డాలస్‌లో ఘనంగా కొసరాజు సాహిత్య సంపుటాల ఆవిష్కరణ
ప్రముఖ జానపద కవి, కవిరత్న కొసరాజు రాఘవయ్య చౌదరి సాహిత్య సంపుటాలు అమెరికాలోని డాలస్‌లో ఘనంగా ఆవిష్కృతమయ్యాయి. తానా ప్రపంచసాహిత్యవేదిక, కళావాహిని సంయుక్త ఆధ్వర్యంలో, ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం సహకారంతో ఆదివారం ఈ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు.
డాలస్: ప్రముఖ జానపద కవి, కవిరత్న కొసరాజు రాఘవయ్య చౌదరి సాహిత్య సంపుటాలు అమెరికాలోని డాలస్‌లో ఘనంగా ఆవిష్కృతమయ్యాయి. తానా ప్రపంచసాహిత్యవేదిక, కళావాహిని సంయుక్త ఆధ్వర్యంలో, ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం సహకారంతో ఆదివారం ఈ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. కొసరాజు సర్వలభ్య రచనలను సంకలనం చేసి గత ఏడాది గుంటూరులో కుటుంబ సభ్యులు, సాహిత్యాభిమానుల సమక్షంలో పద్మశ్రీ డా. గరికిపాటి నరసింహారావు చేతుల మీదుగా ఆవిష్కరించారు. తాజాగా ఆ సాహిత్య సంపుటాలను అమెరికాలోని తెలుగు సాహిత్యాభిమానులకు పరిచయం చేశారు.
కళావాహిని వ్యవస్థాపకుడు అనంత్ మల్లవరపు స్వాగతోపన్యాసంతో కార్యక్రమం ప్రారంభమైంది. అనంతరం కొసరాజు చిత్రపటానికి అతిథులు పుష్పాంజలి ఘటించారు. తానా పూర్వాధ్యక్షుడు, తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకుడు డా. ప్రసాద్ తోటకూర సభాధ్యక్షత వహించారు. కొసరాజు సాహిత్యంపై పరిశోధన చేసి పీహెచ్‌డీతోపాటు స్వర్ణపతకం పొందిన డా. నల్లూరి రామారావు ముఖ్య అతిథిగా, ‘కొసరాజు సినీవ్యాస సంహిత’ రచయిత చంద్రహాస్ మద్దుకూరి విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. డా. నల్లూరి రామారావు చేతుల మీదుగా సాహిత్య సంపుటాలను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా డా. నల్లూరి రామారావు మాట్లాడుతూ.. కొసరాజు కలం నుంచి వెలువడిన కవితలు, శతకాలు, కావ్యాలు, సినీ గీతాలు ప్రత్యేకమైన శైలిలో సాగాయని అన్నారు. ‘గండికోట యుద్ధం’, ‘కడగండ్లు’, ‘కొసరాజు విసుర్లు’, ‘కొండవీటి వైభవం’, ‘నవభారతం’, ‘భానుగీత’ వంటి రచనలు ఆయన సాహితీ వైవిధ్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. కొసరాజుకు కూడా ఎంతో ఇష్టమైన ‘గండికోట యుద్ధం’ కావ్యాన్ని ప్రతి ఒక్కరూ తప్పక చదవాలని సూచించారు. ఆయన రచనల్లోని పద సంపదను భావితరాలకు అందించేందుకు కొసరాజు పద నిఘంటువును రూపొందించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
చంద్రహాస్ మద్దుకూరి మాట్లాడుతూ.. సినీ గీతాల్లో కొసరాజు ఉపయోగించిన అచ్చతెలుగు పదాలు, గ్రామీణ ప్రాంతాల మాటలు, ప్రత్యేకమైన పదప్రయోగాలు మరే ఇతర సినీ గీత రచయితల్లోనూ అరుదుగా కనిపిస్తాయని అన్నారు. ఆయన పాటలు సరళమైన భాషలో ఉండటంతో పండితులు, సామాన్యులు అనే తేడా లేకుండా అందరినీ ఆకట్టుకున్నాయని చెప్పారు. టోపీ, లారీ, సిగరెట్, పేకాట, పకోడీ వంటి నిత్యజీవితంలోని వస్తువులను కూడా తన పాటల్లో చేర్చి వాటిని ప్రజల జీవితాల్లో చిరస్థాయిగా నిలిపారని వివరించారు.
సభాధ్యక్షుడు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ.. ‘రైతు అన్నదాత.. కవి జ్ఞానదాత. ఈ రెండూ కలిసిన కొసరాజు సాహితీ చైతన్య ప్రదాత’ అని కొనియాడారు. కేవలం నాలుగో తరగతి వరకు మాత్రమే చదువుకున్న కొసరాజు జానపద గీతాల్లోని లాలిత్యం, పొగరు, వగరు ఏమాత్రం తగ్గకుండా తెలుగు సినిమా పాటకు కొత్త సొగసులు అద్దారని చెప్పారు. అచ్చతెలుగు అందాలు, జానపదుల మాటల తీరులు, పల్లెపట్టులోని చమత్కారాలు, విరుపులు ఆయన పాటల్లో స్పష్టంగా కనిపిస్తాయని పేర్కొన్నారు. యక్షగానాలు, వీధి భాగవతాలు, హరికథలు, జముకుల కథలు, బుర్రకథలు, భజన గీతాలు, పగటివేషగాళ్ల పాటలు, రజకుల పాటలు, పాములోళ్ల పాటలు, గంగిరెద్దుల పాటలు వంటి ఎన్నో జానపద కళారూపాల ప్రభావం ఆయన రచనల్లో కనిపిస్తుందని కొనియాడారు.
