నిజామాబాద్, మే 10, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కొద్ది రోజులుగా హడలెత్తించిన మూడున్నరేళ్ల పెద్ద పులి జాడ ప్రస్తుతం అంతు చిక్కడం లేదు. సుమారుగా నెల రోజులుగా టైగర్ అడుగు జాడలు కనిపించడం లేదు. దాదాపుగా 6 నెలల పాటు ఉత్తర తెలంగాణతో పాటుగా దక్షిణ తెలంగాణను ఈ పులి అలజడి రేపింది. రాష్ట్రంలోని 11 జిల్లాల్లో తచ్చాడింది. దిగువకు యాదాద్రి భువనగిరి జిల్లాకు సైతం వెళ్లి పలు జంతువులను వేటాడింది. వచ్చిన దారిలోనే తిరుగు ప్రయాణమైంది. నెల క్రితం వరకు సిద్ధిపేట, కామారెడ్డి, నిజామాబాద్, జగిత్యాల అడవుల్లో హల్చల్ చేసింది.
పశువులను వేటాడి అడవుల్లోనే పాద ముద్రికలు కనిపించింది. కానిప్పుడు చడీచప్పుడు లేకుండా పోవడం విస్మయం కలిగిస్తోంది. పెద్ద పులి అడుగు జాడలు ఏమయ్యాయి. ఎటు వైపు వెళ్లింది? సరిహద్దు దాటుకుని ఇతర ప్రాంతాల్లోకి పోయిందా? అంటే అందుకు తగిన ఆధారాల్లేవు. కామారెడ్డిలోనే చివరి సారిగా పెద్దపులి అడుగులు కనిపించాయి. ఆ తర్వాత ఏ జిల్లాలోనూ టైగర్‌కు సంబంధించిన ఆనవాళ్లు లభించడం లేదు. ఈ మధ్యనే నిజామాబాద్, కామారెడ్డి జిల్లా అటవీ శాఖ అధికారులు వికాస్ మీనా, బోగ నిఖితలు బదిలీ అయ్యారు. వీరు ఇరువురు ఈ ప్రాంతంలో పని చేసినప్పుడు టైగర్ అలజడి వెలుగు చూసింది.
పెద్ద పులి ఏమైనట్లు…?
ప్రస్తుతం అటవీ శాఖలో పెద్ద పులి విషయమే హాట్ టాపిక్‌గా మారింది. కొద్ది రోజుల క్రితమే మహారాష్ట్ర అడవుల్లో నుంచి వచ్చిన ఎస్ 12 అనే మగ పులి ఇలాగే వచ్చి మాయమైంది. ఈ పులి అడుగు జాడలు కనిపించకపోగా పులి సురక్షితంగా ఉందా? లేదా? అన్నది రహస్యంగా మారింది. దాదాపుగా 10 నెలలుగా ఎస్ 12 జాడ దొరకడం లేదు. పులి మాయమైందని ప్రచారం జరుగుతున్న దరిమిలా మరో పులి మూడున్నరేళ్ల వయసు కలిగినది ఇదే తోవలో వచ్చింది. మైదాన ప్రాంతాల్లో పొలాల గట్లపై సంచరిస్తూ అటవీ శాఖను సుమారుగా 3 నెలల పాటు ముప్పు తిప్పలు పెట్టింది. నిజామాబాద్, కామారెడ్డి అడవుల్లో మూడున్నరేళ్ల పులి పెద్ద ఎత్తున సంచరించింది.
జగిత్యాల, రాజన్న సిరిసిల్లా, కామారెడ్డి, నిజామాబాద్ సరిహద్దు ప్రాంతాల్లోనే ఎక్కువగా వేటాడింది. పశువులను చంపి ఆహారాన్ని ఆరగించింది. మార్చి నెలాఖరులో కామారెడ్డి, నిజామాబాద్ అడవుల్లోకి ప్రవేశించింది. ఏప్రిల్ నెల మొదటి వారంలోనూ అలజడి బయట పడింది. ప్రతి అడుగు ట్రాకింగ్ కెమెరాలో నిక్షిప్తమైంది. తాజాగా పెద్ద పులి జాడ అన్నదే అంతు చిక్కడం లేదు. ట్రాకింగ్ కెమెరాలకు అందకుండా టైగర్ తప్పించుకోవడం అసాధ్యమైని అటవీ శాఖ అధికారులే చెబుతున్నారు. అలాంటప్పుడు ఎటు వెళ్లింది? ఏమైంది? అన్నది మాత్రం తేలడం లేదు. వేటగాళ్ల ఉచ్చులో చిక్కి పెద్ద పులి మృత్యువాత పడిందా? వేసవి తాపానికి బలి అయ్యిందా? అన్నది తేలాల్సి ఉంది. ఈ విషయంపై అటవీ శాఖ అధికారులను సమాచారం కోసం సంప్రదించగా స్పందించేందుకు నిరాకరించారు.