School Bag | పిల్లల అనారోగ్యానికి కారణమవుతున్న పుస్తకాల బ్యాగు మోత..
స్కూల్ పిల్లల బాల్యంపై బ్యాగుల భారం పడుతున్నది. అంత బరువును ఎలా మోస్తారో అని వారి వీపులకు బ్యాగులు చూసే తల్లిదండ్రులకు బాధేస్తున్నది. బరువైన స్కూల్ బ్యాగులతో బడులకు వెళ్లే విద్యార్థులను మనం చూస్తుంటాం. పాఠశాలల యాజమాన్యాలు అవసరం లేకపోయినా పుస్తకాలను కొనుగోలు చేయించి పిల్లల వీపునకు తగిలిస్తున్నాయి.
- చిన్నారుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం
- ప్రభుత్వ నిబంధనలు బేఖాతరు చేస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థలు
- పుస్తకాల బరువు తగ్గించాలంటున్న వైద్యులు
- పట్టించుకోని విద్యా శాఖ అధికారులు
School Bag | కామారెడ్డి, జూలై 2 : స్కూల్ పిల్లల బాల్యంపై బ్యాగుల భారం పడుతున్నది. అంత బరువును ఎలా మోస్తారో అని వారి వీపులకు బ్యాగులు చూసే తల్లిదండ్రులకు బాధేస్తున్నది. బరువైన స్కూల్ బ్యాగులతో బడులకు వెళ్లే విద్యార్థులను మనం చూస్తుంటాం. పాఠశాలల యాజమాన్యాలు అవసరం లేకపోయినా పుస్తకాలను కొనుగోలు చేయించి పిల్లల వీపునకు తగిలిస్తున్నాయి. పుస్తకాల బ్యాగు మోత.. పిల్లల అనారోగ్యానికి కారణమవుతున్నది. తద్వారా చిన్నారులు విద్యార్థి దశ నుంచే కండరాల బలహీనత, వెన్ను నొప్పి బారిన పడుతున్నారు. బడి నుంచి సాయంత్రం ఇంటికి వచ్చే సమయానికే నీరసపడిపోతున్నారు. ముఖ్యంగా ప్రైవేట్ స్కూళ్ల యాజమన్యాలు ఇష్టం వచ్చినట్లు పుస్తకాలను అంటగడుతున్నాయి.
ప్రైవేట్ పాఠశాలల్లో చదివే విద్యార్ధులకు బ్యాగుల భారం తగ్గడంలేదు. గతంలో విద్యాశాఖ జీవో జారీ చేసినప్పటికీ ప్రైవేట్ పాఠశాలల్లో మాత్రం నిబంధనలు పాటించడం లేదు. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు విద్యార్థుల వయస్సుకు, తరగతులకు మించి పుస్తకాల భారం మోపుతున్నాయి. దీంతో పిల్లలపై మానసికంగా, శారీరకంగా తీవ్ర ప్రభావం పడుతున్నది. ఈ భారం తగ్గించేందుకు రాష్ట్రప్రభుత్వం ఆదేశాల మేరకు 2017 జూలై 19న విద్యాశాఖ జీవో నంబర్ 22 జారీ చేసింది. జీవోను పకడ్బందీగా అమలుచేయాలని ప్రభుత్వం విధివిధానాలను విడుదల చేసింది. జిల్లా విద్యాశాఖ అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. మండలాల పరిధుల్లో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలతో అధికారులు సమావేశాలు నిర్వహించారు. కానీ ప్రైవేట్ పాఠశాలలు మాత్రం నిబంధనలను పాటించడం లేదు. విద్యను వ్యాపారంగా మారుస్తూ పాఠశాలల్లోనే విద్యార్థులకు అవసరానికి మించి పుస్తకాలను విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. పలు విద్యార్థి సంఘాల నాయకులు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని వినతి పత్రాలు అందజేశారు. అయినప్పటికీ సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోవడం లేదని విద్యార్ధి సంఘాలు మండిపడుతున్నాయి.