అలరించిన కొసరాజు పాటల సంగీత విభావరి
సాహిత్య కార్యక్రమం అనంతరం నిర్వహించిన కొసరాజు ప్రత్యేక సంగీత విభావరి ప్రేక్షకులను అలరించింది. స్థానిక గాయనీగాయకులు అభినుత మద్దుకూరి, అనంత్ మల్లవరపు, భారతి అంగలకుదిటి, చంద్రహాస్ మద్దుకూరి, మహిత మద్దుకూరి, పూజిత కడ్మిసెట్టి, ప్రభాకర్ కోట, రాజశేఖర్ సూరిభొట్ల, రామన్ వీరంరాజు, సాహితి కోటంరాజు, సాంబ కర్నాటి, శారద షణ్ముఖి తదితరులు కొసరాజు రచించిన పాటలను హృద్యంగా ఆలపించారు.
‘నిలువవే వాలు కనులదానా’, ‘ముద్దబంతి పూలు బెట్టి మొగిలి రేకులు జడనుజుట్టి’, ‘మొగలిరేకుల సిగదానా’, ‘నందామయా గురుడ నందామయా’, ‘కళ్లు తెరచి కనరా సత్యం’, ‘మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా’, ‘ఆడుతు పాడుతు పనిజేస్తుంటే అలుపూ సొలుపేమున్నది’, ‘ఏరువాక సాగారో రన్నో చిన్నన్న’, ‘సై సై జోడెడ్లాబండీ’, ‘అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే’, ‘బలే చాన్సులే’ వంటి ఎన్నో ప్రసిద్ధ గీతాలు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి.

Kosaraju Books2
ప్రత్యేక ఆకర్షణగా నృత్య ప్రదర్శనలు
సాయి నృత్య అకాడమీ నాట్యగురువు యడ్లపాటి శ్రీదేవి నిర్వహణలో శ్రేష్ట వేముల, మనస్విని రెడ్డి పెంతాల, అనుప వేముల, పల్లవి తుమ్మలూరు నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. ‘ఏరువాక సాగారో రన్న’, ‘కళ్లు తెరిచి కనరా’, ‘సరిగంచు చీర కట్టి’ వంటి పాటలకు వారు చేసిన నృత్యాలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
కార్యక్రమానికి ముందు మనసు ఫౌండేషన్ అధినేత మన్నం రాయుడు పంపిన వీడియో సందేశాన్ని ప్రదర్శించారు. సాహిత్య సంపుటాల ముద్రణలో కీలక పాత్ర పోషించిన మనసు ఫౌండేషన్ సభ్యుడు పారా అశోక్‌కుమార్‌ను డా. ప్రసాద్ తోటకూర ప్రత్యేకంగా ప్రశంసించారు. సాహిత్య సంపుటాల ప్రచురణకు సహకరించిన మురళి వెన్నం, చంద్రహాస్ మద్దుకూరి, చినసత్యం వీర్నపు, ముఖ్య అతిథి డా. నల్లూరి రామారావులను ఘనంగా సత్కరించారు.
సంగీత విభావరిలో పాల్గొన్న గాయనీగాయకులు, నృత్య కళాకారులకు డా. కృష్ణబాబు చుండూరి, డా. జంధ్యాల జయకృష్ణ బాపూజీ, గోపాల్ పోనంగి, మురళి వెన్నం, సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ, రాజారెడ్డి, చినసత్యం వీర్నపు, డా. నరసింహారెడ్డి ఊరిమిండి, చంద్రశేఖర్ కన్నెగంటి, సురేష్ కాజ, అనంత్ మల్లవరపు, డా. రమణ జువ్వాడి, డా. నీలిమ మద్దుకూరి, డా. శ్రీదేవి జువ్వాడి, విజయమోహన్ కాకర్ల జ్ఞాపికలు అందజేసి, దుశ్శాలువాలతో సత్కరించారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
డాలస్‌లో ఘనంగా కొసరాజు సాహిత్య సంపుటాల ఆవిష్కరణ
Sai Durga Tej | మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి.. త్వరలో సాయి దుర్గా తేజ్ నిశ్చితార్థం,పెళ్లి తేదీ కూడా ఖరారైందా?
AP News | ఏపీలో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు.. రాత్రి 8 గంటలకల్లా పూర్తి ఫలితాలు ప్రకటించేలా ఏర్పాట్లు
Russia vs Ukraine | ఉక్రెయిన్‌లోని ఓ గ్రామంపై రష్యా దాడులు.. 26 మంది దుర్మరణం..!
Suriya | ‘రోలెక్స్’ సినిమా ఎప్పుడు వస్తుంది.. ఆయననే అడగాలంటూ సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు.. !
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

