 7 లక్షల రూపాయల వరకు డిపాజిట్ అయినట్లు మెసేజ్ రావడంతో.. ఏం జరుగుతుందో అర్థం కాని కాస్టిల్లో కాసేపు ఆలోచించి ఆ అకౌంట్ గురించి ఎంక్వైరీ చేసింది. అప్పుడు ఆమెకు అసలు విషయం తెలిసింది.
తన అకౌంట్‌కు డబ్బులు వస్తున్నాయని తెలుసుకుని ఆశ్చర్యపోయింది. తన కోసం ఇంత సాయం చేసిన విలియమ్స్‌కు కృతజ్ఞతలు చెప్పింది. అలాగే ఆమెను తన ఇంటికి ఆహ్వానించి ట్రీట్ కూడా ఇచ్చింది. ఇదే విషయాన్ని విలియమ్స్ మరో పోస్టు ద్వారా సోషల్ మీడియాలో పంచుకుంది. అలా మొత్తానికి తనకు ఫుడ్ సర్వ్ చేసిన వెయిటర్‌కు ఏడు లక్షల రూపాయల టిప్ అందజేసింది విలియమ్స్.