EB-5 Visa | అమెరికాలోని సాఫ్ట్వేర్ కంపెనీల్లో హెచ్-1బీ వీసాపై ఉద్యోగాలు చేస్తున్న ఇండియన్ టెక్కీలు.. ఇతర నిపుణులు `ఈబీ-5 వీసా (EB-5 Visa)పై మోజు పెంచుకుంటున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ముంచుకొస్తున్న ఆర్థిక మాంద్యం ముప్పును తప్పించుకునేందుకు టెక్ దిగ్గజాలు వేలల్లో ఉద్యోగులను తొలగించాయి. వారిలో గణనీయ సంఖ్యలో భారతీయులే ఉంటారు. వారంతా హెచ్-1 బీ వీసాపై అమెరికాలోని కంపెనీలో పని చేస్తున్నారు. సదరు కంపెనీ లే-ఆఫ్ జాబితాలో ఉద్యోగం కోల్పోయిన విదేశీయులు ఆరు నెలల్లో మరో కొలువు సంపాదించుకోవాలి. లేదంటే అమెరికా నుంచి స్వదేశానికి తిరిగి వెళ్లాల్సిందే. సకాలంలో ఉద్యోగం దొరకని వారు కూడా ఈబీ-5 వీసా తీసుకోవడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. అమెరికాలో ఉద్యోగాల కల్పన రంగంలో పెట్టుబడులు పెట్టే వారికి ఈ వీసా జారీ చేస్తారు. కనీసం 10 మందికి ఉపాధి కల్పించేందుకు సరిపడా 8 లక్షల డాలర్లు ఇన్వెస్ట్ చేయాలని యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) వర్గాలు తెలిపాయి. అంతే కాదు ఈబీ-5 వీసా పొందిన వారికి త్వరితగతిన గ్రీన్ కార్డు కూడా లభించే అవకాశాలు ఉన్నాయి.
రోజురోజుకు భారత్ నుంచి హెచ్-1 బీ వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారు పెరిగిపోతున్నది. కంప్యూటరైజ్డ్ లాటరీలో హెచ్-1 బీ వీసా పొందడం సవాల్‌గా మారడంతోపాటు ప్రస్తుత అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న ఇండియన్స్, అక్కడే సెటిల్ కావడానికి ఈబీ-5 వీసాలు తీసుకోవడంపై ఫోకస్ చేస్తున్నారు. ఇటీవలి కాలంలో ఈబీ-5 వీసాపై ప్రవాస భారతీయుల్లో ఆసక్తి పెరుగుతున్నదని నిపుణులు చెబుతున్నారు. హెచ్-1బీ వీసాకు అర్హత సాధించకపోతే ఆల్టర్నేటివ్ ఆఫర్‌గా ఈబీ-5 వీసాను ఎంచుకుంటున్నారని తెలుస్తున్నది.
అమెరికా మీడియాలో కథనాల ప్రకారం ఈబీ-5 వీసా కోసం ఆ దేశంలోని రియల్ ఎస్టేట్ సంస్థల్లో పెట్టుబడులు పెడుతున్నారు. ఒక్కొక్కరి నుంచి 8 లక్షల డాలర్ల చొప్పున 20 మంది నుంచి 16 మిలియన్ల డాలర్లను సేకరిస్తున్నట్లు వీసా సేవల సంస్థ తెలిపింది. ఈ నిధులతో 50 మిలియన్ డాలర్ల విలువ గల రెంటల్ అపార్ట్మెంట్, భవనం, హోటల్ నిర్మాణానికి రియాల్టీ డెవలపర్‌కి వీసా సేవల జారీ సంస్థ అప్పుగా ఇస్తుంది. హోటల్ లేదా రెంటల్ అపార్ట్మెంట్ నిర్మాణం వల్ల పరోక్షంగా కొంత మందికి ఉపాధి లభిస్తుంది. మరోవైపు ఈ తరహా పెట్టుబడులపై వడ్డీ ఆదాయం కూడా ఉంటది.
2016-19 మధ్య ఇండియన్ ఇన్వెస్టర్ల నుంచి ఈబీ-5 వీసాల కోసం గిరాకీ 400 శాతం పెరిగిందని యూఎస్ ఇమ్మిగ్రేషన్ ఫండ్ (యూఎస్ఐఎఫ్) తెలిపింది. కరోనా మహ్మారి వేళ ఈ వీసా మూలన పడ్డా.. ఇప్పుడు మళ్లీ తెర మీదకు వచ్చింది. 2019తో పోలిస్తే ఈబీ-5 వీసాల దరఖాస్తులు దాదాపు రెట్టింపయ్యాయి.
అమెరికాలో పర్మినెంట్ రెసిడెన్సీ అర్హత కల్పించే గ్రీన్ కార్డుల కోసం ఎన్నారైలు ఏండ్ల తరబడి వేచి చూడాల్సి వస్తున్నది. ఇక హెచ్-1 బీ వీసా కోసం ఐటీ నిపుణులు తమ కంపెనీల యాజమాన్యాల దయాదాక్షిణ్యాలపై ఆధార పడాల్సి వస్తున్నది. ఉద్యోగం పోతే 60 రోజుల్లో కొత్త ఉద్యోగం సంపాదించుకోవడమా.. స్వదేశానికి వెళ్లిపోవడమా.. అన్నది నిర్ణయించుకోవాల్సి ఉంటది. ఇటువంటి అనిశ్చిత పరిస్థితుల్లో పర్మినెంట్ సొల్యూషన్‌గా కనిపిస్తున్న ఈబీ-5 వీసా.. భారతీయులకు మరింత ఆకర్షణీయంగా ఉన్నది.
అమెరికాలో భారతీయుల జనాభా గణనీయంగా పెరుగుతున్నది. పలువురు భారతీయులు ఎఫ్1 స్టూడెంట్ వీసా లేదా హెచ్-1 బీ వర్క్ వీసా, ఈబీ-5 వీసా కింద ఇప్పటికే అమెరికాలో నివసిస్తున్నారు. ఈబీ-5 కంపెనీల క్లయింట్లతో హైదరాబాద్, ఢిల్లీ, ముంబై వాసుల ఎంక్వైరీలు గణనీయంగా పెరుగుతున్నాయి. హెచ్-1బీ వీసా వర్కర్ల జీవిత భాగస్వాములు డిపెండెంట్ వీసాపై అమెరికా వెళతారు. వారు ఉద్యోగం చేయడానికి వీల్లేదు. అటువంటి వారికి అమెరికాలో పర్మినెంట్ రెసిడెన్సీ అర్హత పొందడానికి ఈబీ-5 ప్రోగ్రామ్ ఆకర్షణీయ ఆల్టర్నేటివ్ ప్రోగ్రామ్‌గా నిలుస్తున్నది.