Ugadi Utsavalu : జపాన్‌లోని టోక్యో నగరంలోని కొమత్సుగావా (Komatsugawa) పార్క్‌లో ఉగాది పండుగను తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. విదేశాల్లో నివసిస్తున్నప్పటికీ భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకుంటూ ఈ వేడుకలను ఆనందోత్సాహాలతో చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో జపాన్‌కు చెందిన స్థానికులు కూడా పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఈ సందర్భంగా ఉగాది పచ్చడిని తయారు చేసి, దాని ప్రాముఖ్యతను పాల్గొన్న వారికి వివరించారు. అలాగే రాశి ఫలాలను వినిపిస్తూ కొత్త సంవత్సరానికి సంబంధించిన విశేషాలను పంచుకున్నారు. ఉగాది వేడుకల్లో భాగంగా వివిధ రకాల వంటకాలతో విందు ఏర్పాటు చేశారు. అనంతరం అందరూ కలిసి భోజనం చేశారు.ఆ తర్వాత ఆటవిడుపుగా పిల్లల కోసం బ్యాగ్ జంపింగ్ వంటి వినోదాత్మక పోటీలు పెట్టారు. పెద్దవాళ్ల కోసం టగ్ ఆఫ్ వార్ వంటి వినోదాత్మక క్రీడలు నిర్వహించారు.
అనంతరం కొత్తగా వచ్చిన కుటుంబాలు పరస్పరం పరిచయం చేసుకున్నాయి. భారతీయ సంప్రదాయాలను విదేశాల్లో ఎలా కొనసాగించాలి? అన్న విషయంపై వీరు చర్చించారు. ఈ వేడుక ద్వారా సమాజంలో ఐక్యత మరింత బలపడిందని నిర్వాహకులు తెలిపారు. వివిధ దేశాల ప్రజలు కలిసి సంస్కృతులను పంచుకోవడం ద్వారా పరస్పర అవగాహన పెరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన TAJ (Telugu association of Japan) కమిటీ సభ్యులకు, ఉగాది వేడుకలో పాల్గొన్న అందరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.