Telangana Formation Day | మలేషియా, జూన్ 6, 2026: మలేషియాలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. జూన్ 6న కౌలాలంపూర్లోని ప్రముఖ MATRADE ఎగ్జిబిషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి మలేషియాతోపాటు వివిధ దేశాల నుంచి తెలంగాణ వాసులు, సంఘాల ప్రతినిధులు, ప్రముఖులు హాజరుకానున్నారు.
ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కానుండటం ప్రత్యేక ఆకర్షణగా మారింది. కేటీఆర్ పాల్గొననున్న నేపథ్యంలో కార్యక్రమ ఏర్పాట్లను నిర్వాహకులు అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నారు. ఈ వేడుకల ఏర్పాట్లను బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ మహేష్ బిగాల పర్యవేక్షించారు. వేదిక వద్ద మౌలిక సదుపాయాలు, అతిథుల స్వాగత ఏర్పాట్లు, పార్కింగ్ సౌకర్యాలు, భద్రతా చర్యలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఆహార వసతులు తదితర అంశాలను సమీక్షించారు. ఈ కార్యక్రమానికి వచ్చే ప్రతి ఒక్కరికీ సౌకర్యవంతమైన, గుర్తుండిపోయే అనుభవం కల్పించేందుకు బృంద సభ్యులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఆయనతో పాటు బీఆర్ఎస్ మలేషియా, MYTA ముఖ్య సభ్యులు టీ. మారుతి కుర్మ, తిరుపతి, సందీప్ గౌడ్, నరేందర్ రెడ్డి, అనిల్, జ్యోతి, మోనా, పూర్ణ చంద్రరావు, దీపిక తదితరులు సహా పలువురు బృంద సభ్యులు పాల్గొన్నారు. తుది ఏర్పాట్లపై మహేష్ బిగాల మార్గనిర్దేశం చేస్తూ, ఇప్పటివరకు జరిగిన ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆవిర్భావ పోరాట స్ఫూర్తి, రాష్ట్ర అభివృద్ధి ప్రయాణం, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, కళలను ప్రతిబింబించే ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. తెలంగాణ జానపద కళారూపాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, సంగీత కార్యక్రమాలు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
విదేశాల్లో నివసిస్తున్న తెలంగాణ ప్రజలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి, వారి మధ్య ఐక్యతను మరింత బలోపేతం చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని నిర్వాహకులు పేర్కొన్నారు. తెలంగాణ సాధించిన అభివృద్ధి విజయాలను అంతర్జాతీయ వేదికపై ప్రదర్శించేందుకు ఈ వేడుకలు మంచి అవకాశంగా నిలుస్తాయని తెలిపారు.
భారతదేశం వెలుపల తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని అంత పెద్ద స్థాయిలో నిర్వహించడం ప్రవాస తెలంగాణ సమాజానికి గర్వకారణమని నిర్వాహకులు తెలిపారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని, సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పేలా ఈ వేడుకలు నిర్వహించనున్నట్లు వారు పేర్కొన్నారు.