నిబంధనలు ఇవీ…
విద్యార్థుల బ్యాగు బరువుకు సంబంధించి గతేడాది విద్యాశాఖ పలు మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ నిబంధనలను ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలన్నీ పాటించాలని ఆదేశించింది. 1, 2 తరగతులు చదివే విద్యార్థుల స్కూల్ బ్యాగుల బరువు 1.5 కిలోల లోపు, 3, 4, 5 తరగతులకు 2 నుంచి 3 కిలోల వరకు, 6, 7 తరగతులకు 4 కిలోల లోపు, 8, 9, 10 తరగతులకు 5 కిలోల లోపు ఉండాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. కానీ ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు వివిధ రకాల మెటీరియల్స్, సిలబస్‌ల పేరుతో పిల్లల భుజాన మోయలేని భారం మోపుతున్నాయి. జిల్లాలో పలు స్కూళ్లు పలు అంతస్తుల్లో కొనసాగుతున్నాయి. విద్యార్థులు బ్యాగులు మోస్తూ పైఅంతస్తులకు వెళ్లేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో పిల్లల ఆరోగ్యంపైన భారం పడుతున్నది. పలు సమావేశాల్లో బ్యాగుల భారం తగ్గించాలని విద్యాశాఖ అధికారులకు విన్నవించినప్పటికీ పట్టించుకోవడం లేదని పిల్లల తల్లిదండ్రులు వాపోతున్నారు.
లెక్కకు మించి బుక్స్..
ప్రైవేట్ పాఠశాలల్లో రెగ్యులర్ సిలబస్‌తోపాటు అసైన్మెంట్, ప్రాజెక్టులు, స్లిప్ టెస్టులు, క్లాస్ వర్క్, హోం వర్కు, రఫ్ కాపీ, గైడ్, డైరీ, డ్రాయింగ్, క్రాఫ్ట్, ఆర్ట్, జనరల్ నాలెడ్జ్, కంప్యూటర్ బుక్ ఇలా విద్యార్థులకు ప్రతి సబ్జెక్ట్‌కు 6 నుంచి 7 నోటు బుక్స్లను కేటాయిస్తూ విద్యార్థులపై అధిక భారం మోపుతున్నారు. ప్రతి రోజూ ఆయా సబ్జెక్టులు చెప్పనప్పటికీ విద్యార్థులు ప్రతి రోజూ అన్ని పుస్తకాలను మోసుకెళ్తున్నారు. విద్యార్థుల బరువులో బ్యాగు బరువు 10 శాతం మించకూడదు. అంటే 30 కిలోల బరువు ఉన్న విద్యార్థికి 3 కిలోల బ్యాగు ఉండాలని. కానీ ఒకటో తరగతి చదివే విద్యార్థి శరీర బరువు 15 కేజీలు ఉంటే పుస్తకాల బరువు 1.5 కిలోలకు బదులుగా 5 కిలోలు ఉంటున్నది. ఇలా ఏ తరగతి విద్యార్థిలను తీసుకున్నా పరిమితికి మించి బ్యాగులు ఉంటున్నాయి. ప్రభుత్వ పాఠశాల్లో సబ్జెక్ట్ వారీగా పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్ ఉంటాయి. తమ స్కూల్లోనే పుస్తకాలను కొనుగోలు చేయాలని ప్రైవేట్ పాఠశాలలు విద్యార్థులకు సూచిస్తుండడంతో పుస్తకాల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. అధిక బరువు ఉన్న బ్యాగులు మోయడం ద్వారా పిల్లల్లో ఎముకలు, కండరాల ఎదుగుదలపై తీవ్ర ప్రభావం పడడంతో పాటు మెడ, భుజాలు, వెన్నునొప్పితో బాధపడుతున్నారు.
పిల్లల ఎదుగుదల పై ప్రభావం పడుతుంది..
విద్యార్థులు అధిక బరువులు మోయడం ద్వారా మానసికంగా, శారీరకంగా అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నది. ముఖ్యంగా మెడ, వీపు, నడుముపై తీవ్ర ప్రభావం పడుతుంది. చిన్నారుల శారీరక ఎదుగుదలపై ప్రభావం పడుతుంది. నిబంధనలకు అనుగుణంగా బ్యాగులు ఉండేలా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలి.
-డాక్టర్ నరేందర్ రావు, పిల్లల వైద్య నిపుణుడు
ఎక్కువ పుస్తకాలు అమ్మిన వారిపై చర్యలు తీసుకుంటాం..
ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులకు ఎక్కువ పుస్తకాలు విక్రయిస్తే చర్యలు తీసుకుంటాం. విద్యార్థులపై బ్యాగుల భారం వేయవద్దని గతంలోనే సూచనలు చేశాం. ఏ తరగతి విద్యార్థి బ్యాగు బరువు ఎంత ఉండాలో స్పష్టంగా సూచించాం. నిబంధనలు పాటించని పాఠశాలలపై చర్యలు తీసుకుంటాం.
-రాజు, జిల్లా విద్యాశాఖ అధికారి
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

