గాంధారి, డిసెంబర్ 1: దేవుడిపై భక్తులకు ఉన్న నమ్మకానికి నిదర్శనం గాంధారి మండలంలోని గండివేట్ గ్రామం. కులమతాలకు అతీతంగా గ్రామంలోని అశీర్ఖానలో కొలువై ఉన్న కాశీందులా పీర్లంటే గ్రామస్తులకు ఎంతో ఇష్టం. గ్రామంలోని అశీర్ఖానలో కొలువై ఉన్న కాశీందులా పీర్లపై భక్తిని చాటు కోవడానికి గ్రామంలోని ఏ ఇంటికి వెళ్లినా దేవుడి పేరును పెట్టుకున్నవారే కనిపిస్తుంటారు. మొహర్రం మాసంలో పీర్ల పండుగను కులమతాలకు అతీతంగా ఘనంగా జరుపుకొంటూ మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్నారు.
ఇంటికో… కాశీరాం…
గండివేట్ గ్రామంలో దాదాపు 4వేల జనాభా ఉండగా వీరిలో సగానికి పైగా కాశీరాం పేర్లు, కాశీందుల పీర్లను గుర్తు చేస్తుంటాయి. పీర్లను మొక్కుకొని, కోరిన కోరికలు తీరిన వారు ఇంట్లో ఒకరికైనా దేవుడిపేరును పెట్టుకొని భక్తిని చాటుకుంటున్నారు. కాశీందులా(దేవుడి) పేరు వచ్చేలా కాశీరాం, కాశీనాథ్, కాశీం, కాశీంబీ, కాశవ్వ, కాశీ, కాశయ్య, కాశమ్మ, కాశవ్వ, క్రాంతి తదితర పేర్లు ఉన్నవారు అధికం. గండివేట్ గ్రామస్తులే కాదు కాశీందులాను నమ్ముకున్న ఇతర గ్రామాలకు చెందిన వారు సైతం, తమ కుటుంబంలో ఒక్కరికైనా దేవుడి అక్షరం వచ్చేలా పేరును పెట్టుకొని భక్తిని చాటుకుంటున్నారు.
మారు పేరుతో పిలవాల్సిందే..
గండివేట్లో సగానికి పైగా ప్రజల పేర్లు కాశీరాం అనే పేరును కలిగి ఉండడంతో వారిని గుర్తించడం చాలా కష్టం. కాశీరాం అని పిలిస్తే చాలు చుట్టు పక్కల కాశీరాం పేర్లతో ఉన్న వారంతా పలుకుతారు. కాశీరాం అనే పేరున్న వ్యక్తిని గుర్తుపట్టాలన్నా, వారిని పిలువాలన్నా తప్పకుండా వారి మారుపేరుతో పిలవాల్సిందే. ఇంటి పేర్లతోపాటు మారుపేర్లు, ముద్దు పేర్లు, వారు చేసే వృత్తుల ఆధారంగా పిలుస్తారు.
పీర్లతో గండివేట్కు గుర్తింపు..
గండివేట్ గ్రామంలో కొలువై ఉన్న కాశీందుల పీర్లతో గండివేట్ గ్రామానికి గుర్తింపు వచ్చింది. గ్రామంలో సగానిపైగా ప్రజల పేర్లు కాశీందులా వచ్చేలా ఉంటాయి. గ్రామంలో అందరం కులమతాలకు అతీతంగా కలిసిమెలిసి ఉంటాం.
-అబ్దుల్ ఫారూఖ్, గండివేట్, సర్పంచ్
ఇంటిపేరుతో పిలుస్తారు..
కాశీందులా దేవుడి పేరును పోలిన విధంగా చాలా మంది పేర్లు ఉన్నాయి. దీంతో కాశీరాం అని పిలిస్తే ఒకరికి బదులుగా మరొకరు పలుకుతారు. ఎవరినైనా పిలవాలంటే మారుపేరుతో కానీ వారి ఇంటి పేరుతో పిలుస్తాం.
-సొన్నాయి కాశీరాం, గండివేట్, గాంధారి మండలం
మతసామరస్యానికి ప్రతీక
కులమతాలకు అతీతంగా కాశీందులాపై భక్తిని చాటుకునేందుకు దేవుడి పేరును పెట్టుకొని మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్నాం. గ్రామంలో పీర్ల పండుగను అందరం కలిసిమెలిసి జరుపుకొంటాం.
-డ్రైవర్ కాశీం, గండివేట్, గాంధారి మండలం